జనసేనతో పొత్తు విషయమై అధికార ప్రతినిధులు, నేతలు నోరు మెదపొద్దని టీడీపీ అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం. జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్‌కల్యాణ్ మూడు ఆప్షన్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో టీడీపీ, బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఒక ఆప్షన్‌గా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ కాస్త తగ్గాలని కూడా పవన్ సూచించారు.
పవన్ సూచనపై టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా పవన్క ల్యాణ్‌పై టీడీపీ యాక్టివిస్టులు తీవ్రస్థాయిలో ట్రోలింగ్‌కు దిగారు. అలాగే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చెబుతున్నట్టు తానెప్పుడూ తగ్గలేదని టీడీపీ అధికార ప్రతినిధులు ఉతికి ఆరేస్తున్నారు. ఈ పరిణామాలు జనసేన, టీడీపీ మధ్య గ్యాప్ పెంచుతాయనే ఆందోళన ఇరు పార్టీల నేతల్లోనూ నెలకొంది. దీంతో టీడీపీ అధిష్టానం అప్రమత్తమైంది.
జనసేనతో పొత్తుపై ఎవరూ మాట్లాడొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు పొత్తు విషయమై చర్చిద్దామని, అంత వరకూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించినట్టు సమాచారం.
పొత్తుపై మౌనమే ఉత్తమమని టీడీపీ భావిస్తున్నట్టు సమాచారం. తద్వారా జనసేనను మరింత గందరగోళపరిచే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు, ఆ పార్టీ వ్యూహం తెలియజేస్తోంది. టీడీపీతో పొత్తుపై జనసేన ఆశలు సజీవంగా ఉంచాలని ప్రధాన ప్రతిపక్షం నిర్ణయించడం వెనుక వ్యూహం ఏమై వుంటుందనే చర్చకు తెరలేచింది.