ఉత్తరభారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేల కంటె పనికిమాలిన, అప్రయోజకులైన ఎమ్మెల్యేలు చాలా మంది ఉంటారు. అడ్డదారుల్లో ఎన్నికల్లో గెలిచి, ఎమ్మెల్యేలు అయిపోయి అదే ప్రయోజకత్వం కింద చెలామణీ అయ్యేవారూ ఉంటారు. కానీ.. వారందరూ కూడా తెలుగు రాష్ట్రాల ఎన్నికల సందడి, ఖర్చులు విని ముక్కున వేలేసుకుంటారు.
ఇంతేసి ఖర్చు ఒక్కో ఎమ్మెల్యే ఎన్నికకోసం పెడుతున్నారా? అని ఆశ్చర్యపోతుంటారు. అలాంటివారికి ఇప్పటి ఎన్నిక ఇంకా పెద్ద షాక్ అవుతుందేమో. ధనప్రవాహం, కానుకల ప్రవాహం, అధికార మదం ప్రవాహం, దందాల ప్రవాహం.. విచ్చలవిడిగా సాగిన మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో ఏ పార్టీ గెలిచినప్పటికీ కూడా.. అది అపభ్రంశపు విజయమే అనిపించుకుంటుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు అవుతుంది.
ఇవాళ మునుగోడు ఎన్నికకు పోలింగ్ జరగబోతోంది. చివరినిమిషం దాకా ప్రధాన ప్రత్యర్థులుగా పరిగణిస్తున్న తెరాస–బిజెపి మాటలతోనూ, చేతలతోనూ కొట్టుకున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీకి కూడా గణనీయమైన బలం ఉన్న ఈ నియోజకవర్గంలో, కోమటిరెడ్డి ఫిరాయింపు తర్వాత వారి పరిస్థితి ఎలా మారుతుందో అని అంచనా వేయడానికి కూడా సాధ్యం కానంత.. బీభత్సంగా ఆ రెండు పార్టీలు తలపడ్డాయి.
టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఒక ఎమ్మెల్యే ఉపఎన్నికకోసం ఈ స్థాయిలో ఆ పార్టీ నాయకులంతా మూకుమ్మడి దండయాత్ర చేసినట్టుగా పనిచేయడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదు. ఈటల రాజేందర్ ను ఓడించడానికి కూడా అనేకమంది తెరాస మంత్రులు, శ్రేణులు ఆ నియోజకవర్గంలో మోహరించి పనిచేశాయి. కానీ.. ఈస్థాయిలో కాదు. అప్పట్లో కేటీఆర్ అంతగా ఫోకస్ పెట్టలేదు. ఈసారి మునుగోడును అలా తేలిగ్గా తీసుకోలేదు. కేటీఆర్, హరీష్ రావు సహా సమస్త నాయకులూ పాటుపడ్డారు.
బిజెపి కూడా తక్కువ తినలేదు. వారికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. వారూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీనే. పడ్డంత కష్టమూ పడ్డారు. వాడదగినంత అధికారమూ వాడారు. కేంద్ర పోలీసు బలగాల్ని తెప్పిస్తాం.. లాంటి మేకపోతు గాంభీర్యపు ప్రకటనలూ చేశారు. అధికారబలం ప్రదర్శించడంలో ఇరు పార్టీలు తగ్గలేదు.
ధన ప్రవాహం సంగతి చెప్పనక్కర్లేదు. 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరాడనే ప్రచారాన్ని తెరాస ముమ్మరంగా సాగించింది. రాజగోపాల్ దాన్ని ఖండించలేకపోయారు. కాంట్రాక్టులు నా సొంత విషయం, ఎప్పటినుంచో చేస్తున్నా.. లాంటి మాయ మాటలు చెప్పారు. ఏదేమైనా.. 18వేల కోట్ల కాంట్రాక్టు వలన వచ్చిన ఎన్నికలు అనే సంగతి బాగా ప్రజల్లోకి వెళ్లడం.. వలన.. ప్రజల్లో ఆశ పెరిగింది. ఓటుకు డబ్బు ఆశించే వాళ్లు అతిగా ఆశించడం ప్రారంభం అయింది. ఓటుకు తులం బంగారం లాంటి మాటలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. లిక్కర్ సంగతి చెప్పనక్కర్లేదు. ప్రచారం మొదలైన తొలినాటినుంచి లిక్కర్ ప్రవాహమే.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఇన్ని రకాల అపభ్రంశపు విషయాల మధ్య.. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ఇవాళ జరుగుతోంది. ఈ ఎన్నికలో ఫలితం ఎలాగైనా రావొచ్చు గాక.. అది నిజాయితీ గల ప్రజాభిప్రాయాన్ని, ప్రజల తీర్పును ప్రతిబింబిస్తుందా? అసలు ప్రజలతీర్పు అవుతుందా? ప్రజాస్వామ్యాన్ని భ్రష్టత్వం చెందించడంలో ఈ పార్టీలు రెండూ కొత్తపుంతలు తొక్కాయి. సిగ్గుమాలిన దిగజారుడు విధానాలకు పాల్పడ్డాయి. అధికారంలో ఎవరుంటారో తేల్చడంలో ఏమాత్రం ప్రభావం చూపని ఒక సాధారణ ఉప ఎన్నిక మీద రెండు పార్టీలు ఇంత ఘోరమైన వక్రమార్గాలలో తలపడడం గమనార్హం.
దేశాన్ని పదేళ్లుగా ఉద్ధరించేస్తున్నాం అని చెప్పుకుంటున్న బిజెపి, అబ్బెబ్బే వాళ్లకు చేతకావడం లేదు.. తెలంగాణ సంగతి అయిపోయింది, నేనే వచ్చి మొత్తం దేశాన్నీ ఉద్ధరించేస్తా అని చాటుకుంటున్న టిఆర్ఎస్.. ఇద్దరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఎన్నికలు ఇవి. అందుకే ఎవరు విజయం సాధించినా.. అది అపభ్రంశపు విజయమే అవుతుంది.