జనసేనాని పవన్‌కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ జరిగిందంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నానా యాగీ చేశాయి. తెలంగాణ పోలీసులు విచారించి, రెక్కీ జరగలేదని తేల్చి చెప్పారు. పవన్‌కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ జరిగిందన్న ప్రచారంలో నిజానిజాల్ని తెలుసుకోకుండా 14 ఏళ్ల పాటు సీఎంగా పని చేసిన చంద్రబాబునాయుడు ఖండించడం ఆశ్చర్యం కలిగించింది. ఎవర్నీ బతకనివ్వరా అంటూ ఆయన చిందులు తొక్కి…తన నిజస్వరూపాన్ని ప్రదర్శించారు.
రెక్కీతో పరువు పోగొట్టుకున్నా, టీడీపీకి జ్ఞానోదయం రాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. చంద్రబాబు రోడ్ షోలో ఎవరో రాళ్ల దాడి చేశారట! ఆ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ అధికారి మధు గాయపడ్డారని ప్రచారం జరుగుతోంది. కరెంట్ సరఫరా నిలిపి, రాయితో దాడి చేశారని చెబుతున్నారు.
దాడులను ఎవరూ ప్రోత్సహించరు. అయితే పచ్చ బ్యాచ్ అతి కారణంగా నిజంగా ఏదైనా జరిగినా నమ్మలేని పరిస్థితి నెలకుంది. ఇప్పుడు రాయి దాడి ఘటనను కూడా ఏపీ ప్రజానీకం అట్లే చూస్తున్నారు. పవన్‌కల్యాణ్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని జనసేన చెప్పడం, దాన్ని టీడీపీ , బీజేపీ బలపరచినట్టే, ఇప్పుడు రాయిదాడి అలాంటిదే అయి వుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి చేయాల్సిన అవసరం ఎవరికి వుంటుంది? అధికార పార్టీ ఇలాంటి దాడికి పాల్పడి, తనకు తానుగా అప్రతిష్ట తెచ్చుకుంటుందా? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ ఇంటి వద్ద మందుబాబులు హడావుడి చేసినట్టే, టీడీపీ కార్యకర్తలెవరో మద్యం మత్తులో రాయితో దాడి చేసి వుంటారని వైసీపీ నేతలు వ్యంగ్యంగా అంటున్నారు.
చివరికి టీడీపీ అతి చేష్టలు… నాన్నా పులి కథను గుర్తు చేస్తున్నాయని అంటున్నారు. ఆరోపణల్లో కనీసం సగమైనా నిజాలు వుంటే నమ్మొచ్చని, అసలే లేని చోట ఏదో వుందని సృష్టించే క్రమంలో టీడీపీ అభాసుపాలవుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.