జనసేనాని కామెడీ: మోడీ వద్ద అమరావతి పంచాయితీ.?

రాజధాని అమరావతిపై ప్రధాని నరేంద్ర మోడీ వద్ద పంచాయితీ పెడతానంటున్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ఇటీవలే బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరైన జీవీఎల్‌ నరసింహారావు, రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమనీ,…

రాజధాని అమరావతిపై ప్రధాని నరేంద్ర మోడీ వద్ద పంచాయితీ పెడతానంటున్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ఇటీవలే బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరైన జీవీఎల్‌ నరసింహారావు, రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమనీ, తనకు తెలిసినంతవరకు రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చే ఆలోచనలో వుందనీ ప్రకటించిన విషయం విదితమే. 

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారికంగా ఇప్పటిదాకా అమరావతిని మార్చుతామనే మాట ఎక్కడా చెప్పలేదు. కానీ, మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవలి కృష్ణా వరదల నేపథ్యంలో రాజధాని ప్రాంతానికి ముంపు ముప్పు తలెత్తిన విషయాన్ని మాత్రం ప్రస్తావించారు. అంతే, రచ్చ షురూ అయ్యింది. తెలుగుదేశం పార్టీతోపాటు బీజేపీ సైతం 'తగుదునమ్మా..' అంటూ రాజధాని పేరుతో బీభత్సమైన పొలిటికల్‌ స్టంట్‌ మొదలు పెట్టింది. తాను మాట్లాడకపోతే ఎవరేమనుకుంటారోనని, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కూడా రంగంలోకి దిగేశారు, రాజధానిలో పర్యటించేశారు. 

'అవసరమైతే ప్రధాని వద్దకు వెళ్ళి రాజధాని విషయమై ఫిర్యాదు చేస్తాం..' అని సెలవిచ్చారు పవన్‌ కళ్యాణ్‌. కొన్నాళ్ళ క్రితం ప్రత్యేక హోదా విషయంలో పవన్‌ కళ్యాణ్‌ ఇవే వ్యాఖ్యలు చేశారు. అప్పటినుంచి ఇప్పటిదాకా కేంద్రాన్ని పవన్‌ కళ్యాణ్‌ గట్టిగా ప్రశ్నించింది లేదు. ప్రత్యేక హోదా కోసం జాతీయ స్థాయిలో పార్టీల మద్దతు కూడగడ్తామన్నారు, ఆ తర్వాత సైలెంటయిపోయారు. 

టైమ్‌ పాస్‌ పొలిటీషియన్‌గా ఆల్రెడీ పవన్‌ కళ్యాణ్‌ తెలుగు నాట రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేసుకున్నారు. అది చాలదన్నట్టు, వీలు చిక్కినప్పుడల్లా ఈ పొలిటికల్‌ కామెడీలేంటి.? సినీ నటుడిగా తనకున్న గ్లామర్‌ని.. ఇదిగో ఇలాంటి సిల్లీ పబ్లిసిటీ స్టంట్స్‌కి వాడుకోవడం అభిమానులు సైతం హర్షించలేని పరిస్థితి. రాష్ట్ర పరిధిలోని రాజధాని అంశంపై కేంద్రం వద్ద పంచాయితీ పెడతాననడంలోనే పవన్‌ కళ్యాణ్‌, తన అజ్ఞానాన్ని చాటుకున్నారన్నది సర్వత్రా వ్యక్తమవుతోన్న అభిప్రాయం.