పెనంమీద నుండి పొయ్యిలో పడడం అంటే ఏమిటో తెలిసొచ్చింది రంజిత్‌కి. భార్య భారతి ఇన్నాళ్ళూ తనను చేతానివాడంటూ పదేళ్లగా పెనం మీద వేపుకు తింటూంటే ఆవిడ మాజీ ప్రియుడు తనకు పై అధికారిగా దాపురించి తనను పొయ్యిలోకి నెట్టాడు. పెళ్లయేనాటికి తను మంచి కంపెనీలో దర్జాయైన ఉద్యోగం చేసేవాడు. ఐదేళ్లయ్యేసరికి కంపెనీ మూతపడి ఉద్యోగం పోయింది. ఖర్చులు తగ్గించడానికి రెండు గదులు, వంటిల్లు ఉన్న రైలుపెట్టె లాటి వాటాలోకి మారాల్సి వచ్చింది. గత స్థాయి ఉద్యోగం కోసం వెతకడంలో ఏడాది పోయింది. తర్వాత తక్కువ జీతానికైనా ఏదో ఒక ఉద్యోగం చాలని వెతికితే యిది దొరకడానికి ఆర్నెల్లు పట్టింది. అప్పణ్నుంచి జీవితం కుదుటపడింది. కానీ భార్య దృష్టిలో తన తెలివితక్కువతనం వలననే ఉద్యోగం పోయింది, మళ్లీ ఓ పట్టాన దొరకలేదు. ఉద్యోగం లేని రోజుల్లో ఎన్ని అవస్తలు పడ్డాడో, ఎంతమందిని అప్పులడిగి సంసారం నెట్టుకొచ్చాడో అవన్నీ ఆమెకు తెలీవు. చెప్పి ఆమె మనసు కష్టపెట్టడమెందుకని తన ఇబ్బందులన్నీ ఏకరువు పెట్టేవాడు కాదు.
ఆమెను యిన్సులేట్ చేసి పెట్టడం పొరపాటై పోయింది. తమ యిద్దరి మానసిక స్థితిలో తేడా వచ్చేసింది. తను కృంగాడు కానీ ఆమె కృంగిపోలేదు. ఎలాగోలా తనకీ, ముగ్గురు పిల్లలకీ అన్నం పెట్టడం భర్త బాధ్యత అని మాత్రమే ఆమెకు తెలుసు. అవును, ముగ్గురు పిల్లలు. కొడుకు కావాలంటూ ముగ్గురు ఆడపిల్లల్ని కంది. చివరికి ఆమెకు చెప్పకుండా తనే ఆపరేషన్ చేయించేసుకున్నాడు. పాత కాలంలో వంశోద్ధారకుడు పుట్టకపోతే అత్తమామలు కోడల్ని తప్పుబట్టేవారు. ఎక్స్, వై క్రోమోజోమ్స్ గురించి అవగాహన పెరిగిన యీ కాలంలో కూడా భారతి తనను తప్పుపట్టింది. తన అప్రయోజకత్వానికి దాన్నో ఉదాహరణగా చెప్తుంది. తను ఎక్కడో ఉండవలసిన దాన్నని, కర్మం కొద్దీ రంజిత్‌కు భార్యనయ్యానని దిగులు పడుతూంటుంది. దానికి తోడు వైవాహిక జీవితంలోని అసంతృప్తి తోడైంది. శృంగారం పట్ల యిద్దరిదీ చెరొక ధోరణి అయింది.
రంజిత్ ఉద్యోగం పోవడానికి కారణం, ప్రొప్రయిటర్ని ఒకత్తి తగులుకుంది. తమ్ముడంటూ ఒకణ్ణి తీసుకొచ్చి మేనేజింగ్ డైరెక్టర్ చేయించింది. వాడు అడ్డంగా తినేసి కంపెనీని దివాళా తీయించేశాడు. చివరికి ప్రొప్రయిటర్ ఆస్తి పోగొట్టుకున్నాడు, అమ్మాయినీ పోగొట్టుకున్నాడు. తర్వాత తెలిసింది ఆ మేనేజింగ్ డైరెక్టరుగాడూ, అదీ మొగుడూ పెళ్ళాలేట. ఇలా నాటకాలాడి డబ్బున్నవాళ్లని వలలో వేసుకొంటారట. ప్రొప్రయిటర్ గారి సెక్స్ వాంఛలకి ఆయనొక్కడే కాదు, ఆ కంపెనీలో పనిచేసే నూటయాభై కుటుంబాలు కూడా బలై పోవలసి వచ్చింది. దాంతో రంజిత్‌కి సెక్సంటేనే రోత కలిగింది. ఒక ఆడదానితో కొన్ని నిమిషాల పనికై యింతమంది ఉసురు పోసుకోవాలా అనిపించింది. నిరుద్యోగిగా ఉన్న ఏడాదిన్నరపాటు డిప్రెషన్‌తో పాటు యీ భావాలు కూడా తోడవడంతో అతను భార్యతో చాలా తక్కువగా కలిసేవాడు, అదీ ఆమె బలవంతం వల్లనే. తర్వాత ప్రస్తుతం కంపెనీలో చిరుద్యోగమే ఐనా జీవితం కుదుటబడింది. కానీ భారతి చిన్నచూపులో తేడా రాకపోవడంతో అతనికి ఆసక్తి నశించి, మొక్కుబడి వ్యవహారంగా మారిపోయింది. ఇతని మానసిక సంఘర్షణను అర్థం చేసుకోలేని ఆమె యీ విషయంలో కూడా ముద్దపప్పే అని ముద్ర కొట్టేసింది.
సంసారం యిలా యీడ్చుకుని వస్తూండగా రంజిత్ తన కొలీగ్ రాంబాబు యింటికి భార్యను తీసుకెళ్లి పొరపాటు చేశాడు. సాధారణంగా ఆఫీసువాళ్ళతో బయట సంబంధ బాంధవ్యాలు ఏవీ పెట్టుకోడతను. కానీ రాంబాబు తనకు అప్పులిచ్చి ఆదుకునే మిత్రుడు. లేకలేక పిల్లాడు పుడితే బారసాల చేసుకుంటూ ఆఫీసు స్టాఫ్‌ని సకుటుంబంగా పిలిస్తే వెళ్ళక తప్పలేదు. లేడీస్ స్టాఫ్‌లో లలిత, పద్మ ఉత్త వాగుడుకాయలు. భారతిని చూస్తూనే ‘మీ ఆయన్ని చూసి మీరు పాతకాలం వాళ్లలా ఉంటారనుకొన్నాం. మీరు భలే యంగ్‌గా, చలాకీగా ఉన్నారే. మీలాంటి అందమైన భార్యను పెట్టుకొని ఆయనంత డల్‌గా ఉంటారేం?’ అన్నారు. రంజిత్ మండిపడ్డాడు. భర్త ఎలా ఉంటాడో భార్య అలాగే ఉండాలా? ఎవళ్ళిష్టం వాళ్లది. ఎవళ్ళ రూపు వాళ్లది. మధ్యలో వీళ్ళెవరు కామెంట్స్ పాస్ చేయడానికి?
వాళ్ల మాటలు వినగానే భారతికి కళ్ళు నెత్తిమీదకి చ్చేశాయి. భర్తను పురుగులా చూడడమే కాదు, జీవితం ఇటువంటివాడి పాలబడి నాశనమయిపోయి నందుకు కసితో పిల్లల్ని పట్టుకు కొట్టడం కూడా మొదలెట్టింది. అది జరిగిన తర్వాత బుద్ధి ఉన్నవాడెవడూ భార్యను కొలీగ్స్‌తో కలవనివ్వడు. కానీ అవసరం అలా తీసుకువచ్చింది. దీపావళి మర్నాడు కంపెనీలో కొత్త పుస్తకాలు పెట్టడానికి పూజా అదీ చేయించి స్టాఫ్‌కి భోజనాలు ఏర్పాటుచేశారు సేటుగారు. కొత్త మేనేజరు కూడా అవేళే జాయినవుతున్నాడు. అందరూ ఫ్యామిలీస్‌తో రావాలని గట్టిగా చెప్పారు. తప్పలేదు. అక్కడికీ సాధ్యమైనంత ఆలస్యంగానే తీసుకెళ్ళాడు. కొత్త మేనేజరు గురించి ఘనంగా చెప్పి, “ఆయన మన కంపెనీలో చేరడమే మన అదృష్టం” అన్నారు సేటుగారు.
మేనేజరు ఒక్కడే వచ్చాడు. ఫ్యామిలీ చెన్నయ్‌లోనే ఉండిపోయిందట. స్కూళ్ళు తెరిచేక ఫ్యామిలీ షిఫ్ట్ చేస్తాట్ట. ఆయన గురించి గొప్పగా చెప్తూంటే భారతి పొంగిపోతూండడం తను గమనించాడు కానీ ఆడవాళ్ళ మధ్యలో కూచుంది కాబట్టి కారణం అడగలేకపోయాడు. పరిచయాలు జరిగేటప్పుడు తెలిసింది వాళ్ళిద్దరూ క్లాసుమేట్లని, మేనేజరు గుర్తుపట్టి పలకరించాడు కూడా!
‘ఆనంద్ నేనంటే పడిచచ్చేవాడు, పెళ్లి చేసుకొందామని బతిమాలేడు కూడా. ఉద్యోగం లేదు కానీ పెళ్ళి ఒకటి తక్కువైందా? అన్నానొకసారి. మద్రాసులో వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళి ప్రయత్నాలు చేశాడు. అతనికి మంచి ఉద్యోగం దొరికేటప్పటికి లేటయింది. మావాళ్ళు ఈ లోపులే హడావుడి పడి ఇరవయ్యో యేటే నాకు పెళ్ళి చేసేశారు' అంది భారతి ఆ రాత్రి. ‘…. నా గొంతు కోశారు’ అని కూడా కలపలేదేం?' అన్నాడు రంజిత్. ‘ఎందుకులెండి పెడర్థాలు తీస్తారు. ఆనంద్ నాతో మాట్లాడాలనీ, కనీసం నన్ను చూడాలని తహతహలాడేవాడు. ఉత్తరాలు కూడా రాసేడు. నేను ఖాతరు చేసేదాన్ని కాదు. ఓసారి ధైర్యంచేసి పెళ్ళి మాటెత్తితే ఫెడీల్మని జవాబిచ్చేను. అంతే పౌరుషంకొద్దీ మద్రాసు వెళ్ళిపోయాడు.’
రంజిత్‌కి అనుమానం వచ్చింది, తనకి పౌరుషం లేదని భారతి ఎత్తిపొడుస్తోందాని. కానీ అతను క్రమంగా గమనించిన దేమిటంటే ఆనంద్ పట్టుదల గల మనిషి. కంపెనీ వ్యవహారాలు చక్కబరిచేడు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని అమలు పరిచేడు. ‘‘మీ ఆనంద్ పుణ్యమాని కంపెనీ పరిస్థితి బాగుపడి మాకు జీతాలు పెరిగేట్లున్నాయి.’’ అన్నాడోసారి భార్యతో. అంటూనే నాలిక్కరుచుకున్నాడు కూడా. కానీ అప్పటికే భారతికి కొమ్ములొచ్చేశాయి. ‘అటువంటి వాడి భార్య కావలసినదానిని నీ పాలబడ్డాను చూడు, నా కర్మం కాకపోతే’ అన్నట్టు ఓ చూపు పారేసి వెళ్ళిపోయింది. రంజిత్‌కి ఆనంద్ మీద అసూయ పుట్టుకొచ్చింది. అతనితో అనవసరంగా వాదనకు దిగడం, చెప్పిన పని చేయకపోవడం, అతనిలో లోపాలు కనిపెట్టి అందరికీ చెప్పడం సాగించేడు.
ఈ లోపున రంజిత్ పుట్టినరోజు వచ్చింది. ప్రతీ ఏడూ పోరుపెట్టి కొత్త బట్టలు కొనిపించే భారతి ఈసారి ‘బట్టలెందుకులెండి, ఇంటికెవరైనా వస్తే సరైన కుర్చీ బల్లా లేవు. ఆ డబ్బెట్టి ఫర్నిచర్ కొందాం.’ అంది. ఎందుకలా అన్నదో తెలీక రంజిత్ సరేనని ఫర్నిచర్ కొన్నాడు. కొన్నరోజు సాయంత్రం 'ఆనంద్‌ని ఓసారి మనింటికి టీకి రమ్మనమండి' అని భారతి అనడంతో మాత్రం మండిపడ్డాడు. ‘ఇందుకా ఫర్నిచర్?’ అని అరిచాడు. పిలవమని భారతి పోరు పెరిగినకొద్దీ పిలవకూడదన్న పట్టుదల పెరిగింది రంజిత్‌కి. ఆవతల ఆనంద్ భారతి గురించి ఎలా ఉంది ఏమిటని ఆరాలు తీయటం లేదు. అతనికంటే చిన్న ఉద్యోగి భార్యను గురించి అడగడం నామోషీ యేమో. కసికొద్దీ ఆనంద్‌పై మరింత విరుచుకు పడుతూంటే అతని స్నేహితులే ఒకసారి రంజిత్ని నిలదీశారు. 'ఎందుకయ్యా ఆనంద్ మీద అకారణకోపం?’ అని.
రంజిత్ తన ప్రవర్తనని సింహావలోకనం చేసుకుని చూసుకుని సిగ్గుపడ్డాడు. ‘ఆనంద్ తనకు చేసిన ద్రోహం ఏమిటి? చెప్పాలంటే ఏమీ లేదు. మంచి డిపార్టుమెంటులోకి మార్చేడు. స్పెషల్ ఇంక్రిమెంటు ఇమ్మని సిఫార్సు కూడా చేశాడు. తను ఎంత అవకతవకగా మాట్లాడినా ఇప్పటిదాకా తనమీద ఏ చర్యా తీసుకోలేదు. మర్యాదగానే మాట్లాడుతున్నాడు. మరి తన వివేకం ఏమయింది? భారతి కారణంగా అడుగంటింది. భారతిమీద కోపాన్ని ఆనంద్ మీద చూపిస్తున్నాడు తను. అంతే! తన తన భార్య ఇంకో మగాడంటే మోజు పడుతోందంటే తప్పు తనలోనో, తన భార్యలోనో ఉండాలి గానీ ఆ మగాడిలో ఉండనవసరం లేదు. అతను తన భార్యను ఆకర్షించే ప్రయత్నం ఏమీ చేయడంలేదు. పెద్దమనిషిలాగానే ప్రవర్తిస్తున్నాడు.
భార్య పోరు భరించలేక తనోసారి ‘మా ఇంటికి…. వీలుంటే … ఓసారి రండి’ అంటే ‘వీలు చూసుకుని తప్పకుండా వస్తాను’ అన్నాడు కానీ పరిగెట్టుకుని వచ్చేయలేదు. ఒంటరిగా ఉంటున్నాడు. కుటుంబం ఇక్కడ లేదు. ఎప్పుడైనా రావచ్చు. అయినా రాలేదు. తను పిలిచి వుండడనీ, పిల్చుంటే ఆనంద్ పరిగెట్టుకు వచ్చేవాడనీ భారతి గట్టిగా నమ్ముతోంది. ఇంత వయసొచ్చినా మతి లేకుండా ప్రవర్తిస్తోంది. జీతం పెరగడంతో తనకూ ఉషారు పుట్టి పక్కలో దగ్గరకు చేరబోయినా రానివ్వటంలేదు. తనకంటే ఆనంద్ ఉద్యోగరీత్యా పైస్థాయిలో వున్నాడనీ, ఆనంద్ చేత ఆరాధింపబడిన వ్యక్తిగా తనింకా ఎత్తయిన స్థాయిలో ఉందనీ ఆమె అహంభావం. అయితే ఆనంద్ ఆమె నింకా ఆరాధిస్తున్నాడా, లేదా? ఆ విషయం మాత్రం తెలీదు. తెలుసుకోవడం ఎలా? వాళ్ళిద్దరూ ఏకాంతంలో కలిస్తే తప్ప అది తెలియదు. కలిస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఊహించడానికే భయంగా ఉంది. కానీ అదెంత భయంకరమైనదైనా ఇప్పటి పరిస్థితికంటే అదే మెరుగేమో.’ అనుకున్నాడు రంజిత్.
భారతికి ఆశ్చర్యం వేసింది, ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి భర్త తననుకూడా రమ్మన్నందుకు. ‘ఫ్యాక్టరీ ఊరికి దూరంగా ఇరవై మైళ్ళ దూరంలో కట్టారు. ఫంక్షన్ సాయంత్రం అయిదు గంటలకి. ఉపన్యాసాలూ, డిన్నరూ అవి అయ్యేసరికి రాత్రి తొమ్మిది దాటుతుంది. పిల్లల్ని పక్కింటి వాళ్ళింట్లో పడుకోమనాలి. బస్సులో ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది. ఇంత అవస్థ ఎందుకు పడాలి? మొన్న ఫంక్షన్లో కొలీగ్స్ కామెంట్స్ విన్నాక ఏ భర్తా భార్యను ఆఫీసు ఫంక్షన్స్‌కి మళ్ళీ తీసుకెళ్ళడు. అయితే తన భర్త ఎందుకు తీసుకెళుతున్నట్లు? ఒకవేళ ఆనంద్ తీసుకు రమ్మన్నాడేమో!
ఫంక్షన్ అయ్యేసరికి తొమ్మిదిన్నరయింది. నిర్వహణాభారం నెత్తి మీద వేసుకున్నాడు కాబట్టి భర్తకు పని తెమలలేదు. ‘ఆనంద్ గారూ, మీరేమనుకోకపోతే, మీ కార్లో మా మిసెస్‌ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా? నాకింకా ఒక గంట పనుంది’ అని అడిగేడు తన ఎదురుగానే. ఆనంద్ వెంటనే ‘షూర్, షూర్’ అన్నాడు. అది భర్త మీద గౌరవమో లేక తనతో అరగంటసేపు ఏకాంతంగా, సమీపంగా ఉంటానన్న ఉత్సాహమో తెలియదు. కార్లో పక్క సీట్లో కూచోమన్నాడు. తనకా కారు కొత్త. డ్రైవ్ చేసేవాళ్ళకు ఎంత దగ్గరగా కూచోవచ్చో తెలియదు. చీర కొంగు అతనికి తగిలేట్లు కూచుంది. నిర్మానుష్యమైన రోడ్డు రాగానే కారు ఆపి దగ్గరకు లాక్కుంటాడేమో. తను ఒప్పుకోవాలా? వద్దా? ఒప్పుకుంటే తన గురించి తక్కువగా అంచనా వేయడు కదా!
కానీ ఆనంద్ అటువంటిదేమీ చేయలేదు. మామూలుగా కామన్ ఫ్రెండ్స్ గురించి వాకబు చేస్తున్నాడు. పరాయి మనిషి భార్యనని జంకుతున్నాడేమో. భర్త తన ద్వారా ప్రమోషన్ గురించి ప్రయత్నిస్తున్నాడని అనుకుంటున్నాడేమో. తనే కాస్త తెగింపు చూపించి అదేమీ లేదని ధైర్యం చెప్పాలి. చెయ్యి అతని వీపు వెనకగా చాచింది. అతను సీట్లో కదిలేడు. స్లీవ్‌లెస్ జాకెట్టు కొని, వేసుకొని వుంటే బాగుండేది. ఏదీ, తనకిలాంటి పెద్దతరహా మనుష్యులు తారసిల్లుతారని తెలియదుగా. భర్త స్నేహితులందరూ తక్కువ లెవెలు వాళ్ళే. సెంటు కూడా మంచిది లేదు ఇంట్లో. ఆనంద్ ఇప్పుడున్న లెవెలు పెద్దది. తనను తక్కువగా చూస్తున్నాడేమో! అందుకే దగ్గరికి తీసుకోవటంలేదేమో. తగిన సాధనసంపత్తి లేకపోయినా స్వతహాగా పైస్థాయి దానినేననీ, తనకు సరితూగే దానినేననీ అతనికి చెప్పడం ఎలా? తన ఇంట్రిన్సిక్ వర్త్ అతనికి చూపాలంటే కారులో కుదరదు.’
కారు దిగాక భారతి ఆనంద్‌ను ఇంట్లోకి రమ్మంది. ఇప్పటికే లేటైందికదా అంటే ‘మొదటిసారి ఇంటికొచ్చి కాఫీయైనా తాగకుండా వెళతావా?' అని చివాట్లేసింది. ఆనంద్ ముందుగదిలో కూర్చోబోతే ‘నువ్వేమైనా పరాయివాడివా మధ్యగదిలోకి రా’. అంటూ పిల్చి, మంచం మీద కూచోమంది. ‘కాఫీకి డికాషన్ తీస్తానుండు' అని వంటింట్లోకి వెళ్ళివచ్చి ‘విశేషాలేమిటి చెప్పు’ అని మంచానికి ఆ చివర కూచుంది. ‘పిల్లలు పక్కింట్లో నిద్రపోతున్నారులే. మనం ఓపెన్‌గా మాట్లాడుకోవచ్చు’ అంటూ భారతి అన్నా, ఆనంద్ ‘విశేషాలేముంటాయి, రొటీన్ లైఫ్’ అంటూ నోరు చప్పరించేశాడు.
‘బెరుకు పోగొట్టాలి' అనుకుంటూ భారతి లేచి ఒళ్ళు విరుచుకొని ‘ఈ పట్టుచీర మహా ఉక్క పెడుతోంది' అంటూ విప్పి మంచంమీద పడేసి లంగా జాకెట్టుతో మిగిలింది. ఆనంద్ కంగారుపడి లేవబోతూంటే ‘నేనేమైనా కొత్తదాన్నా, అలా పారిపోతావు’ అని భుజం మీద చేయి వేసి నొక్కి కూచోబెట్టింది. ‘కూర్చో ఇప్పుడే మొహం కడుక్కొని వస్తా, అందాకా ఇది చూస్తూ వుండు. కాఫీ దిగుతూంటుంది' అని పరుపుకింద నుంచి శృంగార పత్రికొకటి చేతికిచ్చి బీరువాలోంచి అపురూపంగా దాచుకొనే టర్కిష్ టవల్ తీసి భుజాన వేసుకొని బాత్రూమ్కి వెళ్ళింది.
స్నానంచేసి తువ్వాలు వంటికి చుట్టుకొని వంటింట్లో ఆగి ఒక్కసారి తనను తాను చూసుకొంది. తువ్వాలు చాలీచాలనట్లుగా వుంది. ఆనంద్ బిడియం పటాపంచలయి పాత ఆనంద్ ప్రత్యక్షమవడం ఖాయం అనుకుని తృప్తిపడింది. మధ్య గదిలోకి రాగానే ఆనంద్ పత్రికలోంచి తలెత్తి చూశాడు, ఒక్కక్షణం తదేకంగా చూసి, తడబడి ‘నువ్వు బట్టలు కట్టుకో’ అంటూ లేవబోయాడు. ‘అబ్బ ప్రతిసారీ వేషాలెయ్యకు. ఇక్కడ పరాయివాళ్ళెవరున్నారు?’ అని సుతారంగా విసుక్కొని తువ్వాలు కొసతో చెవిలో నురుగు తుడుచుకొంటూ దగ్గరకు రాబోయింది. వద్దన్నా కంటబడుతున్న అందాలు ఆనంద్ మతి పోగొట్టాయి. అంతలోనే ఎవరో అతని వీపు చరిచినట్లయింది, వెన్ను జలదరించింది. తల తిప్పుకుని ‘భారతీ, వాటీజ్ దిస్ గోయింగ్ ఆన్?’ అన్నాడు.
భారతి నివ్వెరపోయి, తమాయించుకొంది. అతనికేసి చూసింది. ఆనంద్ ‘కమ్ టు సెన్సెస్, దిస్ ఈజ్ నాట్ ప్రాపర్’ అన్నాడు. భారతి ఒక్కసారి తల దించుకొని, అంతలోనే చివ్వున తలెత్తి చూసి, ‘నువ్వు కావాలనుకున్నదేగా ఆనంద్, పాతరోజులు మర్చిపోయేవా?’ అని అడిగింది. అతను ఒక్కక్షణం తెల్లబోయి, ‘అవి పాతరోజులు గదా’ అన్నాడు కళ్ళు చికిలించి. ‘అప్పుడు నీ విలువ నేను తెలుసుకోలేక పోయాను. ఇప్పుడు నా విలువ నువ్వు తెలుసుకోలేక పోతున్నావు' అంటూ ఆమె చేరువై అతని చేయి పట్టుకుంది. ‘అదేమిటి భారతీ, మనం పెళ్ళయినవాళ్ళమని మర్చిపోతున్నావా? అప్పుడైతే ఏదో కుర్రతనం’ అన్నాడు ఆనంద్. ‘కుర్రతనం ఏమిటి? మనదేమైనా హైస్కూలు లవ్వా? చదువూసంధ్యా పూర్తయి, యువకుడిగా ఉండగా పెళ్ళి చేసుకోమని నన్నడగలేదూ?’
‘నిజమే, కానీ పెళ్ళిచేసుకోమని నేను కనీసం అరడజను మంది అమ్మాయిలను అడిగి ఉంటాను. కానీ చేసుకోలేదే! వాళ్ళూ సీరియస్ కాదు, నేనూ సీరియస్ కాదు. మన క్లాసుమేట్స్ లోనే ముగ్గురికి సైట్ కొట్టేవాణ్ణి. వీళ్లు కాక ఇంటిదగ్గర ఒకళ్ళు, కాలేజీ దార్లో ఇంకో అమ్మాయి, టైపు ఇనిస్టిట్యూట్‌లో మరో అమ్మాయి, సైకాలజీ లెక్చరరు, మా అత్తయ్యగారమ్మాయి నాకంటే పెద్దవాళ్లయినా వాళ్ళ వెంటపడి తిరిగేవాణ్ణి. ఇంతెందుకు? నీతోటే తిరిగే వసుంధర – నువ్వు మీ ఇంటిదారి పట్టాక ఆ అమ్మాయి వెనకాలే వాళ్ళింటిదాకా వెళ్ళేవాణ్ణి. నేను తిరిగేది నీకోసమని నువ్వు పొరబడుతున్నావనీ, అసలు నేను తిరిగేది ఆ అమ్మాయి గురించేననీ ఆ అమ్మాయికి గట్టి నమ్మకం. నీతో ఎప్పుడూ చెప్పి వుండదులే. ఇవన్నీ ఆ వయసుకి సహజం. వయసు వస్తున్న కొద్దీ మెచ్యూరిటీ వస్తుంది. దాటేసిన ఆ రేవులను తలుచుకుని చిరునవ్వు నవ్వుకుంటాం తప్ప పట్టుకుని వేళ్లాడం. నేనే కాదు, వాళ్లూ అంతే.’
భారతికి దుఃఖం వచ్చింది. ‘అంటే.. మీ అందరికీ వయసుతో మెచ్యూరిటీ వచ్చింది. నాకు మాత్రం రాలేదంటావు' అంది నిష్టూరంగా.
'ట్రై టు అండర్‌స్టాండ్, మీ ఆయన మంచివాడు, సమర్థుడు, అదృష్టం వక్రించి ఈ కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరాడు. ఇవాళ ఫంక్షన్ అతను సింగిల్ హేండెడ్‌గా మేనేజ్ చేశాడు. అందరూ మెచ్చుకున్నారు, వినే ఉంటావు. నేనతని టాలెంట్ ఎప్పుడో గుర్తించి ప్రమోషన్‌కి రికమెండ్ చేశాను. రేపోమాపో వస్తుంది. మీ స్థాయి పెరుగుతుంది. ఇంతకంటె మంచి యింటికి మారతారు. చక్కటి పిల్లలున్నారు. జీవితం హాయిగా గడపక పాత బ్యాగేజీ మోసుకుని తిరుగుతావెందుకు? ఇలాంటి వ్యవహారాల్లోకి దిగినకొద్దీ కొత్త కొత్త సమస్యలొస్తాయి. ఆలోచించు….’ అన్నాడు ఆనంద్.
భారతికి రోషంతో కన్నీళ్ళు వచ్చాయి. తను బయటపడి వరించబోయి భంగపడినందుకు. ఆనంద్‌ను రెచ్చగొట్టి దాసోహ మనిపించుకుని, అహాన్ని తృప్తిపరుచుకున్నాక అప్పుడు ‘నో’ అందామనుకుంది కానీ అతనితో వ్యవహారం సాగించాలని అనుకోలేదు. అతను పాదాక్రాంతం కాకపోగా ఎదురుతిరిగి నీతులు చెప్తున్నాడు. ఇంతదాకా వచ్చాక వెనుదిరిగే ప్రశ్న లేదు. నడుం మీద చెయ్యి వేసుకొని ‘నీ భార్య నా కంటే అందంగా ఉంటుందా?’ అంటూ సవాలు విసిరింది. మొట్టమొదటిసారిగా ఆనంద్ నవ్వాడు. భారతి అహాన్ని అణచక తప్పదనుకున్నాడు. దగ్గరికి వచ్చి రెండు భుజాల మీద చేతులు వేసి శరీరాన్ని పట్టిపట్టి చూస్తూ ‘నీకు కావలసినదాని కంటె కండ ఎక్కువగా ఉంది. వదులుగా కూడా ఉంది. మా ఆవిడంటావా, తను ఒకప్పటి మిస్ చెన్నయ్ కదా, ఫిగర్ ఎలా మేన్‌టేన్ చేయాలో బాగా తెలుసు. ఫ్యామిలీ ఈ ఊరికి షిప్టు అయ్యాక పిలుస్తా. వచ్చి చూద్దువుగాని. ఆఫ్టరాల్ వి ఆర్ ఫ్రెండ్స్’ అంటూ గిరుక్కున తిరిగి బయటికి వెళ్ళిపోయాడు. భారతి మంచం మీద కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది.
భారతిలో వచ్చిన మార్పు రంజిత్‌కి స్పష్టంగా తెలిసివచ్చింది. ఇక తనని తక్కువగా చూడడం లేదు. దేనిలోనూ తక్కువ చేయటం లేదు. తనకి ప్రమోషన్ రావడం, తత్కారణంగా మంచి యింటికి మారి లివింగ్ స్టాండర్డ్ పెరగడం ఒక కారణమేమో, పెరిగిన ఆత్మవిశ్వాసంతో ఆమె కోర్కెలకు తగ్గట్టు తను ప్రతిస్పందించడం కూడా మరో కారణమేమో. ఆ పాత యింట్లో ఆ వేళ ఏం జరిగిందోనన్న ఆలోచన ఆ ఇంట్లోనే పాతిపెట్టేశాడు.(వ్యథావనితాయణం సీరీస్‌లో మరో కథ వచ్చే నెల మొదటి బుధవారం).
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2022)