చింతకాయల అరెస్టు: పులుపు తీయడమే మిగిలింది!

ఇన్నాళ్లు తండ్రీ కొడుకులు ఇద్దరూ రకరకాల నాటకాలు ఆడారు! చేయవలసిన పనులన్నీ చేసేసి తమకేమీ సంబంధం లేదన్నట్లుగా బిల్డప్పులు ఇచ్చారు. చేతులకు మట్టి అంటకుండా కాగల కార్యాలు సమస్తమూ చక్కబెడుతూ వచ్చారు. నోటికి వచ్చినంత…

ఇన్నాళ్లు తండ్రీ కొడుకులు ఇద్దరూ రకరకాల నాటకాలు ఆడారు! చేయవలసిన పనులన్నీ చేసేసి తమకేమీ సంబంధం లేదన్నట్లుగా బిల్డప్పులు ఇచ్చారు. చేతులకు మట్టి అంటకుండా కాగల కార్యాలు సమస్తమూ చక్కబెడుతూ వచ్చారు. నోటికి వచ్చినంత మాట్లాడుతూ విమర్శలు చేయడంలో తమను మించిన వారు లేరని తండ్రి కొడుకులు నిరూపించుకున్నారు. 

అయితే వారి ఆకతాయి వేషాలు శృతిమించిన ప్రతి సందర్భంలోనూ… పోలీసులు చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించిన ప్రతి సందర్భంలోనూ చట్టాన్ని అడ్డుపెట్టుకొని తమను తాను కాపాడుకుంటూ వచ్చారు! అయితే ఈసారి తప్పలేదు తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇవి రాజకీయ అరెస్టులు అన్ని రంకెలు వేయడానికి గొంతు చించుకోవడానికి కూడా వీల్లేదు! ఎందుకంటే ఇవి అచ్చంగా మోసానికి, ఫోర్జరీ వ్యవహారానికి సంబంధించిన కేసులు. ఆ తండ్రి కొడుకులు మరెవ్వరో కాదు చింతకాయల అయ్యన్నపాత్రుడు, చింతకాయల రాజేష్.! అనేక నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అయ్యన్నపై కేసులు నమోదు అయ్యాయి.

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నోరేసుకుని విరుచుకుపడటంలో తెలుగుదేశం నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ముందు వరుసలో ఉంటారు. నీచమైన బూతుల ప్రయోగంతో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దూషించడంలో ఆయనది అందెవేసిన చేయి. అయితే ప్రతిసారీ తానే మాటలు అనేసి, తానే ముందుగా కోర్టును ఆశ్రయించి.. విచారణకు సహకరించినంత వరకు అరెస్టు జరగకుండా ఉండాలని ఉత్తర్వులను తెచ్చుకోవడం.. ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 

ఇలా చింతకాయల అయ్యన్నపాత్రుడు చాలా కాలం పాటు రోజులు నెట్టుకుంటూ వచ్చారు. కానీ ఆ పప్పులు ఎంతో కాలం ఉడకవు. ఆయన ఇంటి గోడ కూల్చివేత కు సంబంధించి ఫోర్జరీ పత్రాలు సమర్పించారనే అభియోగం మీద ఆయనను తాజాగా గురువారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు కోర్టులో హాజరు పరుస్తామని ప్రకటించారు.

‘బాప్ దస్ నంబర్ కా అయితే.. బేటా బీస్ నెంబర్ కా’ అనే తరహా వ్యవహారం ఆ తండ్రీకొడుకులది. ప్రభుత్వం మీద అనుచిత విమర్శలు చేయడం అసభ్యకర పోస్టులను, అబద్ధపు పోస్టులను తెలుగుదేశం సోషల్ మీడియా ద్వారా ప్రచారంలో పెట్టడం వంటి అభియోగాలు అయ్యన్నపాత్రుడు, కొడుకు చింతకాయల రాజేష్ మీద ఉన్నాయి. పోలీసులు 41 ఏ నోటీసులు అందించడానికి ఇంటికి వెళితే వారి కళ్ళు కప్పి వెనక గోడ దూకి పారిపోయిన చరిత్ర ఈ పుత్రరత్నానిది. 

ఇవాళ పోలీసులు కొడుకు రాజేష్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ తండ్రి కొడుకులు మోసాలతో పాటు పోలీసులు విచారణలో ఇంకా ఎన్నెన్ని వివరాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.