తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పొప్పుల గురించి మాట్లాడుకుంటే.. ఆయన చేసిన మంచితో పాటు.. కొన్ని నిర్ణయాల వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న నష్టాలు కూడా చర్చించుకోవాల్సిందే. అయితే అలా చర్చించే దమ్ము అక్కడి స్ట్రీమ్ మీడియాకి లేదు. ఇక తప్పుల్ని ఎత్తిచూపి సరిదిద్దాల్సిన విపక్షాలు కూడా అనైక్యతతో కొట్టుమిట్టాడుతున్నాయి.
కరోనా నివారణ, వైద్య సేవలు, ముందు జాగ్రత్తల విషయంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యం చెందిందనే విషయం అక్షర సత్యం. ప్రభుత్వ చర్యలు సఫలమై ఉంటే ఇప్పుడీ స్థాయిలో కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరగదు. పోనీ చేతులు కాలాక అయినా ఆకులు పట్టుకుంటున్నారా అంటే అదీ లేదు. ఇక ప్రతిపక్షాలు కూడా ఎవరికి వారే యమునాతీరే అనే పంథాలో వెళ్తున్నాయి.
కరోనా బాధితుల్ని ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందంటూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయనకు తెలంగాణ టీడీపీ, వామపక్షాలు మద్దతుగా నిలిచాయి. ఒకరకంగా కోదండరాం మంచి పాయింటే తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జనాలకు మొహం చాటేసిన ప్రొఫెసర్.. ఇప్పుడు సడన్ గా కరోనా కష్టాలపై నిరాహార దీక్ష చేస్తున్నారు.
అయితే ఈయన చేస్తున్న దీక్షకి ఫలితం ఏదైనా ఉంటుందా, ప్రభుత్వం అసలు కోదండరాంని లెక్కలోకి తీసుకుంటుందా? అంటే అనుమానమే.
అటు కాంగ్రెస్, బీజేపీ కూడా కరోనా విషయంలో ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. కేసీఆర్ అసమర్థత వల్లే తెలంగాణలో కేసులు పెరిగిపోతున్నాయని దుయ్యబడుతున్నారు నేతలు. ప్రజా ప్రతినిధులు కూడా కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే కరోనా బారినపడ్డారని, పేదలకు గాంధీలో, పెద్దలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా వైద్యం చేయించడం ఎంతవరకు సబబు అనేది వీరి వాదన.
అందరి లక్ష్యం ఒకటే ఐనప్పుడు విపక్షాలన్నీ కలసి పోరాటం చేస్తే ఫలితం ఉంటుంది. వీరి ఒత్తిడికి తలొగ్గి అయినా ప్రభుత్వం తన పంథా మార్చుకుంటుంది, వారి సలహాలు స్వీకరిస్తుంది. కానీ తెలంగాణ విపక్షాల్లో ఐక్యత కొరవడింది. కాంగ్రెస్ పాటికి కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. వీరి ఇంటర్నల్ పాలిటిక్స్ కథ ఇంకోటి ఉందనుకోండి. అది వేరే విషయం. అటు బీజేపీ నేతలు కూడా కేసీఆర్ ని టార్గెట్ చేశారు. పోనీ వీరంతా కరోనా పోరులో కోదండరాంకి మద్దతిస్తారా అంటే అదీ లేదు. ఎవరి మాట నెగ్గాలని వారు తాపత్రయ పడుతున్నారు.
అంతిమంగా వీరిలో ఐకమత్యం లేకపోబట్టే కేసీఆర్ ఆడింది ఆట, పాడింది పాటగా సాగుతోంది. కనీసం రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితుల్ని తనదాకా తెచ్చేవారు లేకపోవడం వల్లే కేసీఆర్ కూడా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. రాజకీయాలకి, పార్టీలకి అతీతంగా కరోనాని నాయకులు ఎదుర్కొన్నప్పుడే.. తెలంగాణలో ఈ మహమ్మారి అదుపులోకి వస్తుంది.