జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. రాజధాని తరలింపు నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు సరైనవి కాదని ఆయన ఇప్పటికే ఆరోపించారు. ఆ వాదనకు మద్దతుగానే క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తనయాత్రను షెడ్యూలు చేసుకున్న తర్వాత అక్కడి పరిస్థితి మారిపోయింది.
రాజధానిని తరలించడం లేదని ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది. స్పష్టంచేసింది. అలాంటి అనుమానాలు ఎవరో రేకెత్తించిన పుకార్ల వల్లే పుట్టాయని, వాటికి తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని తేల్చేసింది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? రాజధాని ప్రాంతంలో రైతులను ఆయన ఊరడిస్తారు? ఎవరి ఆందోళనలకు ప్రభుత్వం కారణమవుతోందని నిందిస్తారు? అన్నీ ప్రశ్నలే! ఆయన అర్జంటుగా తన పర్యటన ఎజెండాను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ పర్యటనలో రాజధానిలో ఆందోళన చెందుతున్న రైతులను గ్రామాల్లో కలవడం, రాజధానిలో వివిధ ప్రాంతాలలో జరుగుతున్న నిర్మాణాలను స్వయంగా పరిశీలించడం, అవి ఏ ఏ దశలో ఉన్నాయో తెలుసుకోవడం… ఆయన ప్రధాన లక్ష్యం. ఆ తరువాత సాయంత్రం జనసేన కార్యాలయంలో రాజధాని ప్రాంత రైతులతో సమావేశం నిర్వహించబోతున్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకోబోతున్నారు. రాజధాని తరలింపు అనే పాయింట్ లేకుండా పోయింది కనుక, రైతులను కలవడం అర్థం లేని విషయం అనిపించుకుంటుంది.
ఇక పవన్ కు రాజధాని ప్రాంత నిర్మాణాలను పరిశీలించడం అనే పని ఒక్కటే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధుల లభ్యత గురించి పట్టించుకోకుండా, నిధుల వనరులను సమీకరించుకునే సలహాలు చెప్పకుండా నిర్మాణాలపై విమర్శలు అనేది మూర్ఖత్వం అవుతుంది. పవన్ పర్యటన కోసం ఇంకా ఒక పాయింట్ మిగిలి ఉంది. రాజధాని ప్రాంతంలో పొలాలు ఇచ్చిన రైతులకు చెల్లించవలసిన వార్షిక కౌలు సొమ్ములను ఇప్పటిదాకా ఇవ్వలేదు అనే ఆరోపణ ఒకటి ఉంది. అయితే ప్రతిఏటా ఆగస్టు సెప్టెంబర్ నెలల్లోనే ఆ మొత్తాలను ఇస్తూ వచ్చారని, బొత్స గతంలోనే చెప్పారు.
సిఆర్డిఏ సమీక్ష సమావేశం పూర్తయిన తర్వాత ప్రెస్ మీట్ లో కూడా… ఒకటి రెండు రోజుల్లో కౌలు సొమ్ములచెల్లింపు ప్రారంభమవుతుందని బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. పాపం పవన్ కళ్యాణ్ కు ఆ అంశం మీద కూడా రైతుల తరఫున మాట్లాడడానికి వీలు లేకుండా నోరు కట్టేసినట్టు అయింది. ఇక ఆయన చేయగలిగింది ఒక్కటే! నేను పర్యటనకు వస్తున్నాను గనుక ప్రభుత్వం భయపడి.. ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నది అని అనడం తప్ప ఆయన వద్ద మరోమాట లేదు. అందుకే ప్రభుత్వం మీద ఉద్యమించడానికి వీలుగా పవన్ ప్లాన్ చేసుకున్న టూరు తుస్సుమనవచ్చునని ప్రజలు భావిస్తున్నారు.