తెల్లవారక ముందే రాజకీయంగా బ్రేకింగ్ న్యూస్. టీడీపీ సీనియర్ నేతను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. సీఎం జగన్‌తో పాటు మంత్రులు, అధికార పార్టీ నేతలపై తరచూ నోరు పారేసుకునే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుని సీఐడీ అధికారులు గురువారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు.
అయితే ఆయన అరెస్ట్‌కు కారణం… కోర్టుకు నకిలీ డాక్యుమెంట్స్ సమర్పించిన కేసులో కావడం గమనార్హం. అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేష్‌ను కూడా అరెస్ట్ చేయడం గమనార్హం. ఇది టీడీపీకి షాక్ అని చెప్పొచ్చు.
కాలువను అక్రమించి అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ గోడను నిర్మించారని గతంలో మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ప్రహరీని కూలగొట్టారు. ఈ వ్యవహారంపై అయ్యన్నపాత్రుడు కోర్టును ఆశ్రయించారు. కోర్టుకు ఫోర్జరీ పత్రాలు సమర్పిం చారని రాజమండ్రి సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లారు.
అయ్యన్న, ఆయన కుమారుడు రాజేష్ అరెస్ట్‌కు సంబంధించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వాళ్లిద్దరిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. అనంతరం తండ్రీకొడుకుల్ని ఏలూరు కోర్టులో హాజరుపరిచేందుకు తరలించారు. అరెస్ట్‌పై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.