సౌర, పవన విద్యుత్తు ఒప్పదాలు, పీపీఏలపై సమీక్షకు వెళ్లవద్దని, ప్రజాభిప్రాయ సేకరణ కూడా వద్దని కేంద్ర విద్యుత్తు ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయం ఫైనలేమీ కాదు. ట్రిబ్యునల్ తీర్పు చెప్పినంత మాత్రాన.. అది అంతిమ నిర్ణయం కాదు. అందుకే దీనిపై సుప్రీంలో అప్పీలు చేయడానికి జగన్ ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తోంది.
సౌర, పవన విద్యుత్తు విషయంలో గత ప్రభుత్వం ఏకంగా 25 ఏళ్ల కాలానికి ఒకేసారి చేసుకున్న ఒప్పందాలు చాలా దుర్మార్గమైనవి, దోపిడీ ఆలోచనలతో కూడుకున్నవి అని జగన్ ప్రభుత్వం నమ్ముతోంది. అందుకే.. పీపీఏలను సమీక్షించడానికి పూనుకున్నది కూడా అందుకే. విద్యుతు పరంగా తమ ప్రభుత్వం సంకల్పించిన సంక్షేమాన్ని అమల్లో పెట్టడానికి, సంస్కరణలను తేవడానికి.. పీపీఏల భారం పెద్ద అడ్డంకిగా ప్రభుత్వం భావించింది. ఈ లోపాయికారీ ఒప్పందాలతో ప్రమేయం ఉన్న చాలా మంది.. పీపీఏల సమీక్ష వద్దని అంటున్నా.. జగన్ పట్టుపట్టింది అందుకే. అయితే ఇప్పుడు ట్రిబ్యునల్ తీర్పుతో ప్రత్యామ్నాయం అన్వేషిస్తున్నారు.
దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా అమరావతి వర్గాల సమాచారం. ఎందుకంటే.. జగన్ ప్రస్తుతానికి పీపీఏల సమీక్షకు మాత్రమే ఆదేశించారు. అంతే తప్ప ఆ ఒప్పందాలను రద్దు చేసేయలేదు. మరి సమీక్షలకే అంతగా ఆ సంస్థలు ఉలికిపడవలసిన అవసరం కూడా లేదు. గత ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందాలను, తర్వాతి ప్రభుత్వాలు సమీక్షించడం కూడా తప్పే అనేట్లయితే.. అది రాజకీయ ప్రభుత్వాల నియంతృత్వానికి, విచ్చలవిడితనానికి గేట్లు ఎత్తేసినట్లు లెక్క. ఎందుకంటే.. ఒకసారి అధికారంలోకి వస్తే చాలు, మీరు ఎంతైనా దోచేసుకోండి, మీ దుర్మార్గాలను మీ తర్వాత అధికారంలోకి వచ్చే ఎవ్వరూ ప్రశ్నించడానికి కూడా వీల్లేదు అన్నట్లుగా అది ఉంటుంది. అందుకే ఈ విషయంలో అమీ తుమీ తేల్చుకోవడానికి జగన్ సర్కారు సుప్రీంను ఆశ్రయించే ఉద్దేశంతో ఉంది.
ఈలోగా విద్యుత్తు పీపీఏల్లో ఎలాంటి అక్రమాలు జరిగాయో.. నిగ్గుతేల్చి.. వాటిని సుప్రీం ముందు పెట్టి.. ఏ రకంగా గత అయిదేళ్లలో రాష్ట్రాన్ని ఏకంగా రెండున్నర దశాబ్దాల పాటు దోచుకోవడానికి కుట్రలు చేశారో నిరూపించడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.