సాధారణంగా రాజకీయ నాయకులు ఒక పద్ధతి ప్రకారం విమర్శలు చేస్తారు. సమయం సందర్భం చూసుకుంటారు. కానీ తమ్ముళ్ళు మాత్రం ఎల్ల వేళలా తయారు అంటున్నారు. అందుకే టైమింగ్ లాజిక్ మిస్ అవుతూ జనంలో పలుచన అవుతున్నారు.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి మీద నిర్భయ కేసు పెట్టిన తరువాత స్టే తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తరచూ విలేకరుల సమావేశం పెట్టి రెచ్చిపోయే అయ్యన్న ఇపుడు ట్విట్టర్ పిట్ట అయిపోయారు. ప్రతీ రోజూ వైసీపీ సర్కార్ మీద నిందలేస్తూ బురద జల్లుతూ తరించేస్తున్నారని వైసీపీ నేతలు కౌంటర్లేస్తున్నారు.
ఇక ట్విట్టర్ చేతిలో ఉంటే అంతే మరి. అయిన దానికీ కానిదానికీ విరుచుకుపడే అయ్యన్న లాంటి వారికి అది మరింతగా అక్కరకు వస్తోంది కాబోలు. అందుకే సాటి రాజకీయ నాయకుడు పుట్టిన రోజున వేళ గ్రీట్ చేయాల్సిన అయ్యన్న చాలా సులువుగా అవినీతి బురద జల్లేశారు.
విజయసాయిరెడ్డిని ఏ టూ అని సంభోదిస్తూ మరీ ఆయన పుట్టిన రోజున గ్రీట్ చేశారు. ఇక జగన్ 300 కోట్ల రూపాయలు గిఫ్ట్ గా సాయిరెడ్డికి ఇచ్చారట. 108 వాహనాల కొనులోగులో అవినీతి జరిగిందని అంటున్న అయ్యన్న విజయసాయిరెడ్డికి లింక్ పెట్టేసి తనదైన శైలిలో అలా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారన్నమాట.
మొత్తానికి సీనియర్ మోస్ట్ లీడర్ని అని చెప్పుకున అయ్యన్న కనీస సంప్రదాయాలు కూడా పాటించకుండా పుట్టిన రోజు వేళ కూడ ఇలా తిట్ల పురాణమే లంకించుకోవడంపైన వైసీపీ నేతలు మండిపోతున్నారు. అయినా అయ్యన్న తన మాటా, రూటు అసలు మార్చుకోరుగా.