జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రసంగంలో హైలెట్స్ మరీ చెప్పుకోవాల్సిన స్థాయిలో, కరోనా వేళ ప్రజలు 'హమ్మయ్యా..' అనుకునేంత స్థాయిలో కనిపించడం లేదు. ఇప్పటికే ఎంతో చేసేసినట్టుగా మోడీ చెప్పుకోవడమే ఇక్కడ విశేషమే. అయితే నవంబర్ వరకూ.. రేషన్ మాత్రం ఉచితంగా ఇస్తారట. రేషనేనా… అని పెదవి విరుస్తారేమో అని, మోడీజీ దాని విలువ కూడా చెప్పేశారు! 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అని, దాని విలువ 90 వేల కోట్లని లెక్కగట్టి వివరించారు. ఎంత గొప్ప పనో చూశారా.. అన్నట్టుగా ఉన్నాయి ఈ నంబర్లు!
ఆల్రెడీ దక్షిణాది రాష్ట్రాల్లో రేషన్ ను ఉచితంగా ఇస్తున్నట్టే ఉంది. కిలో రూపాయి బియ్యం వంటి పథకాలు ఇక్కడ అమల్లో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వైట్ రేషన్ కార్డు దారులకు మూడు నెలలుగా ఉచితంగానే రేషన్ ఇస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు మోడీ కాస్త లేటుగా ఈ స్కీమ్ ను ప్రకటించారు. నవంబర్ వరకూ ఉచిత రేషన్ అని ప్రకటించేశారు.
ఇక ఇప్పటి వరకూ చేసిన సాయం గురించి చెప్పుకోవడమే మోడీ తాజా ప్రసంగంలోని రెండో హైలెట్. గత మూడు నెలల్లో 31 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని పేదల ఖాతాలో జమ చేసినట్టుగా మోడీ ప్రకటించుకున్నారు. 20 కోట్ల మంది ఖాతాలోకి 31 వేల కోట్ల రూపాయలు వేశారట! ఈ పెద్ద నంబర్ వినడానికి బాగానే ఉంది కానీ, భాగిస్తే ఒక్కోరి ఖాతాలోకి దాదాపు అక్షరాలా 1,500 రూపాయలు వేశారు! మూడు నెలలకు 1,500, అంటే నెలకు ఐదొందలు! ఈ సాయం గురించి మోడీ ఘనంగా చెప్పుకున్నారనమాట! అది కూడా ఆ మధ్య జీరో బ్యాలెన్స్ తో జన్ ధన్ ఖాతాలిచ్చారే వారికే. ఐదొందల సాయం చేయడం, దాన్ని ప్రధానమంత్రి గారు చెప్పుకోవడం!
ఇక కరోనా అప్ డేట్స్ గురించి, నిర్లక్ష్యం వద్దని, జాగ్రత్తలు తీసుకోవాలని మోడీ వివరించారు. మొత్తానికి ఫ్రీ రేషన్ అంటే బహుశా బియ్యం ఉచితంగా ఇవ్వడం వంటి బృహత్తర వరాన్ని ప్రకటించి మోడీజీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.