జనసేనాని పవన్‌కల్యాణ్‌పై సందర్భాన్ని అనుసరించి మంత్రి ఆర్కే రోజా విమర్శలు చేస్తుంటారు. ఇద్దరూ చిత్రపరిశ్రమకు చెందిన సెలబ్రిటీలే. అయితే రోజా రాజకీయంగా సక్సెస్ఫుల్ పొలిటీషియన్‌గా గుర్తింపు పొందారు.
పవన్‌కల్యాణ్ మాత్రం ఎమ్మెల్యేగా కూడా గెలవలేక, భవిష్యత్‌లోనైనా గెలవాలన్న తపనతో ఉన్నారు. కనీసం తానైనా ఎమ్మెల్యేగా గెలవొచ్చనే తపనతో పవన్‌కల్యాణ్ పొత్తు కోసం ఆరాట పడుతున్నారనే అభిప్రాయాలు లేకపోలేదు.
ప్రజల్లో నానుతున్న సంగతినే రోజా కూడా చెప్పారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. పవన్‌కల్యాణ్ పోరాటం ప్రజల కోసం కాదన్నారు. పొత్తుల కోసం మాత్రమే పవన్ తపన పడుతున్నారని విమర్శించారు. 2019లో రెండుచోట్ల పవన్‌ను ప్రజలు ఓడించారన్నారు. 2024లో కూడా అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. చంద్ర బాబుది రెండు కళ్ల సిద్ధాంతమని తప్పు పట్టారు.
టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని రోజా చెప్పారు. బద్వేలుకి మించిన మెజారిటీ ఆత్మకూరులో వైఎస్సార్సీపీకి వస్తుందని రోజా చెప్పుకొచ్చారు. బద్వేలులో బీజేపీకి వెనుక నుంచి మద్దతు ఇచ్చిన టీడీపీ, జనసేన ప్రయత్నాలు ఫలించలేదని రోజా అన్నారు.
ఆత్మకూరులో కూడా అదే జరుగుతుందన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరుకు ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. సంప్రదాయం పేరుతో ఆత్మకూరు ఉప ఎన్నిక బరి నుంచి టీడీపీ, జనసేన తప్పుకున్నాయి. బీజేపీ పోటీకి సిద్ధమైంది. మంత్రులెవరూ రాకుండా ఉప ఎన్నికలో తలపడాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కామెడీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.