అంశం ఏదైనా అందులో మోడీని లింక్ చేయడం పవన్ కు ఎప్పట్నుంచో అలవాటు. చంద్రబాబు పాలనలో నోరుతెరిస్తే మోడీ ప్రస్తావన తెచ్చేవారు. కలిసిన పాపాన మాత్రం పోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. బాబు పాలన అంతరించింది. జగన్ పాలనతో నవశకం మొదలైంది. కానీ పవన్ మాటల్లో మాత్రం తేడా రాలేదు. ఇప్పటికీ అదే మోడీ మంత్రం. అవసరమైతే ఢిల్లీ వెళ్లి మోడీని కలిసొస్తానంటూ ఆర్భాటం. నిజంగా పవన్-మోడీ అంత క్లోజా? పవన్ అడిగిన వెంటనే మోడీ అపాయింట్ మెంట్ దొరుకుతుందా?
ఆయన ప్రధాని. సవాలక్ష పనులుంటాయి. అసలు దేశంలో ఎప్పుడుంటారో, విదేశాలకు ఎప్పుడెళ్తారో కూడా ఆయనకే తెలీదు. అలాంటి వ్యక్తి అపాయింట్ మెంట్ కావాలంటే కనీసం 2 నెలల ముందు అర్జీ పెట్టుకోవాలి. విషయం, సందర్భం, వ్యక్తిని బట్టి అపాయింట్ మెంట్ దొరుకుతుంది. పవన్ విషయానికొస్తే.. ఇక్కడ ఆయన లేవనెత్తుతున్న విషయం పలు రాజకీయ కారణాల దృష్ట్యా ప్రస్తుతానికి మోడీకి అనవసరం. ఇక సందర్భం విషయానికొద్దాం, ఇప్పటికిప్పుడు ఉన్నఫలంగా పవన్ ను మోడీ కలవాల్సిన సందర్భం, అవసరం కూడా లేదు. పోనీ వ్యక్తిగత స్థాయిలో చూసుకుందాం. పవన్ స్టామినా ఏంటో మొన్న జరిగిన ఎన్నికల్లోనే మోడీకి అర్థమైపోయింది. బహుశా భవిష్యత్తులో మోడీకి పవన్ అవసరం ఉండకపోవచ్చు.
సో.. పవన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వాల్సిన అవసరం మోడీకి ఎంతమాత్రం లేదు. పవన్ మాత్రం ప్రతి విషయానికి మోడీని లింక్ చేసి, అతడ్ని కలిసి చర్చిస్తానంటారు. గతంలో ఇలానే ఓ సందర్భంగా ఓ రైలు వేసి మరీ ఢిల్లీ వెళ్దాం, మోడీతో మాట్లాడదాం అంటూ ఏదేదో మాట్లాడారు పవన్. ఆ విషయాన్ని చాలా ఈజీగా మరిచిపోయారు. అంతెందుకు, ఎన్నో సార్లు మోడీతో కలిసి చర్చిస్తానంటూ ప్రకటించిన పవన్, ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా మోడీని కలవలేదు. మోడీ తనకు బాగా క్లోజ్ అని చెప్పుకునే పవన్… అంశాలవారీగా కాకుండా, కనీసం వ్యక్తిగత స్థాయిలో కూడా ప్రధానితో మాట్లాడిన దాఖలాలు లేవు.
రాష్ట్రానికి ఎంతో కీలకమైన, ప్రాధాన్యమైన అంశం ప్రత్యేక హోదా విషయంలోనే ప్రధానిని కలవలేకపోయారు పవన్. అప్పట్లో బాబు-మోడీ-పవన్ ఒకటే కాబట్టి స్పెషల్ స్టేటస్ అంశాన్ని పవన్ బలంగా తీసుకెళ్లలేకపోయారని అనుకుందాం. కానీ టీడీపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత, అటు టీడీపీ-బీజేపీ మైత్రీ కూడా చెడిపోయిన తర్వాత, పవన్ వెళ్లి మోడీని కలిసుంటే బాగుండేది. కానీ ఆ ప్రయత్నం చేయలేదు. ఇప్పుడేమో అమరావతి విషయంలో ఢిల్లీ వెళ్లి మోడీతో చర్చిస్తానంటూ మాటలు చెబుతున్నారు జనసేనాని.
సరే.. పవన్ దారిలోకే వెళ్లి ఆలోచిద్దాం. అమరావతి విషయంలో నిజంగా ఏదో జరిగిపోతోందని పవన్ భావిస్తున్నట్టయితే ఇప్పటికైనా మోడీని వెళ్లి కలవాలి. తను అనుకుంటున్న అంశాల్ని ప్రధాని ముందు ఉంచాలి. మొత్తంగా రాజధాని నిర్మాణంపై విచారణ జరిపించమని కోరాలి. ఆ పని మాత్రం పవన్ చేయరు. అలాచేస్తే, తన రహస్య స్నేహితుడు బాబుకు అది చుట్టుకుంటుంది. అంతెందుకు.. మోడీని కలుస్తానంటే ముందుగా పవన్ ను అడ్డుకునేది చంద్రబాబే కదా. ఈ విషయం టీడీపీ, జనసేన శ్రేణులతో పాటు అందరికీ తెలుసు. కానీ పవన్ మాత్రం పాపం ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మీడియా ముందు మోడీ జపం చేస్తున్నారు.