వైఎస్ జగన్, పవన్ కల్యాణ్.. వీరిద్దరి కలయిక చూడాలని రాష్ట్ర ప్రజల్లో చాలామందికి కోరిక ఉండే ఉంటుంది. అమరావతి రైతుల కష్టాలు తెలుసుకోడానికంటూ పర్యటన చేపట్టిన పవన్, అది పూర్తయిన తర్వాత సీఎం జగన్ ని కలసి ఓ వినతిపత్రం అందిస్తారేమోనని ఆశించారంతా. టీడీపీ హయాంలో రాజధాని రైతులతో ఓసారి సమావేశమైన పవన్ తర్వాత చంద్రబాబుని కలిశారు కాబట్టి ఈసారి కూడా ముఖ్యమంత్రి జగన్ ని కలుస్తారని అనుకున్నారంతా.
కానీ పవన్ కల్యాణ్ మాత్రం సీఎం జగన్ అంటే చాలు దూరంగా జరుగుతున్నారు. రైతుల కష్టాలను ప్రధాని దగ్గర చెబుతానంటున్నారే కానీ జగన్ ని కలవడానికి మాత్రం ఇష్టపడటం లేదు. తన అహం దెబ్బతింటుందనే ఉద్దేశంతోనే పవన్ ముఖ్యమంత్రిని కలిసే ధైర్యం చేయలేకపోతున్నట్టు తెలుస్తోంది.
అప్పట్లో ముఖ్యమంత్రితో భేటీ అవుతానని పవన్ ప్రకటిస్తే చాలు పెదబాబు, చినబాబు ఇద్దరూ ఆయనకి ఎదురెళ్లి స్వాగతం చెప్పేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు, పవన్ వస్తానంటే ఎవరూ ఎగిరిగంతేయరు. అందరిలాగే ఆయనకూ అపాయింట్ మెంట్ ఇస్తారు, వీఐపీ ట్రీట్ మెంట్ ఇవ్వరు. ఇంకా టైమ్ బ్యాడ్ అయితే.. అరగంటో, గంటో ఆయన ఆఫీస్ ముందు వేచి చూసే బంపర్ ఆఫర్ పవన్ కి తగలొచ్చు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకునే పవన్ వెనకడుగు వేశారు.
జగన్ దగ్గర తన పప్పులు ఉడకవని, ఆయన దగ్గరకు వెళ్లి తన ఇగోని హర్ట్ చేసుకోవడం ఎందుకనే ఉద్దేశంతోనే పవన్ తగ్గారు. అందులోనూ పవన్ తనని తాను చాలా ఎక్కువగా ఊహించుకునే రకం, రెండు అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయినా అది ప్రజల తప్పేనంటూ తన అసమర్థతను కప్పిపుచ్చుకుంటుంటారు. సింగిల్ ఎమ్మెల్యే ఉన్నా కూడా వచ్చే ఎన్నికల్లే నేనే సీఎం అని ఫీలయ్యే మనస్తత్వం. అలాంటి పవన్ తాను ఎవరి దగ్గరకు వెళ్లినా రాచమర్యాదలు జరగాలనే అనుకుంటారు.
దీన్ని అలుసుగా తీసుకునే చంద్రబాబు, పవన్ ని 2014 ఎన్నికల్లో పావుగా వాడుకున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. జగన్ దగ్గర అలాంటి ఆటలు సాగవని తెలుసు కాబట్టే.. కనీసం ముఖ్యమంత్రిని కలవడానికి కూడా పవన్ ఇష్టపడటం లేదు. కానీ రాజధాని రైతులు, ప్రస్తుతం నడుస్తున్న రచ్చను దృష్టిలో పెట్టుకొని జగన్ ను, పవన్ కలిస్తేనే మంచిదని చాలామంది భావిస్తున్నారు. ఈ విషయంలో పవన్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి.