2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్వే చేయించారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం సాగుతుండగా మరోసారి ఆయన క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు తమ విధానాలు మార్చుకోవాలని, లేదంటే వేటు వేయాల్సి వస్తుందని జగన్ హెచ్చరికలు పంపారు.
ఈ నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడెక్కడ బలహీనంగా వున్నారో ఇప్పటి నుంచే జగన్ గుర్తించేందుకు శ్రీకారం చుట్టారు. ఇక లాభం లేదనే చోట అభ్యర్థుల మార్పునకు వేగంగా పావులు కదుపుతున్నారు. వివిధ ప్రైవేట్ సంస్థలు, అలాగే ప్రభుత్వ నిఘా వ్యవస్థల ద్వారా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు.
ఇందులో భాగంగా రాయలసీమలో ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు దిగారు. ఇతర పార్టీల్లో యాక్టీవ్‌గా ఉంటూ, ప్రజాబలం కలిగిన నేతల్ని ఇంటెలిజెన్స్ అధికారులు నేరుగా కలుస్తున్నారని సమాచారం. ప్రజాదరణ కలిగి ఉండి, ఆర్థికంగా పెద్దగా స్తోమత లేని వాళ్లను వైసీపీ వైపు తిప్పేందుకు ప్రభుత్వ నిఘా వ్యవస్థ సీరియస్‌గా పావులు కదుపుతోంది. 2024లో గెలుపే ధ్యేయంగా, ఖర్చంతా వైసీపీనే భరిస్తుందని భరోసా ఇస్తున్నట్టు తెలిసింది.
రాయలసీమలో రెండు మూడు నియోజకవర్గాల్లో ఉన్నతస్థాయి ఇంటెలిజెన్స్ అధికారులు అధికార పార్టీ ఎమ్మెల్యేల స్థానంలో ప్రత్యర్థి పార్టీలో బలమైన నేతలను నిలిపేందుకు … జగన్ దూతగా వెళ్లి చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. వీరి చర్చలు సత్ఫలితాలు ఇస్తున్నట్టుగా తెలిసింది.
ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల చర్చలు వైసీపీ ప్రజాప్రతినిధుల్లో గుబులు రేపుతున్నట్టు సమాచారం. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు అభ్యర్థుల ఎంపికపై పూర్తిస్థాయిలో జగన్ దృష్టి పెడతారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ప్రతిపక్షాలు చెబుతున్నట్టు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో జగన్ అభ్యర్థుల ఎంపిక విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.