సోషల్ మీడియాలో వ్యాప్తి చెందే కొన్ని వార్తలను లేదా వార్తా కథనాలను చూస్తుంటే విచిత్రంగా, ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలాంటి వార్తలు చూస్తుంటే ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందన్న సామెత గుర్తుకు వస్తుంది. ఇంతకూ అసలు సంగతి ఏమిటంటే … జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొన్నీమధ్య ఏపీలో బీజేపీతో సంబంధాలు తెంపుకుంటున్నట్లు అంటే పొత్తును వదులుకుంటున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. టీడీపీతో కలిసి ఎన్నికల్లో ముందుకు సాగాలని ఆలోచన ఉన్నట్లు కూడా వ్యక్తం చేశాడు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి టీడీపీ పొత్తు ఉంటుందా? ఉండదా? అనేది తరువాత సంగతి.
అయితే పవన్ బీజేపీతో సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించగానే ఇతర రాష్ట్రాల్లోని అనేక ప్రాంతీయ పార్టీలు అంటే బీజేపీని వ్యతిరేకిస్తున్న పార్టీలు పవన్ పై దృష్టి సారించాయట. పవన్ వంటి నాయకుడు ఏపీకే పరిమితం కాకూడదని.. జాతీయ స్థాయిలో ఉండాలని దేశ వ్యాప్తంగా మిగతా రాజకీయ పక్షాలు బలంగా కోరుకుంటున్నాయట. వామపక్షాలతో పాటు బిహార్ సీఎం నితీష్ కుమార్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, ఉద్దవ్ ఠాక్రే, స్టాలిన్ వంటి నేతలు ఇప్పటికే పవన్ కు టచ్ లోకి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ విస్తరిస్తోంది.
అన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తూ వస్తోంది. చిన్న చిన్న పార్టీలను కబళిస్తూ బలీయమైన శక్తిగా ఎదుగుతోంది. రాష్ట్రాల్లో ఉండే రాజకీయ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకొని భారీగానే లబ్ధి పొందుతోంది. ఈ క్రమంలో తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు ఆ పార్టీ చరిత్రను మసకబార్చుతున్నాయి. అయినా ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం వెనక్కి తగ్గడం లేదు. అటు రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేసే క్రమంలో కేంద్ర నిఘా సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్న అపవాదు ఉంది. సీబీఐ, ఈడీ వంటి వాటిని ఎగదోస్తుండడంతో కాకలు తీరని రాజకీయ నేతలు సైతం సైలెంట్ కావాల్సి వస్తోంది. కేంద్ర పెద్దలకు సలాం చేయాల్సి వస్తోంది.
దీనికి కారణం వారు సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండి అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం. అందుకే పవన్ లాంటి క్లీన్ ఇమేజ్ కలిగిన నాయకుడు జాతీయ స్థాయిలో తెరపైకి వస్తే.. బీజేపీ దుందుడుకు చర్యలకు కొంత బ్రేక్ ఇచ్చే అవకాశం ఉందట. ఈ ప్రచారంలో నిజానిజాలేమిటో తెలియదు. దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న నాయకులు ఎవరూ పవన్ తో టచ్ లో ఉన్న దాఖలాలు కనబడలేదు. పవన్ కు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి ఉందా? ఇప్పటికీ జనసేన ఆపసోపాలు పడుతూనే ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిరోజూ రంకెలు వేస్తున్న తెలంగాణా సీఎం కేసీఆర్ నే ఎవరూ పట్టించుకోవడంలేదు. అలాంటిది పవన్ మీద ఆసక్తి చూపిస్తారా?
పవన్ ఇప్పటివరకు ఎప్పుడూ దేశ సమస్యల మీద తన పార్టీ విధానాలు చెప్పలేదు. అలాంటప్పుడు వేరే రాష్ట్రాల నాయకులు ఈయన్ని ఎందుకు పట్టించుకుంటారు? అసలు జనసేనకు ఏపీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు దొరుకుతారా అనేది సందేహమే. గత ఎన్నికలతో పోలిస్తే జనసేన బలం పెరిగిందని కొందరు చెబుతున్నారు. అది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఎన్నికలు దగ్గర పడే సమయంలో వివిధ మీడియా సంస్థలు చేసే సర్వేల్లో జనసేన పరిస్థితి ఏమిటో తెలుస్తుంది. అప్పుడు దాని జయాపజయాలను అంచనా వేయవచ్చు.