తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి వస్తుందని సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి జోస్యం చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, ప్రస్తుతానికి సాగినప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం మారితే కెసిఆర్ ఆయన మంత్రులు కూడా జైలుకు వెళ్లక తప్పదని ఆయన అంటున్నారు.
తెలంగాణ రాజకీయాలలో ఒకప్పుడు చాలా బలమైన నేతల్లో ఒకరైన నాగం జనార్దన్ రెడ్డి ప్రస్తుతానికి ఏ పార్టీలో ఉన్నారు అన్నది కూడా చాలామందికి సందేహమే. తెలుగుదేశంలో ఉండగా చక్రంతిప్పుతూ ఉన్న నాయకుడు.. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందని గుర్తించి, తెలుగుదేశానికి భవిష్యత్తు ఉండదని ముందే గమనించి, సొంత కుంపటి పెట్టుకున్నారు. అయితే ఆయన స్థాపించిన సొంత పార్టీ ఏమాత్రం సఫలం కాలేదు.
ఆ తర్వాత రాజకీయ మనుగడ కోసం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇప్పుడంటే భారతీయ జనతా పార్టీ అన్నిపార్టీల నాయకులను అదేపనిగా ఫిరాయింప చేసి తనలో కలిపేసుకుంటుంది కానీ.. అప్పట్లో అందులోకి వెళ్లి నాగంకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. పొమ్మనకుండా పొగ పెట్టినట్లు ఆయన పరిస్థితి తయారైంది. కొన్నాళ్లపాటు అదే పార్టీలో కొనసాగిన నాగం జనార్దన్ రెడ్డి.. చివరకు బయటకు వచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు.
ఇన్నాళ్లకు మళ్లీ ఆయన మీడియా ముందుకు వచ్చి కెసిఆర్ మీద విమర్శనాస్త్రాలు సంధించడం విశేషం. అవినీతికి పాల్పడినందుకు గాను ముఖ్యమంత్రి మంత్రులు, వారికి సహకరించిన అధికారులు అందరూ కూడా.. కొత్త ప్రభుత్వం వచ్చాక జైలుకు వెళ్తారని ఆయన జోస్యం. అయితే కొత్తగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఎప్పటికి వస్తుంది? అనే విషయంలో నాగం జోస్యం చెప్పగల స్థితిలో ఉన్నారో లేదో మరి!!