మీడియాలోకి వక్రబుద్ధులు ప్రవేశించడం ఇవాళ్టి సంగతి కాదు. అయితే మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అనుబంధంగా మారాక చాలాకాలం తమ పార్టీ అనుకూల ప్రచారాల వరకే పరిమితం అయ్యాయి. ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తూ ఆ వక్రబుద్ధుల ప్రదర్శనను పరాకాష్టకు తీసుకువెళ్లడం మాత్రం నవతరం పచ్చ మీడియాకు మాత్రమే చెల్లింది.
వ్యవహారం ఒకటైతే దానిని మరొక విధంగా అందించడం, సంఘటన ఒకటైతే దానిని మరొక రకమైన భాష్యాలు చెప్పడం, ఇవన్నీ తెలుగు ప్రజలకు చాలా మామూలు సంగతులు అయిపోయాయి. చివరికి కోర్టు తీర్పులను కూడా వక్రీకరించి ప్రజల ఎదుట పరచిపెట్టే నిస్సిగ్గుతనంతో కూడిన జర్నలిజం పోకడలకు ఆంధ్రజ్యోతి దినపత్రిక వేదిక అవుతోంది.
అమరావతి రాజధాని ప్రదర్శనలకు సంబంధించి హైకోర్టులో విచారణలు జరిగాయి. ఒకసారి రాజధాని గురించి తీర్పు ఇచ్చేసిన తర్వాత, ఇంకా అమరావతి పాదయాత్రలు ఎందుకు? అంటూ రైతుల ముసుగులో జరుగుతున్న వ్యవహారాలను కోర్టు తప్పు పట్టింది. అసలు అరసవెల్లి వరకు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముందని వారిని నిలదీసింది. అమరావతి జేఏసీ చేసిన విన్నపాలన హైకోర్టు తిరస్కరించింది. రాజధాని పరిరక్షణ సమితి పేరుతో పాదయాత్రలో పాల్గొనేందుకు మరొక పిటిషన్ దాఖలు అయితే దానిని కూడా తోసిపుచ్చింది.
అయితే ఈ తీర్పు సందర్భంగా జరిగిన విచారణను న్యాయమూర్తుల వ్యాఖ్యలను ఆంధ్రజ్యోతి వక్రీకరించి రాయడం విశేషం. కేవలం కర్నూలులో హైకోర్టు కావాలనే డిమాండ్ తో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలను మాత్రమే తప్పుబట్టినట్లుగా, వాటికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడమే ఘోరం అన్నట్లుగా ఆంధ్రజ్యోతి రాతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి రాతల ప్రకారమే.. అమరావతే రాజధాని అని, మూడురాజధానుల నిర్ణయం తీసుకునే అధికారం లేదని తాము చెప్పిన తర్వాత ఇంకా అమరావతి రాజధానికోసం రైతులు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. అయితే కర్నూలులో హైకోర్టు కావాలనే డిమాండ్ తో రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకన్నట్టు కూడా రాశారు.
అమరావతి రాజధాని అని తీర్పు వచ్చిన తర్వాత.. కర్నూలు వాళ్లకు తమ ప్రాంతానికి న్యాయం జరగాలని హైకోర్టు కావాలని అడిగే హక్కు కూడా ఉండదా? ఆ సమావేశాలు కూడా పెట్టుకోకూడదా? అనేది చిన్నలాజిక్. వారి డిమాండ్ సహేతుకం, న్యాయబద్ధం అయితే.. నిర్ణయాధికారం ఎవరిదో వారు నిర్ణయం తీసుకుంటారు. అయితే.. అసలు అమరావతి రాజధాని అని చెప్పాం కాబట్టి.. మరెవ్వరూ ఇంకేమీ అడగనే కూడదు అని కోర్టు ఎన్నడూ చెప్పదు.
అలాంటి అర్థం వచ్చేలా.. మూడు రాజధానులకు అనుకూలంగా జరుగుతున్న ప్రదర్శనలు, సమావేశాలను కోర్టు తప్పుపట్టినట్టుగా ఆంధ్రజ్యోతి వక్రపూరిత రాతలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది.