లోకేష్ మెడకు ‘గ్రిడ్’ చుట్టుకుంటుందా?

ఆమధ్య మా చినబాబుని అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు, పులిబిడ్డలా బయటకొచ్చారు అంటూ టీడీపీ నేతలు నానా హడావిడి చేశారు. కట్ చేస్తే ఇప్పుడు సిల్లీ కేసులతో కాదు వందల కోట్ల కుంభకోణంలో…

ఆమధ్య మా చినబాబుని అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు, పులిబిడ్డలా బయటకొచ్చారు అంటూ టీడీపీ నేతలు నానా హడావిడి చేశారు. కట్ చేస్తే ఇప్పుడు సిల్లీ కేసులతో కాదు వందల కోట్ల కుంభకోణంలో చినబాబు అరెస్ట్ అయి జైలు ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అవును, ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో నారా లోకేష్ నెక్స్ట్ టార్గెట్ కాబోతున్నారు. టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలపై సీఐడీ కేసు నమోదు చేసింది. 

మొత్తం 19మందిని నిందితుల జాబితాలో చేర్చింది. ఇందులో నారా లోకేష్ కి అతి సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ ప్రసాద్ పేరు మొదటి స్థానంలోనే ఉంది. తర్వాతి లిస్ట్ లో సూత్రధారిగా లోకేష్ పేరు కూడా చేరుతుందని తెలుస్తోంది.

ఇదే ఆ గ్రిడ్ కథ

దేశవ్యాప్తంగా గ్రామాలను ఇంటర్నెట్ తో అనుసంధానం చేసే ప్రక్రియను అప్పట్లో మోదీ ప్రభుత్వం ప్రారంభించగా, ఏపీ ఫైబర్ గ్రిడ్ పేరుతో.. ఇక్కడ టీడీపీ ప్రభుత్వం తమ జేబులు నింపుకోవాలని చూసింది. ఈ క్రమంలో అప్పటి ఐటీ శాఖ మంత్రి లోకేష్ తన సన్నిహితుడు హరికృష్ణ ప్రసాద్ కి చెందిన టెరా సాఫ్ట్ కి టెండర్లు కట్టబెట్టారు. దాని ఖరీదు అక్షరాలా 330 కోట్ల రూపాయలు.

అప్పటికే ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్ లో ఉండగా.. నిబంధనలు మార్చి బ్లాక్ లిస్ట్ లో నుంచి హడావిడిగా ఆ కంపెనీపేరు తొలగించి లాంఛనం పూర్తి చేశారు. ఈ క్రమంలో కొన్ని పత్రాలు ఫోర్జరీ చేశారని కూడా ఆరోపణలున్నాయి. టెక్నికల్ కమిటీలో తమవారినే నియమించుకుని, ఒకరిద్దరు అభ్యంతరం తెలిపినా వాటన్నిటినీ పక్కనపెట్టి 330 కోట్ల రూపాయల విలువైన ఫైబర్ నెట్ టెండర్లను టెరా సాఫ్ట్ కి కట్టబెట్టారు. దీనిపై అప్పట్లో ఆరోపణలు వచ్చినా టీడీపీ ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరించింది.

క్షేత్రస్థాయిలో జగన్ బయటపెట్టిన కుంభకోణం ఇది

తన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా బయటపెట్టిన కుంభకోణం ఇది. విశాఖ జిల్లాలోని ఓ గ్రామాన్ని ఎంపిక చేసి పైలెట్ ప్రాజెక్టుగా ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టింది అప్పటి చంద్రబాబు-లోకేష్ ప్రభుత్వం. తన పాదయాత్రలో భాగంగా ఈ గ్రామానికి చేరుకున్న జగన్.. అసలు అక్కడ ఎలాంటి ఫైబర్ నెట్ లేదని తెలుసుకున్నారు. 

మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఏ గ్రామంలోనైతే ఫైబర్ నెట్ ప్రయోగాత్మకంగా లాంఛ్ అయిందో, ఆ గ్రామస్తులకు దాని గురించి కనీసం తెలియదు కూడా. తను అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రిడ్ కథ అంతుతేలుస్తానని అప్పట్లోనే జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు.

గ్రిడ్ లో అక్రమ కోణాలు

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) లో జరిగిన అక్రమాలన్నీ బయటకు తీస్తోంది. ఈ క్రమంలో ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ రంగంలోకి దిగి కేసులు నమోదు చేసింది. ఈ గవర్నెన్స్ అథారిటీ మాజీ సభ్యుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్, ఇన్ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఎండీ కె.సాంబశివరావు, టెరా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్, హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కంపెనీ, దాని డైరెక్టర్లపై కేసులు పెట్టారు. ఈ ఎఫ్ఐఆర్ ను కోర్టుకి సీఐడీ అధికారులు సమర్పించారు.

త్వరలో అరెస్ట్ లు మొదలవుతాయని తెలుస్తోంది. తీగ లాగి, డొంక కదిలించి, చినబాబుచేత కూడా ఊచలు లెక్కబెట్టిస్తారని అంటున్నారు. ఇప్పటివరకూ కేసులు పెట్టారు, ఒక్కటైనా ప్రూవ్ అయ్యాయా అని రెచ్చిపోతున్న టీడీపీ నేతలు.. ఈ కేసుతో డిఫెన్స్ లో పడటం మాత్రం ఖాయం అంటున్నారు.