ప్రధాని నరేంద్రమోడీ సభ విశాఖలో జరగబోతోంది. ఆయన కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. రైల్వేస్టేషన్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయడం ప్రధాన కార్యక్రమం. మరికొన్ని కార్యక్రమాలుంటాయి. ప్రధాని విశాఖలో రెండు రోజుల పాటు ఉంటారు. అయితే ఈ సందర్భంగా.. మోడీ కార్యక్రమంలో ఏయే నేతలు పాల్గొంటారు? అనేది ఇప్పుడు కీలకమైన చర్చనీయాంశం.
జరుగుతున్నది ప్రభుత్వ కార్యక్రమం గనుక.. రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి విధిగా ఉంటారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఉంటారు. బిజెపి నాయకుల విషయంలో అనుమానాలు అక్కర్లేదు. అయితే.. కమలనేతలే కాకుండా.. వేదికను పంచుకునే అవకాశం ఇతర నేతలు ఎవరికైనా ఉంటుందా? ఎలా..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
ప్రధాని మోడీ కార్యక్రమానికి తాను కూడా హాజరు కావాలని జనసేనాని పవన్ కల్యాణ్ ముచ్చటపడుతున్నారు. అధికారిక కార్యక్రమంలో ప్రధాని మోడీతో కలిసి వేదిక పంచుకోవాలని ఆయన తెగ ఉత్సాహపడుతున్నారు. బిజెపితో తెగతెంపులు చేసుకునే లెవల్లో ఆల్రెడీ సంకేతాలు ఇచ్చిన పవన్ కల్యాణ్.. మరోవైపు మోడీ సభలో పాల్గొని తాను చాలా కీలకమైన నాయకుడిని అని చెప్పుకోవాలని తహతహలాడుతున్నారని సమాచారం.
ప్రధాని కార్యక్రమానికి తనకు ఆహ్వానం ఉంటే చాలు.. దాని ద్వారా ఎడ్వాంటేజీ వేరే అని.. ఆయన స్కెచ్ వేసుకున్నట్లు తెలుస్తోంది. తనను ఆహ్వానించేలా చూడాలని.. బిజెపిలో తనను గుర్తించే నాయకుల ద్వారా ప్రయత్నాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంత వరకు బిజెపి ఒంటరి పార్టీ ఎంత మాత్రమూ కాదు. ఎన్డీయే భాగస్వామ్య పక్షం జనసేన ఈ రాష్ట్రంలో ఉంది. భాగస్వామ్య పార్టీ ఒకచోట ఉన్నప్పుడు.. అక్కడ ప్రధాని కార్యక్రమం జరిగితే.. ఆ పార్టీ వారు కూడా పాల్గొనడం చాలా సహజం. అయితే పవన్ కల్యాణ్ విషయంలో బిజెపి ఎన్నడూ పట్టించుకోలేదు.
గతంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా.. టెక్నికల్‌గా కాంగ్రెసు పార్టీ నాయకుడు అయిన, కేంద్ర మాజీమంత్రి చిరంజీవిని ఆహ్వానించారు గానీ.. తమ భాగస్వామ్య పార్టీనేత పవన్ కల్యాణ్ ను ఆహ్వానించలేదు. పవన్ కల్యాణ్ ను బిజెపి పక్కన పెట్టేసినట్టే అని అప్పుడు ప్రచారం జరిగింది. అయితే తనకు కూడా ఆహ్వానం అందిందని.. పవన్ కల్యాణ్ నేరుగా చెప్పకపోయినా.. ఇండైరక్టుగా చాటింపు వేయించుకున్నారు.
కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ప్రధాని కార్యక్రమానికి తాను వెళ్లాలని ప్రధానితో కలిసి వేదిక పంచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకు ఒక కారణం కూడా ఉంది. విశాఖపట్నంలో జనవాణి నిర్వహించాలనుకుంటే.. దానికి వైసీపీ మంత్రుల కార్యక్రమం ఉన్న సమయంలోనే తన ప్రోగ్రాం పెట్టుకున్న వక్రబుద్ధి పవన్ కల్యాణ్ ది. దానివలన ఎంత రభస జరగాలో అంతరభస జరిగింది. శాంతి భద్రతల కారణంగా పోలీసులు ఆయనకు కొన్ని ఆంక్షలు విధించి, ఆయన ఊహించుకున్న కార్యక్రమాలను కట్టిపెట్టి, వెనక్కు పంపారు. విశాఖపట్నంలో జరిగిన అవమానాన్ని కవర్ చేసుకోవడానికి పవన్ కల్యాణ్ చాలా అతి మాటలు, అతి చేష్టలు చేయాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు ప్రధాని కార్యక్రమానికి ఆహ్వానం వస్తే, ప్రధానితో కలిసి వేదికమీద కూర్చుని.. అదే విశాఖలో తన పరువు కాపాడుకోవాలనేది పవన్ కోరిక. అందుకే ఆయన ఆహ్వానం కోసం కేంద్రంలో పైరవీలు చేసుకుంటున్నారు. అసలే, పవన్ కల్యాణ్ ను భారతీయజనతా పార్టీ కరివేపాకు కంటె ఘోరంగా లెక్కవేస్తోంది. వాడుకుని పారేయడం కాదుకదా.. వాడుకోకుండానే పారేసినా ఆశ్చర్యం లేదు. పైకి పవన్ మా భాగస్వామ్య పార్టీ అంటారే తప్ప.. ఏనాడూ ఆయనకు నయాపైసా విలువ ఇచ్చింది లేదు. ఇలాంటి పవన్ కల్యాణ్ కలగంటున్నట్టుగా ఆయనకు ఆహ్వానం అందుతుందా అనేది అనుమానమే!