విలక్షణ నటుడు మోహన్‌బాబు వ్యాఖ్యలపై కాస్త ఆలస్యంగా మెగా బ్రదర్ నాగబాబు సీరియస్ అయ్యారు. దీనంతటికి ‘మా’ ఎన్నికలే కారణం కావడం గమనార్హం. ‘మా’ ఎన్నికల పుణ్యమా అని టాలీవుడ్‌లో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బండ్ల గణేష్, జీవితా రాజశేఖర్ మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా నాగబాబు స్పందన చర్చకు దారి తీసింది. ఇటీవల ఆన్‌లైన్‌లో ‘మా’ నిర్వహించిన సమావేశంలో మోహన్‌బాబు మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘మా’ అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎక్కువ ధరకు అసోసియేషన్ బిల్డింగ్ కొని అతి తక్కువ ధరకు అమ్మేశారంటూ మోహన్‌బాబు తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలపై తాజాగా నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేస్తే తీవ్రంగా స్పందిస్తానని ఆయన హెచ్చరించారు. బిల్డింగ్ అమ్మకం వ్యవహరం అంతా నరేశ్-శివాజీరాజాలకే తెలుసని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా భవనం అమ్మకంపై నరేశ్‌నే ప్రశ్నించాలని నాగబాబు హితవు పలికారు. నరేశ్ ప్రస్తుతం ‘మా’ అధ్యక్షుడిగానూ, అలాగే శివాజీరాజా అంతకు ముందు అధ్యక్షుడిగా కొనసాగారు.
అయితే మోహన్‌బాబు ఆరోపణలపై నాగబాబు భుజాలెందుకు తడుముకుంటున్నారని మోహన్‌బాబు అనుచరులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ‘మా’ అధ్యక్ష బరిలో మోహన్‌బాబు తనయుడు మంచు విష్ణు నిలవనున్నారు. ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు నాగబాబు మద్దతు ప్రకటించారు. దీంతో వైరి వర్గాలుగా విడిపోయి పరస్పరం విమర్శలు చేసుకోవడం చర్చకు దారి తీసింది.