అన్నీ మంచి శకునములే అని వైసీపీ నేతలు హాయిగా పాడుకోవచ్చు. ఇపుడు ఉత్తరాంధ్రా మీద వైసీపీ సర్కార్ ఫోకస్ బాగా ఉంది. దానికి తగినట్లుగా చాలా కాలంగా ఆగిన పనులన్నీ ఇపుడు జోరు చేసి మరీ ప్రారంభానికి సిద్ధమైపోతున్నాయి. ఒక వైపు విశాఖలో ఉత్తరాంధ్రా వాసుల చిరకాల కోరిక రైల్వే జోన్ కల సాకారం అవుతోంది. అలాగే విశాఖలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.
విజయనగరం జిల్లాలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా న్యాయపరమైన అడ్డంకులు ఇదే సమయంలో తొలగిపోవడం విశేషం. కొన్నేళ్ల క్రితం భూ సేకరణకు వ్యతిరేకంగా కొందరు రైతులు కోర్టులో వేసిన పిటిషన్లను అన్నీ కొట్టేస్తూ హై కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. దాంతో ఇపుడు ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేయడానికి మంచి రోజులు వచ్చేశాయి.
అటు శ్రీకాకుళంలో భావనపాడు పోర్టు నిర్మాణానికి కూడా రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు ఉత్సాహంగా వచ్చారు. వారికి ఎకరాకు ఏకంగా పాతిక లక్షలు ఇవ్వడానికి వైసీపీ సర్కార్ ముందుకు రావడంతో రైతులు హర్షం చేస్తున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ చొరవ చూపి మరీ పెద్ద మొత్తాన్ని రైతులకు ఇవ్వడానికి సిద్దపడ్డారు. దీంతోఆ రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.
తొందరలోనే ముఖ్యమంత్రి జగన్ భావనపాడు పోర్టుకు శంకుస్థాపన చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా వరసబెట్టి చూసుకుంటే రైల్వే జోన్, ఎయిర్ పోర్టు సీ పోర్టు అన్నీ కూడా ఉత్తరాంధ్రాలో ఒకే టైం లో అలా వచ్చేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో ఈ ప్రాంతం అంతా సమగ్రమైన అభివృద్ధి సాధిస్తుంది అనడానికి ఇవే నిదర్శనంగా మారబోతున్నాయి.