రిలీజ్ కు ముందువరకు సాహో సినిమాపై చాలా అంచనాలుండేవి. ఒక దశలో ఇది బాహుబలి-2ను కూడా క్రాస్ చేస్తుందని అంచనాలు వెలువడ్డాయి. ఇకపై నాన్-బాహుబలి రికార్డులు కాకుండా.. నాన్-సాహో రికార్డులు అంటూ ప్రస్తావించాల్సి వస్తుందంటూ లెక్కలు కూడా కట్టారు. కానీ సాహో సినిమా బాహుబలి-2 దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది. మొదటి రోజు వసూళ్లు బాహుబలి-2తో కంపార్ చేయలేని విధంగా ఉన్నాయి.
బాహుబలి-2 సినిమా హిందీ వెర్షన్ కు మొదటిరోజే ఏకంగా 41 కోట్ల రూపాయలు వచ్చాయి. సాహో విషయంలో ఈ మేజిక్ రిపీట్ అవ్వలేదు. ఈ సినిమా హిందీ వెర్షన్ కు తొలిరోజు అటుఇటుగా 24 కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే వచ్చాయి. కొన్ని ఏరియాల్లో షోలు పడలేదని కొందరు వాదిస్తున్నప్పటికీ.. ప్రింట్స్ సకాలంలో చేరి అన్ని ఏరియాల్లో షోలు పడినా 41 కోట్ల మార్క్ అయితే సాహో అందుకునేది కాదు. మహా అయితే ఓ 2 కోట్లు ఎక్స్ ట్రా వచ్చేవి.
సో.. నార్త్ వసూళ్లలో ఇప్పటికీ బాహుబలి-2దే హవా. ఈ విషయంలో సాహోది రెండోస్థానం కూడా కాదు. అయితే బాలీవుడ్ లో ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనర్ గా మాత్రం నిలిచింది ఈ సినిమా. అటు ఓవర్సీస్ లో కూడా సాహో పరిస్థితి ఏమంత గొప్పగాలేదు. అక్కడ కూడా ఇది బాహుబలి-2ను క్రాస్ చేసేస్తుందని చెప్పుకొచ్చారు. మొదటిరోజు వసూళ్లలో బాహుబలి-2ను క్రాస్ చేయలేకపోయినా కనీసం రెండోస్థానంలో నిలుస్తుందని అంచనా వేశారు. కానీ సాహో సినిమా మేజిక్ మిలియన్ డాలర్ మార్క్ కూడా అందుకోలేకపోయింది.
ఓవర్సీస్ లో మొదటిరోజు సినిమాకు 9 లక్షల 15వేల డాలర్లు మాత్రమే వచ్చాయి. బాహుబలి-2 కాదు కదా.. ఇది కనీసం స్పైడర్, అజ్ఞాతవాసి ప్రీమియర్ వసూళ్లను కూడా క్రాస్ చేయలేకపోయింది. అలా ఓవర్సీస్ ప్రీమియర్స్ లో ఆరో స్థానానికే పరిమితమైంది సాహో. ఇక ఓవరాల్ వసూళ్ల విషయానికొస్తే.. ఇది బాహుబలి-2ను క్రాస్ చేయడం అసంభవం అనే విషయం అందరికీ అర్థమైపోయింది.
మొదటిరోజే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో ఈ వీకెండ్ దాటిన తర్వాత సాహోకు ఆక్యుపెన్సీ తగ్గిపోవడం ఖాయం. అదే బాహుబలి-2 విషయానికొస్తే.. ఆ సినిమా దేశవ్యాప్తంగా దాదాపు 2 వారాల పాటు హౌజ్ ఫుల్స్ తో నడిచింది. అలాంటి డ్రీమ్ రన్, సాహో వల్ల సాధ్యంకాదు.
అడ్వాన్స్ బుకింగ్, హైప్ కారణంగా ప్రస్తుతానికైతే ఈ సినిమాకు ఫుల్స్ నడుస్తున్నాయి. సోమవారం నుంచి సాహో అసలు రంగు బయటపడుతుంది. ఓవరాల్ గా ఈ సినిమా ఏ పొజిషన్ కు చేరుకుంటుందనే విషయంపై కూడా సోమవారం నాడు ఓ అంచనాకు రావొచ్చు.