తెలుగుదేశం పార్టీలో తెల్ల ఏనుగులు..!

సహజంగా పనికిరాని వాటిని, పనికిరాకపోయినా నిర్వహణ భారంగా మారిన వాటిని తెల్ల ఏనుగులతో పోల్చడం పరిపాటి. కానీ పచ్చ పార్టీలో ఉన్నారు కాబట్టి, వారంతా పచ్చ ఏనుగులేనని చెప్పాలి. అవును, ఇప్పుడు టీడీపీలో ఉన్న…

సహజంగా పనికిరాని వాటిని, పనికిరాకపోయినా నిర్వహణ భారంగా మారిన వాటిని తెల్ల ఏనుగులతో పోల్చడం పరిపాటి. కానీ పచ్చ పార్టీలో ఉన్నారు కాబట్టి, వారంతా పచ్చ ఏనుగులేనని చెప్పాలి. అవును, ఇప్పుడు టీడీపీలో ఉన్న కొందరు నాయకుల పరిస్థితి ఇలాగే ఉంది. 

పార్టీకి పైసాకి పనికిరారు, కానీ పార్టీ పేరు చెప్పినా, ఏ కమిటీ వేసినా, ఏ పదవులు ఇవ్వాలన్నా వారే ముందు ఉంటారు. కొత్తవారిని రానివ్వరు, తాము బయటకి పోరు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీకి వారు భారం తప్ప వారి వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదు.

లిస్ట్ తీస్తే చాంతాడంత..

2019లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయిన తర్వాత చాలామంది సీనియర్లు సైలెంట్ అయ్యారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా పదవులు వెలగబెట్టిన కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప.. సహా మంత్రి వర్గంలో ఉన్న చాలామంది ఇప్పుడు పచ్చ ఏనుగుల్లా తయారయ్యారు. కళా వెంకట్రావు, పితాని సత్యనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నక్కా ఆనంద్ బాబు.. ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే మంత్రి పదవులు అనుభవించిన వీరంతా ఇప్పుడు ఎక్కడున్నారు, అసలు పార్టీ కోసం వీరు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు.. ప్రశ్నలుగానే మిగిలిపోతాయి.

రాగా పోగా.. బాబు మంత్రి వర్గంలో పనిచేసిన దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, యనమల మాత్రమే ఇప్పుడు కాస్తో కూస్తో తెరపై కనిపిస్తున్నారు. నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోకల్ లీడర్ గా మారిపోయారు.

నారాయణ అసలు అడ్రస్ లేరు, తీరా ఎన్నికల సమయంలో డబ్బు సంచులతో వస్తారనే టాక్ ఉంది కానీ, నారాయణ వల్ల పార్టీ బలం పెరిగే అవకాశం ఏమాత్రం లేదు. గంటా శ్రీనివాస్ అసలు పార్టీలో ఉన్నారా లేదా అనేది అతడికే తెలియదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన.. ఇక పార్టీతో తనకేమాత్రం సంబంధం లేదని సైలెంట్ గా ఉన్నారు.

జేసీ బ్రదర్స్ వల్ల ఏంటి ఉపయోగం..?

పట్టుబట్టి అనంతపురంలో తమ పట్టు నిలుపుకున్న జేసీ బ్రదర్స్.. పార్టీ కోసం ఏం చేస్తున్నారంటే ఎవరికీ తెలియదు. కేవలం స్థానికంగా తమ రాజకీయ పబ్బం గడుపుకోడానికే వారు ప్రయత్నిస్తున్నారు. 

అవకాశం వస్తే, వేదిక దొరికితే చంద్రబాబు, లోకేష్ పై ఎక్కిదిగుతారు. అందుకే వారిని పక్కన కూర్చోబెట్టుకుని మైక్ ఇవ్వాలన్నా చంద్రబాబు భయపడిపోతుంటారు.

పచ్చ ఏనుగుల్ని వదిలించుకుంటే బెటర్..

ప్రస్తుతం పచ్చ ఏనుగుల లిస్ట్ లో ఉన్నవారంతా పార్టీని బతికించడానికి ఏమాత్రం ప్రయత్నించడంలేదనే విషయం తేలిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లు కొన్ని మాత్రమే. ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. అధికార పక్షం తనకి తాను తప్పులు చేసి టీడీపీ బలపడితే, దాని ద్వారా వచ్చే ప్రతిఫలాలు అందుకోవడంలో మాత్రం వీరంతా ముందుంటారు. 

అంతే కానీ చంద్రబాబు చేస్తున్న హడావిడికి వీరు ఏమాత్రం మద్దతు ఇవ్వడంలేదు. బాబుతో కలసి ఆందోళనల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపించడంలేదు. జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చినా ఒక్కరూ బయటకు రావడం లేదు, అంతా కొవిడ్ పేరు చెప్పి మూల కూర్చుంటున్నారు.

ఇలాంటి బ్యాచ్ తో 2024 ఎన్నికల్ని ఎదుర్కోవడం బాబుకి కష్టమే. ఎన్నికలనాటికైనా చంద్రబాబు ఈ పచ్చ ఏనుగుల్ని వదిలించుకుంటే బెటర్. కనీసం లోకేష్ కోసం అయినా ఓ కొత్త టీమ్ తయారు చేసుకుందామంటే తమ తమ ప్రాంతాల్లో వీళ్లంతా బాబుకు పెద్ద అడ్డంకిగా మారారు.