మునుగోడు ఓట్ల వేటలో పార్టీలు అమీతుమీ తలపడుతున్నాయి. దేశ రాజకీయ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికల్లో ఒకటిగా మునుగోడు నిలుస్తుందని మొదటి నుంచి అంచనాలున్నాయి. సరాసగటున ఒక్కో ఓటుపై అన్ని పార్టీలూ కలిసి నలభై వేల రూపాయల వరకూ ఖర్చు చేసినా పెద్దగా ఆశ్చర్యం లేదనే మాట ఈ ఉప ఎన్నిక ప్రకటనతోనే వినిపించింది. ఇలాంటి నేపథ్యంలో… పోలింగ్ దశకు వచ్చే సరికి ఆ గణాంకాలే నిజం అవుతున్నట్టుగా ఉన్నాయి.
ఉప ఎన్నిక సమరం ప్రారంభం కాగానే.. పార్టీలు విపరీత స్థాయిలో ఖర్చు పెడుతూ వచ్చాయి. ప్రచారం మొదలవుతున్న దశ నుంచినే.. వెంట తిరిగే మనుషులకు రోజుకు ఐదారు వందల రూపాయల కూలీ, బిరియానీ, మందు.. పద్ధతి కొనసాగుతూ వచ్చింది. అలాగే అభ్యర్థుల శిబిరాల్లో భారీగా వంటావార్పులు కొనసాగుతూ వచ్చాయి. ఇక మండలాన్ని, పంచాయతీని టార్గెట్ గా చేసుకుని.. ఖర్చు విషయంలో కూడా పార్టీలు క్లారిటీకి వచ్చాయి.
ఇలాంటి క్రమంలో… ప్రచారం పరిసమాప్తం అయ్యే దశలో కట్టలు తెంచుకుంటున్నాయి. కేవలం డబ్బే కాదు.. బంగారాన్ని కూడా గట్టిగానే ఎర వేస్తున్నాయి పార్టీలు అనే మాట వినిపిస్తోంది. మునుగోడులో ఓటున్న వారు చెబుతున్న మాట.. తమ వద్ద ఒక్కో ఇంటికి తులం బంగారం ఇస్తున్నారనేది. ఇంట్లో నాలుగైదు ఓట్లు ఉంటే.. పది గ్రాముల బంగారం కాయిన్ ఇస్తున్నారని వారు చెబుతూ ఉన్నారు. ఈ పంపకాలు బంగారంగా జరుగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో..ఒక చోట ఇచ్చి, మరో చోట ఇవ్వకపోవడం వల్ల కూడా నిరసనలు మొదలవుతున్నాయి.
ఎమ్మెల్యేను ఎలాగైనా గెలిపించుకోవాలనే తపనతో ఉన్న పార్టీ ఇంటికో తులం బంగారాన్ని పంచుతోందని సమాచారం. అయితే ఒక పార్టీనే పెద్దగా నిందించి ప్రయోజనం లేకపోవచ్చు. రెండు ప్రధాన పార్టీలు భారీ ఎత్తున బహుమానాలు పంచుతున్నాయనే మాట గట్టిగా వినిపిస్తూ ఉంది. స్థానికంగా కూడా ఇరు పార్టీలూ ఒకరిని ఒకరు అడ్డుకునే ప్రయత్నాలు ఏమీ చేయకపోవడం గమనార్హం. పంచడంలో పోటాపోటీ పరిస్థితే ఉంది తప్ప… అడ్డుకోవాలనే ఆరాటం ఎక్కడా లేదు!