అమ‌రావ‌తి చెంప ఛెళ్లుమ‌నిపించిన హైకోర్టు!

అమ‌రావ‌తి రాజ‌ధాని పేరుతో కుట్ర పూరిత రాజ‌కీయాలు చేస్తున్న వారి చెంప ఛెళ్లుమ‌నిపించేలా హైకోర్టు గ‌ట్టి దెబ్బ‌లు కొట్టింది. అధికార పార్టీ, అలాగే ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌కారులు ఏవైతే ఆరోప‌ణ‌లు చేస్తున్నారో, అలాంటి వాటికి…

అమ‌రావ‌తి రాజ‌ధాని పేరుతో కుట్ర పూరిత రాజ‌కీయాలు చేస్తున్న వారి చెంప ఛెళ్లుమ‌నిపించేలా హైకోర్టు గ‌ట్టి దెబ్బ‌లు కొట్టింది. అధికార పార్టీ, అలాగే ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌కారులు ఏవైతే ఆరోప‌ణ‌లు చేస్తున్నారో, అలాంటి వాటికి బ‌లం చేకూర్చేలా హైకోర్టు ఇవాళ ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తాజా హైకోర్టు తీవ్ర వ్యాఖ్య‌ల‌పై ప‌చ్చ బ్యాచ్ తేలుకుట్టిన దొంగ‌లా ఉండిపోయింది.

అమ‌రావ‌తినే ఎగ్జిక్యూటివ్ రాజ‌ధానిగా కొన‌సాగించాలంటూ రెండో ద‌శ పాద‌యాత్ర చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. మ‌హాపాద‌యాత్ర పేరుతో అర‌స‌వెల్లి వర‌కూ పాద‌యాత్ర చేయ సంక‌ల్పించారు. పాద‌యాత్ర‌కు ఇత‌ర ప్రాంతాల నుంచి మ‌ద్ద‌తు లేక‌పోగా, వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వం అడ్డంకులు సృష్టిస్తోంద‌ని, హైకోర్టు ఆదేశాల‌ను అమ‌లు చేయాలంటూ మ‌రోసారి న్యాయ‌స్థానాన్ని అమ‌రావ‌తి జేఏసీ ఆశ్ర‌యించింది.

ఈ సంద‌ర్భంగా కొన్ని స‌డ‌లింపులు కోరుతూ అమ‌రావ‌తి జేఏసీ చేసిన విన్న‌పాన్ని హైకోర్టు తిర‌స్క‌రించింది. ఈ నేప‌థ్యంలో తాము కూడా వారికి మ‌ద్ద‌తుగా పాద‌యాత్ర‌లో పాల్గొనేందుకు అనుమ‌తించాల‌ని కోరుతూ రాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణ స‌మితి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఇలాంటి తెలివి తేట‌లు వారికి మాత్ర‌మే సొంత‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఈ పిటిష‌న్‌పై విచార‌ణ సంద‌ర్భంగా చీఫ్ జ‌స్టిస్ ప్ర‌శాంత్ కుమార్ మిశ్రా, జ‌స్టిస్ సోమ‌యాజుల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అమ‌రావ‌తి రాజ‌ధానికి అనుకూల తీర్పు ఇచ్చిన‌ప్ప‌టికీ పాద‌యాత్ర ఎందుకు చేస్తున్నార‌ని హైకోర్టు నిల‌దీసింది. అలాగే ఇలాంటి పిటిష‌న్ల ద్వారా కోర్టుల‌పై ఒత్తిడి తీసుకురావాల‌ని అనుకుంటున్నారా? అని ఆగ్ర‌హం ప్ర‌ద‌ర్శించింది. పాద‌యాత్ర‌లో ముందు వ‌రుస‌లో రైతులు ఉన్న‌ప్ప‌టికీ, వారి వెనుక వేరే వాళ్లున్నార‌ని వ్యాఖ్యానించింది.

అమ‌రావ‌తి పాద‌యాత్ర రాజ‌కీయ ప్రేరేపిత యాత్ర‌గా హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య చేసింది. అస‌లు పిటిష‌న్‌లో పార్టీ కాని వారు అప్పిల్ ఎలా దాఖ‌లు చేస్తారంటూ రాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణ స‌మితిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ పిటిష‌న్ విచార‌ణ అర్హ‌త‌పై తేల్చాల‌ని ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది ధ‌ర్మాస‌నాన్ని అభ్య‌ర్థించారు. పూర్తి వివ‌రాల‌తో కౌంట‌ర్ దాఖ‌లు చేస్తామ‌ని ప్ర‌భుత్వం త‌ర‌పు న్యాయ‌వాది కోర‌డంతో, విచార‌ణ‌ను సోమ‌వారానికి హైకోర్టు వాయిదా వేసింది.  

హైకోర్టు తీవ్ర వ్యాఖ్య‌ల‌తో అమ‌రావ‌తి పేరుతో రాజ‌కీయాలు చేస్తున్న వారి ముసుగు తొల‌గిన‌ట్టైంది. ఇంత వ‌ర‌కూ ప్ర‌భుత్వంపై మాత్ర‌మే హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేస్తోంద‌ని సంబ‌ర‌ప‌డిన అమ‌రావ‌తి వ్యాపారులు…తాజా ఎపిసోడ్‌తో స‌మాధానం చెప్ప‌డానికి మన‌స్క‌రించ‌క ముఖం చాటేస్తున్నారు.