మ‌హాపాద‌యాత్రః వినాశకాలే విపరీత బుద్ధి!

వినాశ‌కాలే విప‌రీత బుద్ధి అని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. అమ‌రావ‌తే రాజ‌ధానిగా వుండాలంటూ మ‌హాపాద‌యాత్ర -2 చేప‌ట్ట‌డం అస‌లుకే ఎస‌రు తెస్తోంది. మొద‌టి ద‌శ‌లో తిరుప‌తి వ‌ర‌కూ పాద‌యాత్ర చేప‌ట్టిన‌పుడు వారిపై క‌నీసం కొన్ని…

వినాశ‌కాలే విప‌రీత బుద్ధి అని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. అమ‌రావ‌తే రాజ‌ధానిగా వుండాలంటూ మ‌హాపాద‌యాత్ర -2 చేప‌ట్ట‌డం అస‌లుకే ఎస‌రు తెస్తోంది. మొద‌టి ద‌శ‌లో తిరుప‌తి వ‌ర‌కూ పాద‌యాత్ర చేప‌ట్టిన‌పుడు వారిపై క‌నీసం కొన్ని వ‌ర్గాల్లోనైనా సానుభూతి వుండేది. ఎప్పుడైతే అమ‌రావ‌తికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన త‌ర్వాత కూడా… మ‌ళ్లీ మ‌హాపాద్ర పేరుతో శ్రీ‌కారం చుట్టారో, అప్పుడే వారి ప‌త‌నం ప్రారంభ‌మైంది.

ఇందుకు హైకోర్టు తాజా ఘాటు వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌నం. పౌర స‌మాజం ఆలోచ‌న‌లు, ఆవేద‌నను ప్ర‌తిబింబించేలా హైకోర్టు వ్యాఖ్య‌లున్నాయి. రాజ‌ధాని అమ‌రావ‌తి అని తీర్పు ఇచ్చిన త‌ర్వాత … అదే అంశంపై అర‌స‌వ‌ల్లి వ‌ర‌కూ మ‌హాపాద‌యాత్ర చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని హైకోర్టు గ‌ట్టిగా నిల‌దీసింది. ఇదే ప్ర‌శ్న ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల నుంచి కూడా వ‌స్తోంది.

త‌మ ప్రాంతంపైకి మ‌హాపాద‌యాత్ర రూపంలో దండ‌యాత్ర‌గా వ‌స్తున్నార‌నే ఆవేద‌న‌, ఆరోప‌ణ‌లు అర్థం చేసుకోద‌గ్గ‌వే. ఇంత‌కాలం పౌర స‌మాజ నిల‌దీత‌ను అమ‌రావ‌తి పాద‌యాత్రికులు ఖాత‌రు చేయ‌లేదు. ఇప్పుడు గౌర‌వ న్యాయ‌స్థానం అదే ప్ర‌శ్న వేసింది. దీనికి ఏం స‌మాధానం చెబుతారు? అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.

రెండో ద‌శ పాద‌యాత్ర మొద‌లు కాకుండా వుంటే, ఉత్త‌రాంధ్ర‌లో, రాయ‌ల‌సీమ‌లో అస్తిత్వ‌, రాజ‌ధాని ఉద్య‌మాలు పురుడు పోసుకునేవా? ప్ర‌భుత్వం కూడా ఆ దిశ‌గా ఆలోచించేది కాదు. కానీ “అమ‌రావ‌తి” అతితో సీన్ రివ‌ర్స్ అయ్యింది. మ‌హాపాద‌యాత్రకు అనుమ‌తి లేద‌ని పోలీసులు చెబితే, న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించి మ‌రీ అనుకున్న‌ది సాధించారు. ఆ త‌ర్వాత దారి పొడ‌వునా వ్య‌తిరేక‌త ఎదుర‌వ‌డంతో కుయ్యోమొర్రో అంటూ మ‌ళ్లీ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు.

ఎగ్జిక్యూటివ్ రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన ప్రాంతానికే, మీకొద్దు అంటూ వేలాది మందిగా వెళితే, ప్ర‌తిఘ‌ట‌న ఎదురు కాకుండా వుంటుంద‌ని ఎలా అనుకున్నారు?  తాము క‌వ్విస్తూ, రెచ్చ‌గొడుతున్నా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు చేతులు క‌ట్టుకుని ఉండాల‌ని కోరుకోవ‌డంలో న్యాయం వుందా? అమ‌రావ‌తి అభివృద్ధిని కోరుకోవ‌డంలో త‌ప్పులేదు. కానీ అమ‌రావ‌తి పేరుతో మిగిలిన ప్రాంతాల క‌డుపు కొడ‌తామంటే, ర‌గిలిపోకుండా వుంటారా?

ఈ మొత్తం ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు త‌మ చేష్ట‌లే కార‌ణ‌మ‌ని అమ‌రావ‌తి జేఏసీ ఇప్ప‌టికైనా గుర్తిస్తే మంచిది. పోయేకాలం ద‌గ్గ‌ర ప‌డ‌డం వ‌ల్లే అమ‌రావ‌తి పేరుతో విప‌రీత చేష్ట‌ల‌కు దిగారంటే…కాద‌న‌గ‌ల‌రా? ప్ర‌స్తుత విప‌రీత పోక‌డ‌ల‌కు అమ‌రావ‌తి జేఏసీ చ‌ర్య‌లే కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీనికి ప‌రిష్కారం కూడా జేఏసీ చేత‌ల్లోనే వుంది. అంద‌రి మంచి ఆకాంక్షిస్తే… ప‌రిస్థితి సానుకూలంగా వుంటుంది. లేదంటే ప‌రిణామాలు తీవ్రంగా వుండే అవ‌కాశాలున్నాయ‌ని హెచ్చ‌రించ‌క త‌ప్ప‌దు.