తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారు. దళితులను దూషించిన వ్యవహారంలో చింతమనేనిపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఆ కేసులో అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించగా చింతమనేని వారికి చిక్కకుండా పారిపోయినట్టుగా తెలుస్తోంది.
ఇసుక ధర్నా అంటూ చింతమనేని హైడ్రామా చేయబోయారు. అయితే అంతలోనే ఆయనకు పాత కేసులో అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఎన్నికలకు ముందే చింతమనేని దళితులను తీవ్రంగా దూషించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లోనే వైరల్ గా మారాయి. తీవ్ర పదజాలంతో ఆయన దళితులను దూషించారు. ఆ వ్యవహారంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి.
దళిత సంఘాలు చింతమనేనిపై ఫిర్యాదులు చేశాయి. అందుకు సంబంధించి కేసుల్లో ఇప్పుడు కదలిక వస్తోంది. ఎస్సీ అట్రాసిటీ చట్టం ప్రకారం.. దూషించినందుకు గానూ నమోదు అయిన కేసుల్లో చింతమనేని అరెస్టు కోసం పోలీసులు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. తనను అరెస్టు చేయడానికి పోలీసులు వస్తున్నారనే విషయాన్ని తెలుసుకుని చింతమనేని పరార్ అయినట్టుగా సమాచారం.