అసోంలో ఎన్ఆర్‌సీ : పాతబస్తీలో ప్రకంపనలు!

అసోంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్‌సీ) జాబితా తాలూకు ప్రకంపనలు.. పాతబస్తీలో కూడా కనిపిస్తున్నాయి. ఇదే ఎన్ఆర్‌సీని దేశవ్యాప్తంగా అమలు చేస్తే గనుక.. ఆందోళనలు చెలరేగే, అనధికారిక పౌరులు…

అసోంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్‌సీ) జాబితా తాలూకు ప్రకంపనలు.. పాతబస్తీలో కూడా కనిపిస్తున్నాయి. ఇదే ఎన్ఆర్‌సీని దేశవ్యాప్తంగా అమలు చేస్తే గనుక.. ఆందోళనలు చెలరేగే, అనధికారిక పౌరులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోకి హైదరాబాదు నగరంలోని పాతబస్తీతో పాటు, పలుప్రాంతాలు కూడా చేరే అవకాశం ఉంది. నగరంలో పెద్దసంఖ్యలోనే పౌరసత్వాలు రద్దయ్యే ప్రమాదం ఉంటుందని భావిస్తున్న తరుణంలో.. ఎన్ఆర్‌సీ ప్రకంపనలు రాజకీయంగా కూడా కుదిపేస్తున్నాయి.

జాతీయ పౌరపట్టిక (ఎన్ఆర్‌సీ) అనేది భారతీయ జనతా పార్టీ యొక్క దీర్ఘ కాలిక ఎజెండా. చాలా కాలం నుంచి వారు దాని గురించి ప్రస్తావిస్తున్నారు. పొరుగుదేశాల నుంచి భారత్‌లోకి చొరబడి ఇక్కడ అక్రమంగా నివసిస్తున్క వారిని లెక్కతేల్చే ప్రయత్నంగా వారు దీనిని పేర్కొంటున్నారు. ఆ క్రమంలో దీనిని ప్రయోగాత్మంగా అసోంలో నిర్వహించి.. కొన్ని రోజుల కిందటే తుది జాబితాని ప్రకటించారు. దాని ప్రకారం.. 19 లక్షలకు పైగా అక్రమ చొరబాటుదారులు ఉంటున్నట్టు గుర్తించారు.

ఇదే ఎన్ఆర్‌సీ ప్రక్రియను దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అమల్లోకి తీసుకురావాలనే సంకల్పాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తోంది. దేశంలో ఉండే మొత్తం చొరబాటుదారులందరినీ ఏరివేస్తే గనుక.. శాంతిభద్రతల పరిస్థితి చాలా వరకు అదుపులోకి వస్తుందనేది ఒక  నమ్మకం.

ఇలాంటి ఈ ఎన్ఆర్‌సీ వ్యవహారంపై విపక్షాలనుంచి కూడా పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా ఎన్ఆర్‌సీ  ప్రభావం దేశానికి భూసరిహద్దుల్లో ఉండే రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువగా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు దాని ప్రభావం ప్రత్యేకించి హైదరాబాదు పాతబస్తీ, తెలంగాణలోని మరి కొన్ని ప్రాంతాలకు ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్‌సీ మొత్తం తప్పుల తడక అంటూ మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిరసిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా దీన్ని అమలు చేయాలంటూ.. భాజపాకు రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలను ట్విటర్ ద్వారా కోరారు. దేశవ్యాప్తంగా అమలు అనేది కార్యరూపం దాలిస్తే.. ఎన్ఆర్‌సీ ప్రకంపనలు హైదరాబాదులో మరింత ఉధృతంగా ఉంటాయని అనుకోవచ్చు.