పాకిస్తాన్ లాగానే చేస్తున్న నారాయణ

మన దేశంలో ప్రభుత్వ పరిపాలనలో లోపాలు ఉంటే ప్రతిపక్షాలు పోరాడాలి. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజల ఎదుట ఎండగట్టాలి. అలాంటి ప్రభుత్వాలు మళ్లీ గద్దె ఎక్కకుండా, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. పరిపాలన గాడి తప్పకుండా, ప్రతిపక్షమైన…

మన దేశంలో ప్రభుత్వ పరిపాలనలో లోపాలు ఉంటే ప్రతిపక్షాలు పోరాడాలి. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజల ఎదుట ఎండగట్టాలి. అలాంటి ప్రభుత్వాలు మళ్లీ గద్దె ఎక్కకుండా, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. పరిపాలన గాడి తప్పకుండా, ప్రతిపక్షమైన తాము కాపలా కాస్తూ ఉండాలి..  ఇది సాధారణంగా ఉండవలసిన, ఆదర్శనీయమైన రాజకీయ వ్యవస్థ. కానీ ఇప్పుడు పరిణామాలను గమనిస్తుంటే.. ఇక్కడే రాజకీయ పార్టీలు, వారి చేతలు శత్రు దేశాల ఏజెంట్లు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి.

సిపిఐ పార్టీకి జాతీయ కార్యదర్శి అయినటువంటి తెలుగువాడు కె నారాయణ గురించి మనందరికీ తెలుసు.  విలక్షణమైన, కొన్ని సందర్భాలలో వివాదాస్పదమైన తన వ్యవహారాలతో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.  తాజాగా ఆయన అమెరికా అధ్యక్ష భవనం  వైట్ హౌస్ ఎదుట, కాశ్మీరు అంశంపై నిరసన తెలియజేశారు. జస్టిస్ ఫర్ కాశ్మీర్ అనే అక్షరాలు ముద్రించిన ప్లకార్డును చేతబట్టి ఆయన అమెరికాలో నిరసన తెలియజేశారు. ఇలాంటి చర్య ద్వారా నారాయణ ఏం ఆశిస్తున్నారో మాత్రం అర్థం కావడం లేదు.

 జమ్మూకాశ్మీర్లో 370వ అధికరణాన్ని రద్దు చేయడం అనేది మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం. అందులో లోపం ఉండవచ్చు. సరిదిద్ద వలసిన అవసరం ఉండవచ్చు. కానీ, ప్రభుత్వం మీద పోరాడి ప్రభుత్వం ద్వారానే దానిని సాధించుకోవాలి. ఎందుకంటే ఇది పూర్తిగా మన దేశ అంతర్గత వ్యవహారం. దీనిని బయటి దేశాల ఎదుట పంచాయతీ పెట్టడం మనదేశ ఆత్మగౌరవానికి దెబ్బ.  మహా అయితే ఇది ఇండో పాకిస్తాన్ ల మధ్య ఉన్న గొడవ. ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాల్సిన అంశం. ఆ విషయాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఒప్పుకున్నారు.

 ఇలాంటి నేపథ్యంలో బాధ్యత గల ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయి కార్యదర్శి అయిన నారాయణ..  అమెరికాలో కాశ్మీర్ కు న్యాయం చేయాలంటూ ప్రదర్శించి నిరసన తెలియజేస్తూ ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు.  అమెరికా జోక్యం చేసుకుని కాశ్మీర్ వ్యవహారాన్ని సెట్ చేయాలని నారాయణ కోరుకుంటున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. 

ఆయన అమెరికాలో పర్యటిస్తారని ఉంటే గనుక, అక్కడ కూడా తన ఉద్యమస్ఫూర్తిని చాటుకోవాలని ముచ్చటపడితే గనుక, అందుకు ఇంకా అనేక మార్గాలు ఉంటాయి. అక్కడి భారతీయులతో ఒక సమావేశం నిర్వహించి,  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న గురించి వారిలో చైతన్యం కలిగించవచ్చు.  అంతేతప్ప కాశ్మీర్ వంటి సున్నితమైన అంశంపై, అమెరికా అధ్యక్షుడు జోక్యం చేసుకోవాలని  సంకేతం వచ్చేలాగా  ఇలాంటి మొక్కుబడి నిరసనలు చేయడం మంచిది కాదు.