అయ్యన్న తీరు.. నోరు.. జోరు…?

విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ తెలుగుదేశం నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీరు మారలేదు, నోరు జోరు కూడా అలాగే ఉంది. ఆయన ఏడు పదుల వయసుకు చేరువ అవుతున్నారు. పలుమార్లు మంత్రిగా…

విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ తెలుగుదేశం నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీరు మారలేదు, నోరు జోరు కూడా అలాగే ఉంది. ఆయన ఏడు పదుల వయసుకు చేరువ అవుతున్నారు. పలుమార్లు మంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా అనేక సార్లు నెగ్గారు. అలాంటి అయ్యన్న యువతరం ప్రతినిధులకు ఆదర్శంగా ఉండాలి. కానీ ఆయన నోటి వెంట జాలువారుతున్న భాష మాత్రం కాస్తా ఎబ్బెట్టుగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.

జగన్ సర్కార్ తప్పులు చేసి ఉండవచ్చు. వాటిని విపక్ష నేతగా గట్టిగా విమర్శించే హక్కు అయ్యన్న లాంటి వారికి ఉండవచ్చు. అంత మాత్రం చేత వ్యక్తిగతంగా టార్గెట్ చేసి జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా సంచలన వ్యాఖ్యలు చేయడం అయ్యన్నకు తగునా అన్నదే ఇక్కడ చర్చ.

జగన్ని పట్టుకుని పిచ్చి రెడ్డి అంటున్నారు అయ్యన్న, అంతే కాదు ఆయనకు తుగ్లక్ రెడ్డి అన్న పేరు కూడా తానే పెట్టాను అని ఆయన చెబుతున్నారు. ఇంతకీ అయ్యన్న బాధ ఏంటి అంటే ఏపీలో మటన్ షాపులను ప్రభుత్వమే నిర్వహించడం, అలాగే సినిమా టికెట్లను ఆన్ లైన్ లో పెట్టి అమ్మడం.

నిజమే దీని మీద ఆయా సెక్షన్లలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాని మీద అలా కాదు ఇలా చేయండి అంటూ హుందాగా సూచనలు చేయడం వంటివి అయ్యన్న వంటి బాధ్యత కలిగిన సీనియర్ నేతలు చేయాల్సిన పని. దాన్ని పట్టుకుని పిచ్చి రెడ్డి అంటూ దుర్భాషలు ఆడడమేంటన్న విమర్శలు వస్తున్నాయి.  

అయ్యన్న తీరు చూస్తే నాలుగు అనడం, వైసీపీ నేతల నుంచి మరో నాలుగు తినడం లాగానే కధ లాగించాలనిపిస్తోంది అంటున్నారు. అయ్యన్న వ్యవహార శైలి పట్ల వైసీపీ నేతలు కస్సుమంటున్నారు. ఇదేం భాష అంటూ మండిపడుతున్నారు కూడా.