కన్యాకుమారి నుంచి నడక ప్రారంభించిన రాహుల్ హైదరాబాదుకు వచ్చేశారు. ఘనంగా ఒక సభ కూడా పెట్టారు. కేసీఆర్ సర్కారు మీద నిప్పులు చెరిగే ప్రయత్నం కూడా చేశారు. పనిలో పనిగా తమ ప్రధాన శత్రువు బిజెపి గనుక.. వారి మీద కూడా నాలుగు మాటలు రువ్వే ప్రయత్నం చేశారు. ఈ జమిలి ప్రయత్నాల్లో భాగంగానే.. ఇద్దరికి కలిపి ముడిపెడుతూ కూడా తన ప్రసంగాన్ని సాగించారు.
ఒకవైపు బిజెపి, తెరాస పార్టీలు రోడ్డుమీద పడ్డట్టుగా కలబడి కొట్టుకుంటూ ఉంటే.. ప్రజలకు ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుండగా వారు నమ్ముతుండగా.. ప్రజలు ఏం అనుకుంటున్నారో పట్టించుకోకుండా.. బిజెపి టిఆర్ఎస్ లోలోపల దోస్తీ నడుపుతూ పైకి తమాషాగా ఎన్నికలప్పుడు మాత్రం పోట్లాడుకుంటున్నారనే వాదనను ప్రజల మెదళ్లలోకి చొప్పించడానికి రాహుల్ ప్రయత్నం చేశారు.
నిజానికి ఈ వాదన కొత్తది కాదు. ఆ మాటకొస్తే ఏ ఒక్కరికీ కొత్త కాదు. టిఆర్ఎస్-బిజెపి అంతర్గత స్నేహంతో రాజకీయం చేస్తున్నాయని కాంగ్రెస్ అంటుంది. టిఆర్ఎస్-కాంగ్రెస్ లోలోపల కుమ్మక్కయ్యాయని బిజెపి అంటుంది. వీరిద్దరికంటె తానేం తీసిపోలేదన్నట్టుగా.. టిఆర్ఎస్ ఇంకో అడుగు ముందుకేసి.. బిజెపి-కాంగ్రెస్ కుమ్మక్కయి తెలంగాణలో రాజకీయం నడుపుతున్నాయని అంటుంది. అయితే ఇవన్నీ కూడా పసలేని పాచిపోయిన విమర్శలు.
ఏం మాట్లాడాలో తెలియక.. ఏదో కాస్త ప్రత్యర్థుల మీద బురద చల్లేసి వెళ్లిపోతాం అని చేసే విమర్శలు. లోకల్ లీడర్లు.. నోరేసుకుని మాట్లాడడం తప్ప ఇంకో సంగతి ఉండదు గనుక వారేం మాట్లాడినా చెల్లుతుంది. కానీ.. ఖర్మం ఏంటంటే.. ఢిల్లీ నుంచి వచ్చే బడా నేతలు కూడా అదే మాట్లాడతారు. అమిత్ షా వచ్చి.. కాంగ్రెస్ తో గులాబీకి దోస్తీ కట్టి లోకల్ నేతలిచ్చిన స్క్రిప్టు చదువతారు. రాహుల్ వచ్చినా.. కమలానికి గులాబీకి అంటుకట్టి హైబ్రీడ్ పుట్టించే ప్రయత్నం చేస్తారు. ఈ పసలేని విమర్శల నుంచి ఈ అగ్రనేతలైనా బయటకు రాకపోతే.. వారి వారి పార్టీలకే నష్టం జరుగుతుంది తప్ప మరో లాభం లేదు.
కాంగ్రెస్ పోకడలను గమనిస్తే ఆ ఒక్క నినాదాన్ని పట్టుకునే గోదారి దాటేయాలని కలగంటున్నట్టుగా మనకు అనిపిస్తుంది. పాలన మీద నిర్దిష్టమైన విమర్శలు వారికి చేతకాదు. అర్థం పర్థంలేని ఆరోపణలు తప్ప.. నిప్పులు చెరిగే విమర్శలతో విరుచుకు పడడం లేదు. తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. ఆ మార్పులో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ముగిసేనాటికి ఇంకా స్పష్టత రావొచ్చు. కాంగ్రెస్ గత ఎన్నికల్లో నెంబర్ టూ లో నిలిచింది. ఈసారి ఎన్నికలకు నెంబర్ టూ వారి చేతినుంచి జారిపోయే అవకాశం ఎక్కువ.
వాస్తవాల్ని గ్రహించకుండా.. ఇద్దరికీ కలిపి కౌంటర్ ఇవ్వాలన్నట్టుగా ప్రజలు నమ్మజాలని విమర్శలు చేసినంత కాలం.. వారు తమ గోతిని తామే తవ్వుకున్నట్టు లెక్క.