టస్కనీలో ఒక ఏబీలో ఒక ఏబట్ వుండేవాడు. అతను మహాపండితుడు, పూజావిధానాలలో నిష్ణాతుడు కానీ అతనికి వున్న ఏకైక బలహీనత స్త్రీవ్యామోహం. అందమైన ఆడది కనబడితే అనుభవించకుండా వూరుకోలేడు. అతనా వూరికి కొత్తగా రాగానే వూళ్లో పరిచయమైన అనేకమందిలో ఒకడు – ఫెరోండో అనే డబ్బున్న మూర్ఖుడు. ఆ తెలివితక్కువవాడు ఏం వాగేవాడో ఎవరికీ తెలిసేది కాదు. అయినా ఏబట్ అతన్ని దగ్గరకు రానీయడానికి ఒకే కారణం – అతనికి ఒక అందమైన భార్య వుందని తెలియడమే!
ఆమె అందచందాలు ఎలా వున్నాయో చూడగోరి ఏబట్ ఫెరోండోతో 'నువ్వు ఒక్కడివే చర్చికి వస్తే సరిపోదు, నీ భార్యను కూడా తీసుకుని రా' అని పదేపదే చెప్పసాగాడు. ఓ రోజు ఆమె చర్చికి వచ్చింది. నిజంగానే అద్భుతసౌందర్యవతి. ఆమెను తన ప్రవచనాలతో ఏబట్ వూదరగొట్టడంతో ఆమె ముగ్ధురాలై పోయి మళ్లీ మళ్లీ చర్చికి వచ్చింది. ఒక రోజు కన్ఫెషన్ (పాపాల ఒప్పుకోలు) చేస్తానని అడిగింది.
ఏబట్ సరేనన్నాడు. కన్ఫెషన్‌లో ఆమె మనసు విప్పింది – ''ఫాదర్, నా జీవితం దుర్భరం. నా భర్త వట్టి మొద్దు. తెలివిలేనివాడు. అతనితో గంట గడపడమే కష్టం అనుకుంటే జీవితమంతా గడపడం మహా కష్టం. ఏదో యిన్నేళ్ల కాపురం వలన మాకు ఒక కొడుకు పుట్టాడు. కానీ మా మధ్య శృంగార కార్యకలాపాలేమీ జరగటం లేదు. నాకు అతనితో మాట్లాడడమే దుర్భరం. ఇక శయనించడం ఎలా? నేను భర్త వున్న వితంతువును అనుకోవడం సబబు. పోనీ ఎలాగోలా ఒకే కప్పు కింద అపరిచితుల్లా గడిపేద్దామా అంటే అదీ సాగటం లేదు. అతను మహా అనుమానపు మనిషి. అనుమానజాడ్యం వలన నేను ఎవరితో మాట్లాడినా అనుమానిస్తాడు. ఇరుగుపొరుగులతో చిరునవ్వు నవ్వినా సందేహమే. మీరు మతాధికారి కాబట్టి నన్ను ఒకత్తినీ రానిచ్చాడు కానీ లేకపోతే మా యింటికి ఎవర్నీ రానివ్వడు, పోనివ్వడు. నాకేం చెయ్యాలో పాలుపోవటం లేదు. ఇలా బతికి ప్రయోజనం ఏముంది?'' అని మొత్తుకుంది.
''బిడ్డా, నీ కష్టాలకు మూలం, నీ భర్తకు బుద్ధి వికసించకపోవడం. దానికి మందు లేదు. కానీ అతనికున్న అసూయారోగానికి మందు వుంది. అతన్ని నరకానికి పంపి ఆ రోగం కుదిరిస్తే బాగుపడతాడు. అప్పుడు నీ కష్టాలు కొంతమేరకు గట్టెక్కుతాయి.'' అన్నాడు ఏబట్.
''జీవించి వుండగా మనిషి నరకానికి ఎలా వెళతాడు?''
''నా వంటి పూజారి పర్యవేక్షణలో సరైన క్రతువు జరిపిస్తే అతని దోషగుణమంతా క్షాళన జరిగి దేవుడు అతన్ని పునీతుణ్ని చేసి మళ్లీ భూమికి పంపిస్తాడు. అప్పుడు నీ కాపురం చక్కబడుతుంది.''
ఫెరోండో భార్య చాలా సంతోషించింది. ''అలా చేయండి స్వామీ, మీకు ఋణపడి వుంటాను.'' అంది మోకరిల్లి.
''ఈ ఋణాలు వుంచుకోకూడదు. ఎప్పటికప్పుడు తీర్చివేయాల్సిందే. నా కోరిక తీర్చి ప్రత్యుపకారం చేయి.'' అన్నాడు ఏబట్.
ఆమె నిర్ఘాంతపోయి ''స్వామీ మీరు పవిత్రమూర్తి. మీకు యిలాటి తుచ్ఛమైన కోర్కె కలగడం..'' అంది.
''నా ఆత్మ పవిత్రమైనదే, పరిశుద్ధమైనదే. దేహం చేసే పాపాలు దానికి అంటవు. ఒక పూజారి నిన్ను చూసి మోహితుడయ్యాడంటే నువ్వు గర్వించాలి. ఎందుకంటే వృత్తిపరంగా మేము ఎందరో స్త్రీలను అతి సన్నిహితంగా చూస్తాము. వారిలో ఎందరో అందగత్తెలున్నా మా మనసు చలించదు. కానీ నిన్ను చూడగానే చలించానంటే దాని అర్థం, నువ్వు దైవకృపకు పాత్రురాలయ్యావని. అందువలననే దైవం నా ద్వారా నీ సంసారాన్ని చక్కదిద్దాలనుకున్నాడు. ఆ క్రమంలో నా దేహాగ్నిని తృప్తిపరచి, నా మనసును తనవైపు మళ్లించాలని చూస్తున్నాడు.''
ఆమె ఆలోచనలో పడింది. అదను చూసి ఏబట్ మరింతగా వివరించాడు – ''అతను తన పాపప్రక్షాళనలో మునిగివుండగా నేను నీకు తోడుగా వుంటాను. నా రాకపోకలు ఎవరికీ తెలియనివ్వను. చర్చికి విరాళాలుగా వచ్చిన అనేక నగలున్నాయి. నీ వంటి అపురూప సౌందర్యవతులే వాటిని ధరించడానికి యోగ్యులు. ఇదిగో యీ వుంగరం ధరించు. సంశయాలు తొలగిపోతాయి.'' అన్నాడు. విలువైన ఆ వుంగరం చూసి ఆమె వూగిసలాట పటాపంచలైంది. అంగీకారంగా తలవూపింది.
కొన్ని రోజుల తర్వాత ఏబట్ ఫెరోండోను తన వద్దకు రప్పించాడు. అవీ యివీ కబుర్లు చెపుతూ అతనికి యిచ్చిన పానీయంలో తగుపాళ్లలో ఒక పొడిని కలిపాడు. ఆ పొడి అతను తూర్పుదేశాల నుండి సంపాదించాడు. దానివలన కొద్ది సేపటిలో ఎంతటి గాఢమైన నిద్ర వస్తుందంటే ఉచ్ఛ్వాసనిశ్వాసాలు ఆగిపోయి చచ్చిపోయారేమో ననిపిస్తుంది. పానీయం తాగించిన తర్వాత అతన్ని వెంటపెట్టుకుని యితర పూజారుల వద్దకు తీసుకెళ్లాడు.
అక్కడ అందరూ అతన్ని వేళాకోశం చేస్తూ ఆటపట్టిస్తూండగానే అతను ఒక్కసారిగా కుప్పకూలాడు. అతని నాడి పట్టుకుని చూసి చనిపోయాడని వాళ్లు తేల్చాక, వెంటనే అతని అంత్యక్రియలకు చర్చి ఆవరణలోని శ్మశానంలోనే ఏర్పాటు చేయడం, శాస్త్రోక్తంగా శవపేటికలో పెట్టి సమాధి చేయడం జరిగిపోయాయి.
మూడు రోజుల తర్వాత ఏబట్ తాను గతంలో పనిచేసిన వూళ్లోని నమ్మకమైన సహచరుణ్ని రప్పించాడు. అతను మంచి దృఢకాయుడు. ఇద్దరూ కలిసి రాత్రి ఫెరోండో సమాధి తవ్వి అతన్ని బయటకు లాగారు. చర్చిలో ఒక మూల చీకటిగదిలోకి తీసుకెళ్లి అతని బట్టలూడదీసి, మొహం మీద నీళ్లు చిలకరించి లేపారు. పొడి ప్రభావం నాలుగురోజులే కాబట్టి ఫెరోండో నిద్రలోంచి లేచినట్లు లేచాడు.
వెంటనే ఏబట్ అనుచరుడు ఒక కొరడా తీసుకుని అతన్ని చితకబాదాడు. ''ఏమిటిది? ఎవరు నువ్వు? ఇక్కడంతా చీకటిగా వుందేమిటి?'' అని అడిగితే ''ఇది నరకం. బతికివుండగా చేసిన పాపాలకు శిక్ష వేసి, ప్రక్షాళన చేసి మన ఆత్మలను స్వర్గానికి పంపుతారు. నేను కూడా నీలాటి పాపినే. అయితే తక్కువ పాపిని. అందువలన నిన్ను శిక్షించే శిక్షను నాకు దేవుడు విధించాడు.'' అన్నాడతను.
''నేను చేసిన పాపమేమిటి?'' అడిగాడు ఫెరోండో.
''దేవుడు నీకు మంచి జీవితాన్ని యిచ్చాడు, అందమైన భార్యను యిచ్చాడు. అయినా నువ్వు అసూయాగ్రస్తుడివై ఆమె మనసు కష్టపెట్టావు. ఆమె నీ పట్ల ఎంతో విశ్వాసంగా వున్నా అనుక్షణం సందేహిస్తూ నీ జీవితాన్ని దుర్భరం చేసుకున్నావు. ఆమె జీవితాన్ని నాశనం చేశావు. అందుకని నీకీ శిక్ష.''
''నిజమే, నా భార్య చాలా మంచిది. ఆమెకు వేదన కలిగించాను.'' అని ఒప్పుకుంటూనే ఫెరోండో ''ఇది నరకమైతే వేలాదిమంది వుండాలి కదా, నువ్వూ నేనూ మాత్రమే వున్నామేం?'' అని అడిగాడు.
''లేరని ఎవరు చెప్పారు? చుట్టూ పాపులే, అయితే ఒకరి కొకరు కనబడరు. బాధలు భరించలేక వాళ్లు పెట్టే కేకలు విన్నా, రక్తసిక్తమైన వారి శరీరాలు చూసినా యితర పాపులు భయపడతారని దేవుడు యీ ఏర్పాటు చేశాడు. మనిద్దరం ఒక జంట. అందుకే ఒకరికొకరు కనబడుతున్నాం.'' అంటూ మళ్లీ కొట్టడం లంకించుకున్నాడు.
ఈలోగా ఏబట్ అతని దుస్తులు వేసుకుని ఎవరి కంటా పడకుండా చీకట్లో ఫెరోండో భార్య దగ్గరకి వెళ్లాడు. ఆమెకి మెళ్లోకి ఒక నగ బహూకరించి ప్రసన్నురాలిని చేసుకున్నాడు. ఆమె కూడా అతని తెలివితేటలను చూసి మురిసింది. మూర్ఖుడైన తన భర్త కంటె యితనే ఎంతో గొప్పగా తోచాడామెకు.
ఇక్కడ దెబ్బలు తినితిని ఫెరోండో సొమ్మసిల్లి పడేవేళకు లేపి ఏబట్ అనుచరుడు అన్నం, పానీయం యిచ్చాడు. ఫెరోండోకు అనుమానం వచ్చింది, ''చచ్చిపోయినవాళ్లకు ఆకలిదప్పులుండవని అంటారుగా..'' అని.
''ఎవరా అన్నది? తెలియనివాళ్లు చెప్పిన మాటలు వినకు. ఆకలి వేస్తుంది. వాళ్ల తాలూకువాళ్లు భూలోకంలో చర్చిలో ఏ ఆహారం యిస్తే అదే వీళ్లకు దక్కుతుంది. నిజానికి నీకిప్పుడు పెడుతున్నవి నిన్న ఉదయం నీ భార్య చర్చిలో పేదలకు పెట్టినవే.'' అని చెప్పాడు ఏబట్ సహచరుడు.
తినడం ముగించాక ఫెరోండో ''భోజనం బాగానే వుంది కానీ పానీయం బాగా లేదు. నా భార్య కక్కుర్తిపడి చవకరకం మద్యం పోసినట్లుంది. నేలమాళిగలో దాచిన నేను రహస్యంగా దాచుకున్న మద్యాన్ని దానమిచ్చినట్టయితే నాకు మంచిది దక్కేది.'' అన్నాడు.
వెంటనే యీ వార్త ఏబట్‌కు వెళ్లింది. అతను ఫెరోండో భార్యకు చెప్పి ఆ మద్యాన్ని బయటకు తీయించి యిద్దరూ కలిసి తాగారు.
నెలలు గడుస్తున్న ఏబట్ ఫెరోండో భార్యను మరింత శ్రుతి చేస్తున్నాడు. ఇక్కడ అతని అనుచరుడు ఫెరోండోను ఎడాపెడా వాయించేస్తున్నాడు. ఫెరోండో దుస్తుల్లో రాత్రి అయ్యేసరికి ఏబట్ వాళ్ల యింటికి వెళుతూ, తెల్లవారుఝామునే తిరిగి వచ్చేసేవాడు. కొన్ని సార్లు యిరుగుపొరుగులు అతన్ని చూడడం సంభవించింది కానీ ఏబట్‌ను సాధారణ దుస్తుల్లో చూడకపోవడం వలన, అతను వేసుకున్న ఫెరోండో దుస్తుల కారణంగా అది ఫెరోండో దెయ్యంగా భ్రమపడేవారు. భార్యమీద వ్యామోహంతో యింటి చుట్టుపట్లే సంచరిస్తోందని చెప్పుకునేవారు. ఈ పుకార్లు విని అతని భార్య నవ్వుకునేది.
ఇది ఎంతకాలం సాగేదో కానీ ఫెరోండో భార్య గర్భవతి అయింది. ఇక ఫెరోండోను బయటకు తీసుకురాక తప్పదని ఏబట్ గ్రహించాడు.
మర్నాడు దేవదూతలా వేషం వేసుకుని, గొంతు మార్చుకుని ''ఫెరోండో, నీకో శుభవార్త, దేవుడు నిన్ను కరుణించాడు. నీ తప్పు నువ్వు గ్రహించి అసూయాగుణాన్ని విడిచిపెట్టావు కాబట్టి నీకు మళ్లీ బతికే అవకాశం యిస్తున్నాడు. నీ భార్య నీకొక శిశువును కంటుంది. దాన్ని దైవప్రసాదంగా స్వీకరించు. నీ భార్య, నీ స్నేహితుడైన ఏబట్ చేసిన ప్రార్థనల కారణంగానే నీవు పునర్జీవితుడవుతున్నావు. వాళ్ల మనసులు ఎప్పుడూ కష్టపెట్టకు. నీ భార్య ఉత్తమురాలు, ఎప్పుడూ శంకించకు. ఆమె ఎవరితో మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా ఊరికే అనుమానించి వేధించి దైవాగ్రహానికి గురి కావద్దు. ఏబట్ మాట ఎన్నడూ జవదాటవద్దు. అతను నీ ప్రాణదాత అనే మాట మర్చిపోవద్దు.'' అని గంభీరంగా చెప్పాడు.
''చనిపోయినవారు మళ్లీ బతకడం కల్ల అంటారు కదా'' అంటూ ఆశ్చర్యపడ్డాడు ఫెరోండో.
''దేవుడు తలచుకుంటే ఏ అద్భుతమైనా జరుగుతుందని కూడా వారనలేదా?'' అని చివాట్లు వేశాడు ఏబట్.
ఆ రాత్రి పానీయంలో మళ్లీ పొడి వేసి కలిపారు. ఫెరోండో మూర్ఛపోయాడు. అతని బట్టలు మళ్లీ అతనికి తొడిగేసి, తీసుకెళ్లి సమాధిలో శవపేటికలో పడుకోబెట్టేశారు. మర్నాటికల్లా ఫెరోండోకు మెలకువ వచ్చింది. శవపేటిక చీలికల్లోంచి వెలుతురు పడడం చూసి, కాస్త ప్రయత్నించి మూత తీసుకుని బయటకు వచ్చేశాడు. అతన్ని చూడగానే చర్చిలోని పూజారులు కంగారుపడ్డారు. ఏబట్‌ను పిలుచుకుని వచ్చారు. అతను కాస్సేపు ఆశ్చర్యం నటించి, తన ప్రార్థనలను విన్నందుకు దైవాన్ని పొగిడి, దైవలీలను కొనియాడి ఫెరోండోను యింటికి పంపించాడు.
అతను యింటికి వెళ్లి తన నరకయాతనల గురించి చెప్తే అందరూ ఆశ్చర్యపడ్డారు. చచ్చి బతికిన మనిషిగా అందరూ మెచ్చుకున్నారు తప్ప అతన్ని చూసి ఎవరూ హేళన చేయలేదు. అతను తిరిగి వచ్చిన రాత్రే అతని భార్య దరిచేరింది. దేవుడు మనను మరో బిడ్డతో కరుణిస్తాడంటూ ఫెరోండో మురిసిపోయాడు. అప్పటికే కరుణించిన సంగతి తెలిసిన తెలిసిన అతని భార్య ముసిముసి నవ్వులు నవ్వుకుంది.
మళ్లీ 'నరకానికి' వెళ్లే ఉద్దేశం లేని ఫెరోండో తన భార్యపై ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. అప్పటికే ఏబట్‌ను బాగా మరిగిన ఆమె ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంది. తొమ్మిది నెలల తర్వాత ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. ఫెరోండో ఆ బిడ్డను దేవుడిచ్చిన కానుకగానే చూసి మురిశాడు. అతని భార్య, ఏబట్ రహస్యంగా కలిసిన ప్రతీసారీ ఫెరోండో అమాయకత్వాన్ని తలచుకుని పడిపడి నవ్వుకునేవారు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2020)
[email protected]