ఆంధ్ర రాజధాని మారుతుందేమోనన్న వార్తలు రాగానే టిడిపి నాయకులు ఆందోళన చెందడం, ఆందోళనలు చేయడం సహజం. కానీ బిజెపి నాయకులు కూడా దీనిపై విపరీతంగా స్పందించడం వింతగా ఉంది. భూములిచ్చిన రైతులకు అన్యాయం జరిగిందంటూ, వారి పక్షాన పోట్లాడతామంటూ చాలా హడావుడి చేస్తున్నారు. ఇంత రియాక్షన్ అవసరమా? అనిపిస్తోంది.
మొదటగా చెప్పుకోవలసినది – రాజధాని మారుస్తామని ముఖ్యమంత్రి యింకా చెప్పలేదు. కాబినెట్ తీర్మానం చేయలేదు. 'ప్రమాదం, వ్యయం దృష్ట్యా రాజధానిపై ఆలోచిస్తున్నాం' అని ఓ మంత్రి బొత్స అన్నారు. తర్వాత ఎంత రొక్కించినా ఆ మాట దాటి వెళ్లలేదు. విదేశీ పర్యటన నుంచి వెనక్కి వచ్చాక కూడా జగన్ నోరు విప్పలేదు.
ఈ లోపునే రాజధాని మార్చేసినట్లు నిరసన కార్యక్రమాలు అనవసరం. ఆ మార్పు ప్రకటన రేపోమాపో వచ్చిందనే అనుకుందాం. అయితే దాని వలన నష్టపోయేదెవరు? పెట్టుబడిదారులా? భూమి నిచ్చిన రైతులా?
అమరావతి రాజధాని అయినా కాకపోయినా బాబు వూరించిన ప్రాభవమైతే ఉండబోదని మూడేళ్ల క్రితమే తెలిసిపోయింది. ఇప్పుడు హంగు చేస్తున్న బిజెపి వాళ్లు రాజధాని కోసం నిధులు ఏం తెచ్చారు? కొత్త రాష్ట్రానికి రాజధాని అమర్చే బాధ్యత రాష్ట్రాన్ని చీల్చిన కేంద్రానిదే!
'దిల్లీని మించిన రాజధాని..' వగైరాలు ఎన్నికల ప్రచారపు మాటలుగా (అమిత్ షా పరిభాషలో 'జుగాడ్ బాత్') కొట్టి పారేసినా, ఒక డీసెంటు రాజధానికైనా డబ్బులివ్వాలి. ఇచ్చారా? లేదే! ఏమైనా అంటే డిపిఆర్ (డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) లేనిదే ఏమిస్తాం? అన్నారు. బాబు గారు గ్రాఫిక్స్‌లో మునిగి తేలుతూ అలాటి ప్రాథమిక విషయాలు పట్టించుకోలేదు. నిధులిచ్చిన సందర్భాల్లో యుసి (యుటిలిటీ సర్టిఫికెట్లు) యివ్వలేదని కేంద్రం చెప్పుకుంది. ఇచ్చాం అని రాష్ట్రం చెప్పుకుంది.
ఏది ఏమైనా మోదీ పిడికెడు మట్టి, పిడతెడు నీళ్లు యిచ్చి సింబాలిక్‌గా నోట్లో మట్టి కొట్టి, ఆశలపై నీళ్లు చల్లారు. ఏ హామీ లేదు. ఇదేమిటి మీరు మీ పార్టీ వాళ్లతో చెప్పి యిప్పించరా? అని రాష్ట్ర బిజెపి నాయకులను అడిగితే, 'ఇల్లు కట్టుకుంటామంటే డబ్బులిస్తారు కానీ, రాజమహళ్లు కడతామంటే ఎవరిస్తారు? వీళ్ల కిస్తే మరొకళ్లూ అడుగుతారు.' అని సన్నాయినొక్కులు నొక్కారు. సంసారపక్షంగా రాజధాని ప్లాను చేసి వుంటే కాసులేమైనా రాలేవోమో కానీ, బాబు గాలి మేడలు దిగి రాలేదు.
చేతిలో రొక్కం లేకపోయినా, తెచ్చుకునే సాధనం లేకపోయినా, కట్టిందేమీ లేకపోయినా, సింగపూరు జపాన్ డాబు కబుర్లు చెపుతూ రైతులను మభ్యపెడుతూ, మోసగిస్తూ వచ్చారు. రెండు, మూడేళ్లు పోయేసరికి 'ఇది మనవలన అయ్యే పనిలా లేదు, బిజెపి సహకరించటం లేదు, మీలో ఎవరైనా వెనక్కి యిచ్చేయమంటే భూములిచ్చేస్తాను' అని ప్రకటించి ఉంటే యింత నింద మోయవలసిన పని ఉండేది కాదు.
కానీ దానికి ఆయన అహం అడ్డు వచ్చింది. చివరి నిమిషం దాకా రైతులకు అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. విదేశీయులు యిక్కడ తమ పెట్టుబడితో బోల్డుబోల్డు కట్టేసి, భూముల రేట్లు పెంచేస్తారు, మీరంతా కాలు మీద కాలేసుకుని కూర్చుంటే మీ భూమి విలువ దానంతట అదే వెయ్యి రెట్లు పెరుగుతుంది అని ఊహల్లో తేల్చారు. వారి కలలు భగ్నం కావడానికి కారణం బాబే తప్ప, జగన్ కాదు.
జగన్ మొదటి నుంచీ అమరావతి పట్ల నిరాసక్తంగానే ఉన్నారని అందరికీ తెలుసు. ఆయన తన మానిఫెస్టోలో అమరావతిని స్వర్గతుల్యం చేస్తానని హామీ ఏమీ యివ్వలేదు. అందువలన రైతులకు కోపం ఉంటేగింటే బాబుపైనే ఉండాలి తప్ప జగన్‌పై కాదు. తమ భూములకు రేటు పెరగకుండా, ఊరికే అట్టే పెట్టుకునే బదులు, వెనక్కి యిచ్చేస్తేనే మెరుగు అని వాళ్లు అనుకోవడంలో అసంగతమేమీ లేదు.
మహా అయితే వాళ్లు రాజధాని యిక్కడే ఉండాలి అని అడగగలరు. సరే, రాజధాని యిదే అంటూ ఉన్న ఆ నాలుగు బిల్డింగులకూ తోడు మరో నాలుగు కట్టి అంతటితో సరిపెట్టారనుకోండి. వీళ్లకేమైనా లాభమా? అలాటి రాజధాని యిక్కడున్నా, మరో చోటికి పోయినా వీళ్లకు వచ్చే నష్టమేమీ లేదు. అమరావతిని బాబు చెప్పినంత స్థాయిలో కడితే తప్ప వాళ్ల ఆశలు నెరవేరవు. అది అసంభవమని బిజెపి వాళ్లు చెపుతూ వచ్చారు. చేతల్లో చూపించారు కూడా. ఇక రైతులు వాళ్ల నెందుకు నమ్ముకుంటారు? బిజెపి వారికి రైతులపై నిజంగా అక్కర వుంటే, కేంద్రానికి చెప్పి నిధుల వర్షం కురిపించి, అక్కడే రాజధాని కట్టి తీరాలని రాష్ట్రానికి చెప్పించాలి. అది లేకుండా వూరికే గొడవ చేస్తున్నారంటే ఆందోళన చేస్తున్న నాయకుల చిత్తశుద్ధిని శంకించాల్సి వుంటుంది.
ఇంతకీ జగన్ ఉద్దేశం ఏమిటి? అమరావతి నుంచి రాజధానిని మార్చం అని ఎన్నికల ముందు అన్నాడు. అక్కడే తన యిల్లు కట్టుకున్నాడు, పార్టీ ఆఫీసు పెట్టాడు. వరదలొచ్చో, భూకంపాలొచ్చో కొంపులు కూలితే నష్టపోయేది జగనే కానీ బాబు కాదు. ఆయనది అద్దె యిల్లు మాత్రమే. ఇప్పుడు పదవిలోకి వచ్చాక జగన్ ఏమనుకుంటున్నారు? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన దాని ప్రకారమైతే 'జగన్ అమరావతి గురించి పెద్దగా పట్టించుకోక పోవచ్చు, వికేంద్రీకరణకు ప్రాధాన్యం యిస్తానని చెబుతున్నారు' అని జగన్ తన అనుచరులతో చెప్పారట.
వికేంద్రీకరణ మంచిదని మేధావులు, పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తలు అందరూ చెప్తూ వచ్చారు. అన్నీ ఒకే చోట కేంద్రీకరించడం రాజకీయంగా ఎంత నష్టదాయకమో హైదరాబాదు చెప్పింది. జగన్ నిజంగా వికేంద్రీకరణకు కట్టుబడితే అంతకంటె కావాల్సినది ఏముంది? అప్పుడు రాజధాని యిక్కడ ఉన్నా, మరో చోట ఉన్నా ఏ యిబ్బందీ లేదు.
ఆ మాటకొస్తే ఓ లాభం కూడా ఉంది. అమరావతి నిర్మాణంలో రూ.4922 కోట్ల ఖర్చులో రూ.2066 కోట్లు తాము ఋణంగా యిస్తామని ప్రపంచ బ్యాంకు, ఎఐఐబి (ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్) జమిలిగా కమిట్ అయ్యాయి. అయితే భూసేకరణలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన ప్రపంచ బ్యాంకు అక్కడైతే ఋణం యివ్వం అని వెనక్కి వెళ్లింది. ఎఐఐబి మాత్రం ఇంకా ఏమీ చెప్పలేదు. అమరావతి కాకుండా వేరే చోట, ఏ ప్రభుత్వ భూముల్లోనో రాజధాని పెడితే రాష్ట్రప్రభుత్వం ఋణసౌకర్యం కోసం యీ సంస్థలకు తాజాగా దరఖాస్తు పెట్టుకోవచ్చు.
అయితే అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అంతటితో ఆగకుండా దాన్ని సింగపూరులా మహానగరంగా తీర్చిదిద్దాలని ప్రవచించేవారూ ఉన్నారు. రాజధాని మహానగరంగా ఉన్నపుడే అది బాగా అభివృద్ధి చెందుతుంది అంటూ మద్రాసు, కలకత్తా, ముంబయి, బెంగుళూరు, హైదరాబాదు.. యిలా లిస్టు చదువుతున్నారు. ఇదే అభివృద్ధి అనుకుంటే అంతకంటె పొరబాటు ఉండదు. ఈ మహానగరాలన్నీ మురికికూపాలుగా, నేరనిలయాలుగా మారిపోయాయి. నీటి కొరత, యిరుకు వీధులు, భరించలేని జీవనవ్యయం.. అధికారంలోకి ఎవరు వచ్చినా యీ నగరాలను నిర్వహించ లేకున్నారు. అమరావతి కూడా అలా కావాలని కోరుకోవడ మెందుకు? ఎందుకంటే వీళ్లు అక్కడ భూములు కొని వుంటారు. వాటి రేట్లు పెరగాలి. అందుకని యిలాటి వాదనలు చేస్తున్నారు.
అమరావతి నుంచి రాజధానిని మారిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావని కొందరి వాదన. పెట్టుబడి పెట్టేవాడికి కావలసినది, స్థానికంగా లభించే సహజ వనరులు, నైపుణ్యమున్న మానవ వనరులు, రవాణా సౌకర్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహం! రాష్ట్ర రాజధాని ఎక్కడుందా అని చూడరు వాళ్లు.
'రాజధాని వేరే చోటకి తరలిస్తే ఖర్చవుతుంది, యిక్కడైతే పైసా ఖర్చు లేకుండా బాబు 33 వేల ఎకరాలు సేకరించి పెట్టారు' అని కొందరి వాదన. 'పైసా ఖర్చు లేకుండా…' అనేది శుద్ధబద్ధం. ప్రతీ నెలా వాళ్లకు ప్రభుత్వం నుంచి కౌలు చెల్లిస్తున్నారు. అది కాకుండా బాబు వాళ్లకు ఎన్నో హామీ లిచ్చేశారు. మీ భూమికి ఎన్నో వందల రెట్లు వేల్యూ యాడ్ చేసి దానిలో మీకు భాగం యిస్తాం అని. ఆ కమిట్మెంట్కు విలువ కట్టనక్కరలేదా?
నిజానికి ఆ కమిట్మెంటే యిప్పుడు జగన్‌కు చిక్కులు తెస్తుంది. రైతులిచ్చిన భూమిని నిరుపయోగంగా ఉంచి, కౌలు మాత్రం చెల్లిస్తూ, భూమికి విలువ పెంచలేకపోతే అది ఖజానాపై భారమే కదా. దానికి తోడు రైతులు కోర్టుకి వెళ్లవచ్చు. కోర్టు ఏమంటుందో తెలియదు.
జంధ్యాల రవిశంకర్ చెప్పిన ప్రకారం భూములు తీసుకునేటప్పుడు రైతుల నుంచి ఏకపక్షంగా లెటర్స్ తీసుకున్నారు తప్ప ప్రభుత్వంతో కూడిన ద్వైపాక్షిక ఒప్పందం (బైపార్టయిట్ అగ్రిమెంట్) కాదట. మేమెక్కడ కమిట్ అయ్యాం? అని ప్రభుత్వం తప్పించుకుంటే మాత్రం రైతులు ఘోరంగా మోసపోయినట్లే. అలాటి మోసపూరితమైన బేరం నుంచి రైతులు ఎంత త్వరగా తప్పుకుంటే వాళ్లకు అంత మంచిది. ఈ ముక్క టిడిపి వాళ్లు వాళ్లకు చెప్పలేరు, అలాటి మోసం చేసినది వారే కాబట్టి!
అందువలన టిడిపి వాళ్లు 'వైసిపి రాజధాని మార్చేస్తోంది, మీరు తిరగబడండి' అని వాళ్ల దృష్టిని మరలిస్తున్నారు. ఇలా ఎంతకాలం చేయగలరో తెలియదు. రైతుల్లో ఎన్నో వంతు మంది టిడిపి, బిజెపి మాటలు చెవి కెక్కించుకుంటున్నారో తెలియదు. ఎందుకంటే అమరావతి భ్రమరావతిగా మారిన విషయం మీకూ, నాకూ కంటె అక్కడున్న వాళ్లకి బాగా తెలుసు. ఈ విషయం వైసిపి బాహాటంగా చెప్పలేదు.
'మేము రాజధాని యిక్కడే ఉంచినా మీరనుకునే స్కేలులో రేట్లు పెరగవు. అందువలన భూములు వెనక్కి తీసేసుకుని మా భారం, మా బాధ్యత తగ్గించండి.' అని చెప్పలేదు. చెపితే 'అధికార పార్టీ మారినా, ప్రభుత్వం అదే కాబట్టి, పాత ప్రభుత్వం యిచ్చిన హామీలు మీరు నెరవేర్చాల్సిందే' అని పట్టుబడతారేమో, కోర్టుకి వెళతారేమో అని భయం.
కాబట్టి ఏకంగా రాజధాని మార్చేస్తే వదిలిపోతుంది కదా! అప్పుడు రైతులు క్యూలు కట్టి భూములు వెనక్కి తీసేసుకుంటారు అనుకుంటూండవచ్చు. దానికి గాను వరద ముంపు భయం, అధిక వ్యయం వగైరా కారణాలు చెపుతున్నారు. వరద విషయాన్ని కౌంటర్ చేస్తూ 'వరద భయం లేదు, కితం సారి 2006లో వచ్చిందంతే, యిప్పట్లో మళ్లీ రాదు' అంటూ గ్రీన్ ట్రైబ్యునల్ 2017లో క్లియరెన్సు యిచ్చింది' అంటున్నారు కొందరు.
వాతావరణ శాఖ మర్నాడు వర్షం వస్తుందో రాదో చెప్పలేక పోతోంది, బంగాళాఖాతంలో తుపాను ఎక్కడ తీరం దాటుతుందో ఆఖరి రోజు దాకా సస్పెన్సే. మన దగ్గరే కాదు, ప్రపంచమంతా వాతావరణం అస్తవ్యస్తమై పోయింది. అంటార్కిటికాలో కూడా ఉక్క పోసే పరిస్థితి దాపురించింది. ఇలాటి స్థితిలో యీ నదీతీరానికి వందేళ్ల దాకా వరద భయం లేదు అని గ్రీన్ ట్రైబ్యునల్ హామీ యివ్వగలిగిందంటే దానికి దివ్యదృష్టి ఉన్నట్లే లెక్క.
పైగా వరద వచ్చినా రాజధాని ప్రాంతం మునగదు అని చెప్పిందట. అంటే ప్రభుత్వ కార్యాలయాలున్న ఏరియా సేఫన్నమాట. రాజధాని విస్తరించాక, చుట్టూ జనావాసాలు ఏర్పడతాయి. వాళ్ల యిళ్లు మునిగినా ఫర్వాలేదా? అమరావతిలో భూకంపభయం కూడా ఉందని, బహుళ అంతస్తుల భవంతులు కట్టకూడదని చదివినట్లు గుర్తు. దాని మాటేమిటో? ప్రభుత్వం తలచుకుంటే ఓ ప్రభుత్వాదేశం ద్వారా మినహాయింపు యిచ్చేయగలదు. భూకంపం వచ్చి ఫ్లాట్లు కుప్పకూలితే వచ్చి సంతాపం ప్రకటించవచ్చు.
అడుసు తొక్కనేల? కాలు కడగనేల? అని సామెత. రిస్కు ఉన్నచోట కట్టడం దేనికి అని అడిగితే వీళ్లకు బోల్డు కోపం వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోను రాజధాని తరలించడానికి వీల్లేదు అని హుంకరిస్తున్నారు. బొత్సా చెప్పిన అధిక నిర్మాణ వ్యయం వాదనను ఖండించటం లేదెందుకో! దానికీ ఏ ఎల్ అండ్ టి వాళ్ల దగ్గర్నుంచో సర్టిఫికెట్టు పట్టుకు వస్తారేమో!
టిడిపి, బిజెపి నాయకుల వాదనను తిప్పికొట్టడానికి వైసిపి ఉపయోగిస్తున్న అస్త్రం – వీళ్లందరికీ అక్కడ ఆస్తులున్నాయి కాబట్టి వెస్టెడ్ ఇంట్రస్ట్‌తో అడ్డుకుంటున్నారు అని. దానికి గాను ఎవరికి ఎంత ఉందో జాబితాలు వల్లిస్తున్నారు. బంధుమిత్రుల పేర్ల వున్నవి మావంటే ఎలా? అంటారు వీళ్లు. ఎవరు బినామీయో, ఎవరు కాదో తేల్చడం అంత సులభమైన పని కాదు. ఏదో కారు డ్రైవరు, ఆఫీసు ప్యూను పేర ఖరీదైన ఆస్తులుంటే ఎత్తి చూపవచ్చు కానీ అన్న కొడుకు, తమ్ముడి కూతురు అంటే అంత సులభంగా కుదరదు. వాళ్ల ఆదాయం ఎంత? ఇది కొనడానికి వాళ్లకు నిధులు ఎక్కణ్నుంచి వచ్చాయి.. యిలాటివన్నీ కూపీ లాగాలంటే ఆదాయపన్ను శాఖ సాయం తీసుకోవాలి. అది కేంద్రంలో ఉన్న బిజెపి చేతిలో ఉంది. ఫలానా వారిదంట అని ఆ భూములకు అటూయిటూ ఉన్న వాళ్లు చెప్పిన మాటలు పట్టుకుని కోర్టు కెళితే కేసు నిలవదు.
అయినా ఏమని కేసులు పెడతారు? వైసిపి వాళ్లు 'ఇన్సైడర్ ట్రేడింగ్' అని పదం తెగ వాడుతున్నారు. అది కంపెనీలకు వర్తిస్తుంది తప్ప ప్రభుత్వ నిర్ణయాలకు కాదు. ఆ విషయంగా కేసులు పెట్టగలిగితే చంద్రబాబు సన్నిహితులపౖౖె దశాబ్దాల క్రితమే కేసులు పెట్టేవారు. హైటెక్ సిటీ చుట్టూ వాళ్ల భూములే కదా! ఏం చేయగలిగారు? మాకు ఏ సమాచారమూ లేదు, కేవలం బుద్ధికుశలతతో, జ్యోతిష్యపరిజ్ఞానంతో రాజధాని యిక్కడే వస్తుందని ఊహించి కొన్నాం అంటే కాదనగలరా?
ఆ మాట కొస్తే ఫోక్స్‌వ్యాగన్ ఉదంతంలో బొత్స చేసినదీ ఇన్సైడ్ ట్రేడింగ్ అనవచ్చుగా! 2005లో వైయస్ ముఖ్యమంత్రిగా ఉండగా ఫోక్స్‌వ్యాగన్ ప్రతినిథి హెల్మట్ షూస్టర్ అనే అతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించాడు. తమ కంపెనీ వైజాగ్‌లో ఫ్యాక్టరీ పెడుతుందని నమ్మించి, తను పెట్టిన ఓ బోగస్ కంపెనీకి ప్రభుత్వం చేత రూ.11 కోట్లు పెట్టుబడి పెట్టించాడు. తర్వాత చూస్తే అసలు కంపెనీ వాళ్లు మాకేమీ సంబంధం లేదు పొమ్మన్నారు. వైయస్ ఆ మోసాన్ని సిబిఐకు అప్పగించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న బొత్సను ఆ శాఖ నుంచి తప్పించారు. సిబిఐ కోర్టులో కేసు యింకా నడుస్తూనే ఉంది.
ఇంతకీ దీనిలో జరిగిన తమాషా ఏమిటంటే – కార్ల ఫ్యాక్టరీ వైజాగ్‌లో పెడుతున్నారని బొత్సకు తెలుసు. ఆ స్థలానికి దగ్గరలోనే బొత్స బంధువులు పెద్ద ఎత్తున స్థలాలు కొన్నారని ఆరోపణలు వచ్చాయి. ఫోక్స్‌వ్యాగన్‌కు యివ్వజూపిన స్థలాన్ని మార్చడం వెనుక, ప్రతిపాదిత కేటాయింపును 150 ఎకరాల నుంచి 350 ఎకరాలకు పెంచడం వెనుక గల కారణాల మీద కూడా సిబిఐతో సమగ్రంగా దర్యాప్తు చేయించాలని అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. కానీ కోర్టుకి వెళ్లినట్లు లేదు. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినా ఆ విషయంపై కేసు నడపలేదు. ఎందుకంటే యివన్నీ చట్టానికి దొరకని మోసాలు.
రాజధాని ప్రకటన తర్వాత చుట్టూ ఉన్న భూములను కొన్నవారిలో అన్ని కులాల వారు, ప్రాంతాల వారు ఉండవచ్చు. వాళ్లు నష్టపోతే పోతారు. ఎందుకంటే యిది రియల్ ఎస్టేటు జూదం. ఇక 33 వేల ఎకరాలు యిచ్చిన రైతుల విషయంలోనే ఆవేదన ఉంది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంచనా ప్రకారం వారిలో అత్యధికులు కమ్మవారు. వాళ్ల భూములు వాళ్లకు తిరిగి యిచ్చేస్తాననడం ద్వారా వాళ్లకు న్యాయం చేసినట్లవుతుంది తప్ప కక్ష సాధించినట్లు కాదు. వాళ్ల భూములకు విలువ పెంచకుండా, (పెంచడం ఎవరి తరమూ కాదని యిప్పటికే తేలిపోయింది) కౌలు డబ్బులు యివ్వకుండా సతాయిస్తే అన్యాయం చేసినట్లవుతుంది. భూములు తిరిగి యిచ్చేటప్పుడు నష్టపరిహారంగా కొంత చేర్చి యిస్తే సరైన న్యాయం చేసినట్లవుతుంది. ఇలా తిరిగి యివ్వడం సాధ్యమౌనో కాదో ప్రభుత్వం ఆ భూములపై శ్వేతపత్రం విడుదల చేసినప్పుడే తెలుస్తుంది.
టిడిపి వారికి, బిజెపి వారికి నిజంగా రైతుల పట్ల అక్కర ఉంటే వారు యిలాటి డిమాండ్ చేయాలి తప్ప రాజధాని మార్చకూడదని ఆందోళన చేయడంలో అర్థం లేదు. టిడిపి వారు అలా చేస్తారనుకోలేము కానీ బిజెపి వారు చేయవచ్చు. ఎందుకంటే ఆడంబరాలు వద్దని వాళ్లు ముందు నుంచీ అంటూ వచ్చారు. నిధులూ విడుదల చేయలేదు. అయితే దానికి బదులుగా కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి వంటి వాళ్లు భూముల గురించి యింత కలవరపడడం అనుమానాలకు దారి తీస్తోంది.
2014లో బాబు తనకు కావలసిన వాళ్లను బిజెపిలోకి పంపించి, దాన్ని తన 'బి' టీముగా చేసుకున్నారనే ఆరోపణలో వాస్తవముందనిపిస్తోంది. ఇప్పుడు 2019లో కూడా లోపాయికారీ ఒప్పందంతోనే నలుగురు ఎంపీలను బిజెపిలోకి పంపారన్న మాటా నిజమే ననిపిస్తోంది. సుజనా దేహం బిజెపికి మారినా ఆత్మ మాత్రం టిడిపిదేనని తెలుస్తూనే ఉంది. ఇవన్నీ బిజెపి అధిష్టానానికి తెలియకుండా జరుగుతున్నాయని అనుకోవడానికి వీలు లేదు. వైసిపిని యిరుకున పెట్టడానికి యిదో వ్యూహం అనుకోవాలంతే!
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2019)
[email protected]