రుషికొండ గుట్టు తేల్చండి…హైకోర్టు కీల‌క ఆదేశాలు!

విశాఖ‌లో రుషికొండ త‌వ్వ‌కాల వ్య‌వ‌హారం తెలుగు సీరియ‌ల్స్‌ను త‌ల‌పిస్తోంది. రుషికొండ‌లో అనుమ‌తికి మించి ప్ర‌భుత్వం అక్ర‌మ తవ్వ‌కాలు చేస్తోందంటూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. అక్ర‌మ తవ్వ‌కాలు జ‌రుగుతున్న‌ట్టు హైకోర్టు ఇటీవ‌ల సీరియ‌స్ కామెంట్స్ చేసింది.…

విశాఖ‌లో రుషికొండ త‌వ్వ‌కాల వ్య‌వ‌హారం తెలుగు సీరియ‌ల్స్‌ను త‌ల‌పిస్తోంది. రుషికొండ‌లో అనుమ‌తికి మించి ప్ర‌భుత్వం అక్ర‌మ తవ్వ‌కాలు చేస్తోందంటూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. అక్ర‌మ తవ్వ‌కాలు జ‌రుగుతున్న‌ట్టు హైకోర్టు ఇటీవ‌ల సీరియ‌స్ కామెంట్స్ చేసింది. అక్ర‌మ తవ్వ‌కాలు జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌భుత్వం వాదిస్తున్న‌ప్ప‌టికీ, న‌మ్మ‌శ‌క్యంగా లేద‌ని న్యాయ స్థానం అభిప్రాయ‌ప‌డింది. గూగుల్ అబ‌ద్ధం చెబుతుందా? అని గ‌త విచార‌ణ సంద‌ర్భంగా హైకోర్టు ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే.

రుషికొండ గుట్టు తేల్చే క్ర‌మంలో ఇవాళ హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఆ బాధ్య‌త‌ని కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీశాఖ‌కు న్యాయ స్థానం అప్ప‌గించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అక్క‌డికి క‌నీసం హైకోర్టు నియ‌మించిన లాయ‌ర్ల‌ను కూడా వెళ్ల‌నివ్వ‌క పోవ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.

రుషికొండ‌పై ఏం జ‌రుగుతున్న‌దో స‌ర్వే చేసి, వాస్త‌వాల‌ను నిగ్గు తేల్చాల‌ని  కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీశాఖ అధికారుల బృందాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒక‌వేళ అనుమ‌తికి మించి అక్ర‌మ త‌వ్వ‌కాలు లేదా భ‌వ‌నాలు నిర్మించి వుంటే, అవి ఏ రేంజ్‌లో సాగాయో నివేదిక‌ను త‌మ‌కు స‌మ‌ర్పించాల‌ని ఆ బృందాన్ని రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించ‌డం విశేషం.  

విచార‌ణ‌ను డిసెంబ‌ర్ 14కు వాయిదా వేసింది. ఇప్ప‌టికైనా రుషికొండ అక్ర‌మ త‌వ్వ‌కాల‌పై వాస్త‌వాలు బ‌య‌టికొస్తాయా? ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.