ఉండాల్సిన మ‌నిషి

కాల గ‌మనంలో కొన్నింటికి అర్థాలు మారిపోయాయి. మేధావి-మూర్ఖుడు, మంచీ-చెడు, స‌మ‌ర్థులు-అస‌మ‌ర్థులు త‌దిత‌ర వాటికి అర్థాలు మారిన కాలంలో బ‌తుకుతున్నాం. డ‌బ్బు సంపాదించ‌డ‌మే మేధావిత‌న‌మ‌ని, అది తెలియ‌నోళ్లు వెర్రోళ్ల‌ని, మోస‌గించ‌డం స‌మ‌ర్థ‌త‌ని, మోస‌పోవ‌డం అస‌మ‌ర్థ‌త‌, అజ్ఞానం…

కాల గ‌మనంలో కొన్నింటికి అర్థాలు మారిపోయాయి. మేధావి-మూర్ఖుడు, మంచీ-చెడు, స‌మ‌ర్థులు-అస‌మ‌ర్థులు త‌దిత‌ర వాటికి అర్థాలు మారిన కాలంలో బ‌తుకుతున్నాం. డ‌బ్బు సంపాదించ‌డ‌మే మేధావిత‌న‌మ‌ని, అది తెలియ‌నోళ్లు వెర్రోళ్ల‌ని, మోస‌గించ‌డం స‌మ‌ర్థ‌త‌ని, మోస‌పోవ‌డం అస‌మ‌ర్థ‌త‌, అజ్ఞానం అనే నిర్వ‌చ‌నాలు స్థిర‌ప‌డ్డాయి. దీంతో  మోస‌గాళ్లు మీసాలు, కాల‌ర్లు ఎగ‌రేస్తూ తిరుగుతుంటే, బాధితులు దిక్కుతోచ‌క దాక్కోవాల్సిన దుస్థితి.  

డ‌బ్బు, అధికారం, మ‌గువ  ప్ర‌లోభాల‌కు లొంగ‌ని వ్య‌క్తిత్వం ఉన్న వాళ్లు అరుద‌నే చెప్పొచ్చు. అలాంటి వాళ్లు తార‌స‌ప‌డితే రెండుచేతులెత్తి దండం పెట్టాల‌నిపిస్తుంది. ప్ర‌పంచ ప్ర‌సిద్ధిగాంచిన తిరుప‌తి ఆధ్యాత్మిక కేంద్రంలో అలాంటి అరుదైన వ్య‌క్తిత్వం సాకం నాగ‌రాజ రూపంలో ఉంది. పుస్త‌క‌మే ప్ర‌పంచాన్ని మారుస్తుంద‌ని ప్ర‌గాఢంగా న‌మ్మ‌డ‌మే కాదు, ప‌ది మందితో చ‌దివిం చ‌డానికి ఆయ‌న ప‌డే తాప‌త్ర‌యం అంతా ఇంతా కాదు.

నాగ‌రాజ సంచిలో పుస్త‌కాలు, ఆయ‌న‌ హృద‌యంలో ప్రేమ ఎప్ప‌టికీ వెన్నంటి ఉంటాయి. ఇత‌రుల‌ను ద్వేషించ‌డానికి ఏ కార‌ణం అవ‌స‌రం లేదు. ఇది సుల‌భ‌మైన ప‌ని. కానీ మ‌నుషుల‌ను ప్రేమించ‌డం క‌ష్ట‌సాధ్య‌మైంది. దానికి ఎంతో సంస్కారం కావాలి. ఆ సంస్కారం సాకం నాగ‌రాజ సొంతం. అదే లేక‌పోతే, గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా ఆయ‌న సాహిత్య ప్ర‌చారోద్య‌మ కార్య‌క‌ర్త‌గా ప‌ని చేయ‌డం అసాధ్యం. ఇన్నేళ్లుగా మ‌నుషుల‌పై న‌మ్మ‌కాన్ని, స‌మాజ మార్పుపై విశ్వాసాన్ని కోల్పోక‌పోవ‌డం నాగ‌రాజ ప్ర‌త్యేక‌త‌.

ఒక్క మాట‌లో చెప్పాలంటే అమాయ‌క శిశువు ఆయ‌న‌. అందుకే ఈ లోకం అవ‌ల‌క్ష‌ణాలేవీ ఆయ‌న మ‌న‌సును మార్చ‌లేక‌పోయాయి. పెద్ద‌పెద్ద ప‌రిచ‌యాలు, ఒక్క మాట చెబితే కోట్లాది రూపాయ‌లు పెట్టుబ‌డి పెట్టే స్నేహాలున్న‌ప్ప‌టికీ ఏనాడు డ‌బ్బు సంపాద‌న‌పై ఆయ‌న దృష్టి పెట్ట‌లేదు. స‌మాజ మార్పు కోసం రాజ‌కీయాల్లో ప్ర‌క్షాళ‌న తేవాల‌నే అమాయ‌కున్ని ఆయ‌న‌లో చూడొచ్చు.

మంచి సాహిత్యం మాన‌వ వికాసానికి తోడ్ప‌డుతుంద‌ని భావించిన సాకం నాగ‌రాజ..ప్ర‌తి ఒక్క‌రితో మంచి పుస్త‌కం చ‌దివించాల‌నే ఆశయంతో తిర‌గ‌ని చోటులేదు.  పాఠ‌కునికి, పుస్త‌కానికి మ‌ధ్య అనుసంధాన క‌ర్త సాకం నాగ‌రాజ‌. పుస్త‌క , మాన‌వ‌త్వ ప్ర‌చారోద్య‌మకారుడైన సాకం నాగ‌రాజకు 70 ఏళ్లు నిండిన సంద‌ర్భంగా ఆయ‌న మిత్రులంతా క‌లిసి ” వుండాల్సిన మనిషి”  పేరుతో ఒక అభినంద‌న సంచిక తీసుకొచ్చారు. ఇందులో  152 మంది నాగ‌రాజ వ్య‌క్తిత్వ విశిష్ట గురించి వ్యాసాలు రాశారు. తిరుపతిలోని క‌ర‌కంబాడి రోడ్డులో, శ్రీ‌బాలీజీ ఫెడ్ టాప్ కెమిస్ఠ్  భ‌వ‌నంలో శ‌నివారం సాయంత్రం 5 గంట‌ల‌కు ఆవిష్క‌రించ‌బోతున్నారు.

నాగ‌రాజ అంటే లోకం ప్ర‌లోభాల ధిక్క‌ర‌ణ‌. డ‌బ్బు, అధికారం, మ‌గువ‌…ఈ మూడే లోకాన్ని పాలిస్తున్నాయి. అది ఆంధ్రా అయినా, అమెరికా అయినా ఒక‌టే. ఎందుకంటే మ‌నిషికి పంచేంద్రియాలున్న‌ప్ప‌టికీ, ఆరో ఇంద్రియం డ‌బ్బు అంటారో మ‌హాను భావుడు. అది లేంది, మిగిలిన ఐదు ఇంద్రియాలు ఉన్నా ప్ర‌యోజ‌నం లేద‌నేది ఆయ‌న భావ‌న‌. 

ఎన్నో విఘ్నాలు క‌లిగించే అవ‌ల‌క్షాలు చుట్టూ మూగినా, తాన‌నుకున్న ల‌క్ష్యాన్ని సాధించే క్ర‌మంలో ఓ రుషిగా బ‌తుకీడిస్తున్న సాగం నాగ‌రాజ‌… నిజంగా వుండాల్సిన మ‌నిషే. ఆయ‌న గురించి మాట్లాడుకోవ‌డం అంటే… మంచిత‌నం, మాన‌వ‌త్వం , విజ్ఞానాన్ని ద‌ర్శించుకోవ‌డ‌మే.