అదేంటో కానీ కళ్లెదుటే జగన్ సర్కార్ మంచి చేస్తున్నా తెలుగు మీడియాకు కనిపించడం లేదు. జగన్ సర్కార్ చేస్తున్న మంచి చూడకు, మంచి గురించి రాయకు అనే రీతిలో మన జర్నలిజం ఉంటోంది. తాజాగా జగన్ సర్కార్‌పై జాతీయ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయి ప్రశంసలు కురిపించడం విశేషం.
దీనికి కారణం జూలై ఒకటి బుధవారం నుంచి ఏపీ సర్కార్ 108, 104 అంబులెన్స్‌లను ప్రారంభించడమే. ఈ వాహనాల్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించడం ప్రత్యేక ఆకర్షణ. అందులోనూ కరోనా లాంటి అత్యంత విపత్కర, క్లిష్ట సమయంలో అన్ని రకాల వైద్య సౌకర్యాలు కల్పిస్తూ 108, 104 అంబులెన్స్‌లను తీసుకు రావడంపై ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తోంది.
ఒకేసారి 1088 ఆంబులెన్స్‌లను ప్రవేశపెట్టడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్నిఆయన ప్రశంసించారు. “కరోనా వైరస్పై పోరాటంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. కొత్తగా ప్రారంభించిన 1088 అంబులెన్స్‌లు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తాయి. వీటిని స్థానిక ఆరోగ్య కేంద్రాలు, డాక్టర్లతో అనుసంధానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాలు ఇదే బాటలో నడుస్తాయి” అని తన ట్వీట్‌లో రాజ్‌దీప్ సర్దేశాయి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జాతీయ జర్నలిస్ట్ ప్రశంసలు కురిపించడం వైసీపీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కానీ ప్రజలకు ఎంతో మేలు చేసే 108, 104 వాహనాలపై మంచి చెప్పకపోగా, అవినీతి పేరుతో దుష్ప్రచారం చేయడాన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు.