ఫలితం కనిపిస్తే శభాష్ అనాల్సిందే!

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అమల్లోకి తీసుకువచ్చే లక్ష్యంతో పురోగమిస్తుంది. ఇప్పటికే గ్రామాల్లో బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తి వేసినట్లు ప్రకటించింది. మద్యం సిండికేట్ల దోపిడీకి చెక్ పెడుతూ..…

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అమల్లోకి తీసుకువచ్చే లక్ష్యంతో పురోగమిస్తుంది. ఇప్పటికే గ్రామాల్లో బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తి వేసినట్లు ప్రకటించింది. మద్యం సిండికేట్ల దోపిడీకి చెక్ పెడుతూ.. ప్రభుత్వమే మద్యంషాపులు నిర్వహించేలా కొత్త విధానాన్ని కూడా తీసుకువస్తోంది. దుకాణాల సంఖ్యను కూడా దాదాపు 800కు పైగా తగ్గించారు. ఇవన్నీ మధ్య నిషేధం దిశగా మంచి అడుగులే. తాజాగా బార్లను కూడా 20శాతం తగ్గించి పోతున్నాం అని ముఖ్యమంత్రి జగన్ ప్రకటిస్తున్నారు.

కొన్నాళ్ల తర్వాత అయినా ఈ నిర్ణయాల తాలూకు ఫలితం సమాజ సంక్షేమంలో కనిపిస్తే ప్రభుత్వం సఫలీకృతం అయినట్లే. సర్కారును శభాష్ అనాల్సిందే. బెల్టు షాపులను ఎత్తివేయడం వలన గ్రామాలలో అక్రమ మద్యం, నాటు సారా తయారీ విచ్చలవిడిగా పెరుగుతాయనే భయం ప్రభుత్వం మాటల్లో కనిపిస్తుంది. వీటిని కూడా సమర్థంగా అరికట్టడానికి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. గ్రామాలలో మహిళా పోలీసులను నియమిస్తామని జగన్ శుక్రవారం ట్వీట్ చేశారు.

నాటు సారా తయారీ, అక్రమ మద్యం అనేవి అందుబాటులోకి వస్తే.. వాటికి మహిళా పోలీసుల నియామకం సరైన విరుగుడు కాకపోవచ్చు. నాటు సారా తయారీదారులు నడిరోడ్డు మీద చేయరు. గుట్టుచప్పుడు కాకుండా ఊరి వెలుపల తమదందా సాగిస్తుంటారు. వారి గురించి మహిళా పోలీసులకు సమాచారం తెలిసి, చర్యలు తీసుకునేలోగా జరగవలసిన నష్టం జరిగిపోతుంది. మహిళా పోలీసుల స్థానే, గ్రామంలో ఎవరైనా ఎప్పుడు ఫిర్యాదు చేసినా తక్షణం స్పందించే ఎక్సైజ్ పోలీసు యంత్రాంగాన్ని పటిష్టం చేస్తేచాలు.

నిజానికి ఎక్సైజ్ యంత్రాంగంలో నిషేధం పట్ల చిత్తశుద్ధిని పెంపొందింప చేయగలిగితే.. ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. నిన్న మొన్నటి దాకా బెల్టుషాపులు కూడా అధికారికంగా నిర్వహించినవి కాదు. వాటిని ఎత్తి వేస్తున్నాం అంటూ తెలుగుదేశం ప్రభుత్వం కూడా చాలాసార్లు ప్రకటించింది. కానీ ఆచరణలో ఏం జరిగిందో సర్కార్కు బాగా తెలుసు. ఎక్సైజ్ అధికారులు ఎక్కడికక్కడ లాలూచీ పడుతూ అనుమతించడం వలనే  బెల్టు షాపులు పెట్రేగాయి.

జగన్ ప్రభుత్వం మద్యనిషేధ ఆలోచనలకు గండికొడుతూ నాటుసారా తయారీదారులు పుట్టుకొస్తే గనుక.. వారిని కఠిన శిక్షలు గురిచేసే కొత్త చట్టాలు కావాలి. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా హోల్ సేల్ తరహాలో అమ్మడం ప్రారంభిస్తే మళ్లీ బెల్టు షాపు దందాలే మరొక రూపంలో మొదలవుతాయి. అలాంటివి జరగకుండా ప్రభుత్వం ఎంత పటిష్ట ఏర్పాట్లు చేస్తే.. అంత మంచి పేరు తెచ్చుకుంటుంది.