అయినదానికి కానిదానికి న్యాయస్ధానాల్ని ఆశ్రయించడం అమరావతి పాదయాత్రికులకు పరిపాటిగా మారింది. ఏపీ హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో రెండో దశ పాదయాత్ర చేపట్టడం అంటే… ముమ్మాటికీ ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులను రెచ్చగొట్టేందుకే అని చెప్పక తప్పదు. మీ ప్రాంతాలకు హైకోర్టు, పరిపాలన రాజధానులు వద్దంటూ పాదయాత్రగా వెళ్లడం అంటే… దండయాత్ర కాక మరేంటి?
హైకోర్టు తీర్పు నేపథ్యంలో మరోసారి రెండో దశ పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. అయితే అమరావతి జేఏసీ నేతలు గమనించాల్సిన అంశం ఒకటుంది. హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులోనో అనుకూల తీర్పులు సాధించుకుని సంబరపడొచ్చు. కానీ రాజధానిపై ప్రజాకోర్టులో విజయం సాధిస్తేనే, వారి ఆకాంక్షలు, ఆశయాలకు అర్థంపరమార్థం వుంటుందని గ్రహించాలి. లేదంటే రాష్ట్రం కుక్కలు చించిన విస్తరికాక తప్పదని గుర్తించుకోవాలి.
తమకు మాత్రమే న్యాయం జరిగితే సరిపోతుందా? మరి మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి? రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు దశాబ్దాల తరబడి చుక్క సాగునీటికి నోచుకోక కరవుకాటకాలతో అల్లాడుతున్నాయి. బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలు, దేశంలోని సుదూర ప్రాంతాలకు వలస వెళుతున్న దయనీయ పరిస్థితుల గురించి తెలియదా? అమరావతి రాజధానికి ఆ 29 గ్రామాలు మినహాయిస్తే, మిగిలిన ప్రాంతాల నుంచి ఎంత వరకు మద్దతు లభిస్తున్నదో ఒక్కసారి అమరావతి జేఏసీ నేతలు ఆలోచించాలి.
అలాగే అమరావతికి మద్దతు పలుకుతున్న వివిధ రాజకీయ పక్షాలు కూడా ఆ కోణంలో ఆలోచించాలి. ఎందుకంటే న్యాయస్థానాల్లో అనుకూల తీర్పులు సాధించి, తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్న అసంతృప్తి, ఆక్రోశం, ఆవేదన ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా జిల్లాల్లో గూడు కట్టుకుంది. ఇది ఇంతింతై అన్నట్టు పెరుగుతూ పోతే, మరో వేర్పాటువాద ఉద్యమాలకు దారి తీయవా?
అమరావతి జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ మహాపాదయాత్రను త్వరలో పునఃప్రారంభిస్తామన్నారు. అమరావతి రాజధానికి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు అండగా ఉండాలని కోరారు. ఆ ప్రాంతాల నుంచి మద్దతు లేదనే కదా అర్థం? అమరావతి రాజధాని అంటే న్యాయస్థానాల్లో జయాపజయాలకు సంబంధించి వ్యవహారంగా చూడొద్దు. ప్రజల భావోద్వేగాలు, ఆత్మాభిమానం, హక్కులతో ముడిపడి వున్న అంశంగా చూడాలి.
కానీ అమరావతి రాజధాని విషయంలో పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ముడిపడి వుంది. అమరావతిలో వేలాది ఎకరాల భూమి సేకరణ, అందులో నాటి అధికార పార్టీ నేతలకు భారీగా వాటా, రాజధానిని అభివృద్ధి చేసుకుంటే ఆర్థికంగా వాటి విలువ అమాంతం పెరగడంపైన్నే దృష్టి, యావ తప్ప, మరొకటేమైనా అందులో దాగి వుందా?
అమరావతి రాజధాని పేరుతో వ్యాపారం చేయాలని అనుకున్నారు. పాలకులు మారడంతో వారి ప్రాధాన్యాలు మారాయి. దీంతో రాజధాని రియల్ ఎస్టేట్ సౌధం కుప్పకూలింది. ఈ నేపథ్యంలో రాజధాని పేరుతో అటూఇటూ పోరాటాలు ఊపందుకున్నాయి. మరోవైపు సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో వుంది. సుప్రీంకోర్టులో కూడా అమరావతి జేఏసీకే అనుకూల తీర్పు వచ్చిందని అనుకున్నాం. దీంతో రాష్ట్రం ప్రశాంతంగా వుంటుందని అనుకోవడం అజ్ఞానం అవుతుంది.
ఎందుకంటే అమరావతి జేఏసీ గెలవాల్సింది ప్రజాకోర్టులో. అందుకు విరుద్ధంగా ఏది జరిగినా … ఉత్తరాంధ్ర, రాయలసీమ ఆత్మాభిమానాల్ని తీవ్రంగా దెబ్బతీసినట్టే. గాయపడిన హృదయాలు, గాయపరిచిన కత్తులతో కలిసి సహజీవనం చేయలేవు. ఆ విషయాన్ని గుర్తించి ఇతర ప్రాంతాల మనోభావాలను గౌరవించేలా నడుచుకోవడమే ఉత్తమం.