జనసేనాని పవన్‌కల్యాణ్ బూతుపురాణంపై ఆయన మిత్రుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అలీ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్‌కు అలీ హితవు చెప్పారంటూ ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కుమార్తె వివాహానికి సీఎంను ఆహ్వానించే నిమిత్తం ఇవాళ అలీ తన భార్యతో కలిసి వైఎస్ జగన్‌ను కలిశారు.
అనంతరం ఆయన ఓ చానల్‌తో మాట్లాడుతూ రాజకీయాలపై తనవైన అభిప్రాయాల్ని వెల్లడించారు. కుమార్తె పెళ్లికి వస్తానని జగన్ మాట ఇచ్చారన్నారు. అలాగే తనకు పదవి ఇచ్చి గౌరవించినందుకు జగన్‌కు కృతజ్ఞతలు చెప్పామన్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతకు న్యాయం చేస్తానని ఆయన అన్నారు. సీఎంకు మంచి పేరు తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని అలీ తెలిపారు.
సీఎంను కొందరు బూతులు తిడుతున్నారని, దీనిపై మీ స్పందన ఏంటని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటు సమాధానం ఇచ్చారు. ఆ వ్యాఖ్యలు జనసేనాని పవన్‌కల్యాణ్ ఉద్దేశించి అన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన ఏమన్నారంటే… రాజకీయాల్లో సహనం అవసరం అన్నారు. సహనం ఉన్న వాళ్లు గొప్ప నాయకులు అవుతారన్నారు. విమర్శ లు వస్తుంటాయని, వాటిని గుండెల మీదకు తీసుకుని ఇష్టమొచ్చినట్టు మాట్లాడ్డం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు.
మనం ఏం మాట్లాడుతున్నామో ఐదు కోట్ల ఆంధ్రా జనాభా చూస్తుంటారని ఆయన చెప్పుకొచ్చారు. అభ్యంతరకర భాష మాట్లాడ్డం సరైంది కాదని సీనియర్ మోస్ట్ నటుడిగా సలహా ఇస్తున్నట్టు అలీ పరోక్షంగా తన మిత్రుడైన పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి హితబోధ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
ఎందుకంటే ఇటీవల నా కొడుకుల్లారా, చెప్పుతో కొడ్తా అంటూ పవన్‌కల్యాణ్ ఇష్టానుసారం అధికార పార్టీ నేతలపై దూషణలకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అలీ వ్యాఖ్యలపై నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు తమవైన భాష్యాలు చెప్పడం గమనార్హం. సీనియర్ నటుడిగా సలహా ఇస్తున్నానని అలీ ప్రత్యేకంగా ప్రస్తావించడం వెనుక ఉద్దేశం, పవన్‌ను ఓ యాక్టర్‌గా మనసులో పెట్టుకుని మాట్లాడ్డమే అని అంటున్నారు.