ఓట‌ర్లు…బంగార‌మే!

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ ఓట‌ర్లు తెలివిమీరారు. ఓటుకు నోటు తీసుకునే కాలం నుంచి బంగారు కావాల‌ని డిమాండ్ చేసే ప‌రిస్థితికి ఎన్నిక‌ల‌ను దిగ‌జార్చారు. ఓట‌ర్ల‌ను దేవుళ్ల‌తో పోల్చ‌డం చూశాం. దేవుళ్ల సంగ‌తేమో గానీ, మునుగోడు ఓట‌ర్లు…

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ ఓట‌ర్లు తెలివిమీరారు. ఓటుకు నోటు తీసుకునే కాలం నుంచి బంగారు కావాల‌ని డిమాండ్ చేసే ప‌రిస్థితికి ఎన్నిక‌ల‌ను దిగ‌జార్చారు. ఓట‌ర్ల‌ను దేవుళ్ల‌తో పోల్చ‌డం చూశాం. దేవుళ్ల సంగ‌తేమో గానీ, మునుగోడు ఓట‌ర్లు మాత్రం బంగార‌మ‌ని చెప్పొచ్చు.  

మునుగోడు ఉప ఎన్నిక‌ను టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్యే పోరు న‌డుస్తోంది. వచ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై మునుగోడు ఉప ఎన్నిక ఫ‌లితం తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. దీంతో ఉప ఎన్నిక‌లో గెలుపు కోసం టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ద్యం ఏరులై పారిస్తాయ‌ని, అలాగే విచ్చ‌ల‌విడిగా డ‌బ్బు ఖ‌ర్చు చేస్తాయ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జరిగింది.

దీంతో ఓట‌ర్ల‌లో ఆశ‌లు పెరిగాయి. రాజ‌కీయ నేత‌ల్ని పిండుకునేందుకు ఇదే త‌గిన స‌మ‌యం అని ఓట‌ర్లు ఎదురు చూడ‌సాగారు. ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. ఎన్నిక‌ల‌కు ఒక‌ట్రెండు రోజుల ముందు డ‌బ్బు పంపిణీకి రాజ‌కీయ ప‌క్షాలు శ్రీ‌కారం చుట్టాయి. టీఆర్ఎస్‌, బీజేపీలు ఓటుకు రూ.3 వేలు చొప్పున పంపిణీ చేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. అయితే కొన్ని చోట్లు ఓట‌ర్లు రివ‌ర్స్ అయ్యార‌ని వార్త‌లొస్తున్నాయి.

మునుగోడు మండ‌లం కొర‌టిక‌ల్ గ్రామంలో ఓటుకు రూ.3 వేలు ఇచ్చినా జ‌నం ఒప్పుకోలేదు. త‌మ‌కు తులం బంగారం కావాలంటూ డిమాండ్ చేయ‌డంతో పాటు నిర‌స‌న‌కు దిగ‌డం గ‌మ‌నార్హం. దీంతో రాజ‌కీయ నేతలు ఖంగుతిన్నారు. ఇదెక్క‌డి గొడ‌వ‌రా నాయ‌నా అంటూ త‌ల‌లు ప‌ట్టుకున్నారు. ఓటుకు రూ.3 వేలు తీసుకునే కాలం పోయింద‌ని వారు చెప్ప‌డం విశేషం. ఓట‌ర్ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేస్తూ, ఎప్ప‌టిక‌ప్పుడు ప‌బ్బం గ‌డుపుకుంటున్న నేత‌ల‌కు ఓట‌ర్లు ఈ విధంగా షాక్ ఇస్తున్నార‌న్న మాట‌!