కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్నే విచ్ఛిన్నం చేసింది, చేస్తోంది. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎందుకంటే కరోనా విపత్తు వల్ల ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో బాధితులే. అసలు ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వాలు సగం జీతాలు ఇచ్చిన దుస్థితి. ఏపీ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు నెలల పాటు సగం జీతాలతో సరిపెడితే, తెలంగాణ మూడు నెలల పాటు కొనసాగించింది.
లాక్డౌన్ వల్ల అన్ని వ్యవస్థలు ఎక్కడికక్కడ స్తంభించిన దయనీయ స్థితిలో ఏపీకి రాబడీ పూర్తిగా పడిపోయింది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలు మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం కొనసాగిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలా ఉండగా బుధవారం 108, 104 అంబులెన్స్ కొత్త సర్వీస్లను ఏపీ సర్కార్ ప్రారంభించింది.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 108 సిబ్బందికి శుభవార్త చెప్పారు. 108 వాహన డ్రైవర్లు, మెడికల్ టెక్నీషియన్ల వేతనాలను భారీగా పెంచినట్టు ప్రకటించారు. డ్రైవర్ల జీతాన్ని రూ.18 నుంచి 28 వేలు, మెడికల్ టెక్నీషియన్లకు 20 వేల రూ.30 వేల వరకు పెంచడమే కాకుండా, తక్షణం పెంచిన జీతాలు అమల్లోకి వస్తాయనే శుభవార్తను సీఎం చెప్పారు.
గతంలో డ్రైవర్లకు నెలకు రూ.10వేలు , మెడికల్ టెక్నీషియన్లకు రూ.12వేలు చొప్పున జీతం వచ్చేది. చాలా కాలంగా తమ వేతనాలు పెంచాలని 108 ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నప్పటికీ పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. అలాంటిది కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో, ఆర్థిక వ్యవస్థ బాగా లేని సమయంలో అనూహ్యంగా తమ వేతనాలు పెరగడంతో 108 సిబ్బంది ఆనందానికి అవధుల్లేవు.
ఇంత కష్టకాలంలోనూ జగన్ ఎలా చేస్తున్నాడో అని ఆశ్చర్యపోవడం ప్రతి ఒక్కరి వంతైంది. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యకలాపాలు నిరాటంకంగా సాగుతుండటంతో …ఈ జగన్ ఎవరికీ అర్థం కాడు సామి అని సామాన్య జనం గుసగుసలాడుతున్నారు.