ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ సినిమా చాలా నెలలుగా వార్తల్లోనే వుంటూ వస్తోంది. దర్శకుడు శివ స్క్రిప్ట్ వర్క్ మీదే వున్నారు. జనవరి నుంచి సెట్ మీదకు వెళ్తుందని వార్తలు వున్నాయి కూడా. అయితే ఈ పాన్ ఇండియా సినిమా భారీ పెట్టుబడి అవసరం అని, అందుకోసం నిర్మాత ఫండింగ్ కోసం ప్రయత్నిస్తున్నారని కొన్ని నెలల కిందటే వెల్లడించాం.
ఓ బడా డిస్ట్రిబ్యూటర్ ను ఈ సినిమాను అడ్డం పెట్టుకుని భారీ అడ్వాన్స్ అడగడంతో ఆ వార్త బయటకు వచ్చింది. ఆచార్య సినిమాతో కొరటాల ఇమేజ్ డ్యామేజ్ కావడంతో ఎన్టీఆర్ సినిమాకు వెంటనే సినిమా ఫైనాన్స్ రావడం కష్టం. పైగా సినిమా ఫైనాన్స్ చేసే జనాలు చాలా రేర్ కేసులకే ఫండింగ్ చేయాలని డిసైడ్ అయిపోయారు.
ఇలాంటి నేపథ్యం ఈ సినిమా నిర్మాత, అలాగే కొరటాల ఇంకో సన్నిహిత మిత్రుడు కలిసి ఫండింగ్ ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. ఇందుకు అమెరికా జనాలను పట్టుకునే ప్రయత్నంలో వున్నారని టాక్. అమెరికాలో వున్న ‘మనవాళ్లు’ కొంత మంది సినిమా జనాలకు అప్పులు ఇస్తుంటారు. అక్కడ సంపాదించింది ఇండియాలో గుడ్లు పెడుతుందని అలా చేస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఒకటి రెండు సంస్థలకు ఇలాంటి ఫండింగ్ అందుతూ వుంటుంది.
ఇప్పుడు ఆ రూట్ లోనే ఫండింగ్ ప్రయత్నాలను ఎన్టీఆర్ 30 నిర్మాత ప్రారంభించారని తెలుస్తోంది. ప్రారంభంలో ఓ పాతిక నుంచి యాభై కోట్లు వచ్చేస్తే సినిమాను కొంత వరకు తీసుకెళ్లిపోవచ్చు. సినిమా ఎప్పుడైతెే కొంత వరకు వెళ్తుందో, ఆటో మెటిక్ గా బయ్యర్లు, ఇతరత్రా మార్గాల నుంచి మరి కొంత వస్తుంది.
ఈ సినిమాకు జాన్వీ కపూర్ ను హీరోయిన్ అని టాక్ వుంది. అది అఫీషియల్ అయితే ఫండింగ్ సమస్యలు చాలా వరకు గట్టెక్కిపోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ – జాన్వీకపూర్ అంటే ఆ బజ్ వేరుగా వుంటుంది.