స్కూలు పాఠం: ‘ఎ’ ఫర్ అర్జున, ‘బి’ ఫర్ బలరామ

స్కూల్లో సరస్వతీదేవి ప్రార్థన చేస్తే అది సెక్యులరిజానికి విరుద్ధమంటారు. “భారతమాత కి జై” అనడానికి కూడా దేశంలో పలువర్గాలు ఇబ్బందిపడిపోతుంటారు.  Advertisement హిందూ విద్యార్థులు పరమత ప్రార్థన చేస్తే అది సెక్యులరిజం. అదే పరమత…

స్కూల్లో సరస్వతీదేవి ప్రార్థన చేస్తే అది సెక్యులరిజానికి విరుద్ధమంటారు. “భారతమాత కి జై” అనడానికి కూడా దేశంలో పలువర్గాలు ఇబ్బందిపడిపోతుంటారు. 

హిందూ విద్యార్థులు పరమత ప్రార్థన చేస్తే అది సెక్యులరిజం. అదే పరమత విద్యార్థుల్ని హిందూ ప్రార్థన చేయమంటే అది కాషాయీకరణం. 

ఈ పరిస్థితులున్న దేశంలో ఒక విద్యాసంస్థ “ఎ” ఫర్ యాపిల్, “బి” ఫర్ బాల్ అని కాకుండా “ఎ” ఫర్ అర్జున, “బి” ఫర్ బలరామ అని పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. ఆ స్కూల్ లక్నోలో ఉంది. అది ప్రైవేట్ సంస్థ నడిపే హిందూ బడి కాదు. 1897లో స్థాపించగా ప్రస్తుతం మునిసిపల్ కార్పొరేషన్ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలే. 

ఇలా చేయడానికి ఎంత ఉత్సాహం కావాలి? ఎంత చొరవుండాలి?

ఇతొతిహాసాల మీద, పురాణాల మీద విద్యార్థులకి అవగాహన, ఆసక్తి పెరగాలంటే ఇదే మంచి పద్ధతని తాము అనుకుంటున్నట్టు ఆ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ సాహెబ్ లాల్ మిశ్రా అన్నారు. “సి” అంటే చాణక్య, “డి” అంటే ధృవ, “ఇ” అంటే ఏకలవ్య, “ఎఫ్” అంటే ఫోర్ వేదాస్ అని ఊరుకోకుండా ఆయా పదాల చరిత్ర కూడా బోధిస్తున్నారు. 

యూపీలో భాజపా సర్కారు ఉండడం, అక్కడ అత్యధిక సంఖ్యలో హిందూ ఓటర్స్ ఉండడం, పైగా బ్రాహ్మణ సంఖ్యాబలం కూడా అధికంగా ఉండడం ఒకెత్తైతే…రామాయణ, మహాభారతాలు పుట్టిందే ఆ రాష్ట్రంలో. 

కనుక తమ రాష్ట్రానికి చెందిన చరిత్రో, కథో చెబుతున్నామని కూడా చెప్పొచ్చు మతానికి సంబంధం లేకుండా. కానీ అదే పని భాజపా ప్రభుత్వమున్న ఇతర రాష్ట్రాలు చేయగలవా? ఏమో! ఓటర్లను బట్టే నిర్ణయాలు ఉండొచ్చు!

నిజానికి ముస్లిముల మదరసాల్లో ఇస్లాం మతానికి చెందిన విషయాలే బోధిస్తారు. అక్కడకు ముస్లిం విద్యార్థులే వెళ్తారు. వేదపాఠశాలల్లో సనాతనధర్మమే చెబుతారు. అక్కడికి హిందువులే వెళతారు. 

క్రైస్తవ మిషనరీ స్కూల్స్ లో మాత్రం అన్ని మతాల వాళ్లకు ఆహ్వానముంటుంది. కానీ అక్కడ మోరల్ సైన్స్ పేరుతో బైబుల్ కథలు చెప్పే బడులు కూడా ఉన్నాయి. సుమారు ముప్పై ఏళ్ల క్రితం వరకు ఈ పద్ధతి మరింత విరివిగా ఉండేది మిషనరీ స్కూల్స్ లో. కానీ దానిని మత ప్రచారంగా గుర్తించి అప్పటి పిల్లల తల్లిదండ్రులు గొడవకొచ్చేవారు కాదు. మోరల్ సైన్స్ సబ్జెక్ట్ మార్కుల్లో కలపేవారు కాబట్టి పెద్దగా పట్టించుకునేవారు కాదు. 

లాజికల్ గా ఆలోచిస్తే మెజారిటీ ప్రజల సంస్కృతి, భాష, గతచరిత్ర బడిలో పాఠాలుగా చెప్పుకోవాలి. కానీ సెక్యులరిజం పేరుతో ఆ ప్రక్రియని ముందుకు తీసుకువెళ్లలేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా హిందూత్వ వాదనకి బలం చేకూరడంతో సనాతనధర్మానికి చెందిన విషయాలను పాఠాల్లో పెట్టే ధైర్యం చేస్తున్నారు. ఇది నిజంగా శుభపరిణామం. దీనిని కాషాయీకరణ అనుకుంటే పొరపాటు. మరుగున పడిపోయి ఉన్న ఎంతో విజ్ఞాన సంపద సనాతన గ్రంథాల్లోనూ, ఇతిహాసాల్లోనూ ఉంది. వాటిని పాఠ్యభాగాల్లో పెట్టే అవసరం ఎంతైనా ఉంది. 

ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం..తమ రాష్ట్రానికి చెందిన అంశాలతో ప్రాధమిక స్థాయి పాఠ్యభాగాలు తయారు చేసుకోవచ్చు. 

ఉదాహరణకి ఆ.ప్ర లో అన్నమయ్య, క్షేత్రయ్య భక్తి సాహిత్యాన్ని, వేంకటేశ్వరస్వామి ఇతివృత్తాన్ని పాఠాలుగా పెట్టుకోవచ్చు. 

తెలంగాణాలో భక్తరామదాసు చరిత్ర, యాదాద్రి కథ పాఠాలుగా చెప్పుకోవచ్చు. 

తమిళనాడులో ఆళ్వారుల- నాయనార్ల కథలు, ముత్తైతరు కథలు పాఠాలుగా ముద్రించవచ్చు. 

కర్ణాటకలో మూకాంబిక కథ, గోకర్ణం ఇతివృత్తం మొదలైనవి పాఠాలుగా మలచుకోవచ్చు. 

కేరళలో అయ్యప్పకథని ఉపవాచకంగా చేసుకోవచ్చు. 

మధ్యప్రదేశులో కాళిదాసు కథ, ఉజ్జైనీ మహాకాళేశ్వరుడి కథ, సాందీపముని ఆశ్రమ విషయాలు పాఠాలవ్వచ్చు. 

గుజరాతులో ద్వారకాచరిత్ర, సోమానాథ దేవాలయ వైశిష్ట్యం పాఠం కావొచ్చు. 

ప్రతి రాష్ట్రంలోనూ శక్తిపీఠమో, జ్యోతిర్లింగమో, రామాయణ మహాభారత కథలకు సంబంధించిన విషయాలో ఉంటాయి. దేశమంతా సనాతనధర్మానికి చెందిన ఆనవాళ్లు, చరిత్ర ఉన్నాయి. అవన్నీ పాఠాల్లోకి చేరితే మరే మోరల్ సైన్స్ కథలూ అవసరం లేదు. రామాయణ, మహాభారతాలు పాఠ్యాంశాలైతే వ్యక్తిత్వ వికాస పాఠాలు విడిగా చెప్పుకోనక్కర్లేదు. ఆ రోజులొస్తాయేమో చూడాలి. 

– జలసూత్రం పినాకపాణి