ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టైన తెలుగుదేశం ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఎట్టకేలకూ జైలుకు వెళ్లారు. శ్రీకాకుళం జిల్లాలోని సొంతూళ్లో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు కొన్నాళ్ల కిందట అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనను ఏసీబీ కోర్టులో హాజరు పరిచి, వారు అరెస్టును ధ్రువీకరించారు. అయితే ఆ వెంటనే ఆయన ఆసుపత్రికి చేరారు. ఆయన కు ఇటీవలే సర్జరీ జరిగిందని, చికిత్స అవసరమని కోర్టు ఆయనను జీజీహెచ్ కు పంపించింది.
అక్కడ అచ్చెన్నకు ఇన్నాళ్లూ వైద్య సేవలు అందాయి. ఆయన పూర్తిగా కోలుకున్నారని, డిశ్చార్జి చేశారు వైద్యులు. ఈ క్రమంలో ఆయనను జైలుకు తరలించినట్టుగా సమాచారం. పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లతో అచ్చెన్నను విజయవాడ సబ్ జైలుకు తరలించినట్టుగా తెలుస్తోంది.
ఇలా అరెస్టు అయిన కొన్ని రోజులకు అచ్చెన్నాయుడు జైలుకు వెళ్తున్నారు. ఇప్పటికే ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టులో దాని విచారణ జరుగుతూ ఉంది. అచ్చెన్నాయుడు విచారణకు సహకరించడం లేదని అధికారులు అంటున్నారని తెలుస్తోంది. విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరుఅవుతారంటూ అచ్చెన్న తరఫు న్యాయవాది వాదించారు. ఈ క్రమంలో ఈ నెల మూడో తేదీన అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ పై తీర్పు రానుంది. అంతలోపు ఆయనను జైలుకు తీసుకెళ్లారు ఏసీబీ అధికారులు. అచ్చెన్నాయుడి ఒత్తిడి మేరకు, ఆయన వరసగా రాసిన లేఖల మేరకే తాము ఈఎస్ఐ కాంట్రాక్టులను ఖరారు చేసినట్టుగా అధికారులు ఏసీబీ విచారణలో స్పష్టం చేస్తున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఈ కేసులో తదుపరి అంకం ఆసక్తిని రేపుతూ ఉంది.