వైఎస్ఆర్ అనే మూడు అక్షరాలంటే కోట్లాది మందికి ఓ నమ్మకం, ధైర్యం, భరోసా. కానీ కొంత మందికి మాత్రం వెన్నులో వణుకు పుడుతుంది. వైఎస్ఆర్ ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా పులిలా బతికారు. సీఎంగా ఆరేళ్ల పాటు పాలన సాగించి కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
వైఎస్ఆర్ అంటే ఓ ఆరోగ్య శ్రీ , ఫీజురీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, రైతుల రుణమాఫీ తదితర గొప్పగొప్ప సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయి. వైఎస్ఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా…ఆయన్ను మానసికంగా బతికిస్తున్నది ఆ పథకాలే అంటే అతిశయోక్తి కాదు.
తండ్రి మరణానంతరం ఆయన పేరుతో వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకుని ప్రజల ఆశీస్సులు పొందారు. తొమ్మిదేళ్ల సుదీర్ఘ , అలుపెరగని రాజకీయ పోరాటంలో చివరికి విజేతగా నిలిచారు. అయినప్పటికీ ఆయనపై ఏవో ఒక చిల్లర రాజకీయాలు చేస్తూనే ఉండడం చూస్తున్నాం.
తాజాగా అలాంటి చిల్లర పని గురించి తెలుసుకుందాం. వైఎస్ఆర్ అనే పదాన్ని ఏ రాజకీయ పార్టీ వాడొద్దని ఆదేశించాలని ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పేరుతో కొత్తగా తెరపైకి వచ్చిన మహబూబ్‌బాషా ఫిర్యాదు చేశాడు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరును వైఎస్ఆర్ కాంగ్రెస్ అని వైసీపీ వాళ్లు వాడడంపై అతను అభ్యంతరం చెప్పాడు.
ఇటీవల వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇచ్చిన షోకాజ్ నోటీసులో వైఎస్ఆర్ అని రాయడంతో …అది తమ పార్టీదని కొందరు అనుకుంటున్నట్టు ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో మహబూబ్‌బాష పేర్కొన్నాడు. అసలు ఈ మహబూబ్‌బాష ఎవరు? ఈయన పార్టీ ఏనాడైనా ఎన్నికల్లో పోటీ చేసిందా? ఒక వేళ ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపి ఉంటే వచ్చిన ఓట్లు, సీట్లు ఎన్ని? ఇవేవి చెప్పకుండానే…కేవలం ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేయగానే అన్నీ అయిపోతాయనే భ్రమలో ఇలాంటి ప్రచార ఫిర్యాదుల ఆలోచనలు ఎవరివో ఈపాటికే ఏపీ ప్రజానీకానికి బాగా అర్థమయ్యే ఉంటుంది.
గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైసీపీని ఇబ్బంది పాలు చేయాలనే కుట్రతో ప్రజాశాంతి పార్టీ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కే తెలియకుండా బీ ఫారాలు ఇచ్చిన ఘనత ఎవరిదో కూడా చూశాం. ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తు హెలీకాప్టర్. ఫ్యాన్ గుర్తును పోలి ఉండడంతో ఓటర్లను కన్ఫ్యూజ్ చేసే ఎత్తుగడలో భాగంగా ఇలాంటి ఛీప్ పాలిటిక్స్ చేయడంలో ఆ పార్టీ దిట్ట అని అందరికీ తెలుసు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో ముక్కూ మొహం తెలియని ఓ నాయకుడిని తీసుకొచ్చి సరికొత్త నాటకానికి తెరలేపడం గమనార్హం.