పోలవరం రాద్ధాంతం అయిపోయింది, రాజధాని రాద్ధాంతం సద్దుమణుగుతోంది. కొత్తగా టీడీపీ ఇప్పుడు బీసీ గొడవ చేస్తోంది. బీసీలను, అందులోనూ ఓ మహిళను అనరాని మాటలంటారా, సోషల్ మీడియాలో అవమానిస్తారా అంటూ రెచ్చిపోతున్నారు పెదబాబు, చినబాబు. లోకేష్ ట్విట్టర్ లో మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇదేనా బీసీలకిచ్చే మర్యాద, ఇలా బీసీ మహిళల్ని అవమానించడమే మీ నాయకుడు మీకు నేర్పించారా అంటూ వైసీపీ నేతల్ని తిట్టిపోస్తున్నారు.
రాజేశ్వరి అనే ఓ బీసీ మహిళ చంద్రబాబుని కలవడానికి వచ్చినప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టి అసభ్య కామెంట్లు పెట్టారనేది లోకేష్ ట్వీట్ సారాంశం. అసలా పోస్టింగ్ ఎవరు చేశారు, వారికీ వైసీపీకి సంబంధం ఉందా అనేది లోకేష్ కే తెలియాలి. ఒకవేళ ఉంటే.. చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కదా అంటే అదీలేదు. పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఆ మధ్య లోకేష్ పై పోస్ట్ లు పెడుతున్నారంటూ పోలీస్ కేసు పెట్టారు కదా, మరిప్పుడు బీసీ మహిళకు అండగా టీడీపీ నేతలు కేసులెందుకు పెట్టలేదో వారికే తెలియాలి.
చట్టపరంగా పోరాడలేక, ఇలా ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు చినబాబు. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల వరదల సమయంలో తమ పెయిడ్ ఆర్టిస్ట్ తో బీసీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని కించపరుస్తూ అనరాని మాటలు అనిపించారు. కులం పేరుతో తీవ్రంగా దూషించారు. దీంతో ఆ సామాజిక వర్గమంతా టీడీపీపై గుర్రుగా ఉంది. దీన్ని పక్కదారి పట్టించడానికే ఇప్పుడు బీసీ నాటకాన్ని రక్తికట్టించాలని చూస్తున్నారు చినబాబు. ప్రతిపక్షంలో ఎవరు మాట్లాడితే, అదే సామాజిక వర్గం వారితో తిట్టించే చంద్రబాబు కుటిల రాజకీయ నీతిని లోకేష్ కూడా బాగానే వంటబట్టించుకున్నట్టు ఉన్నారు.
బీసీల్లో టీడీపీ పలుచన అవుతుందనుకుంటున్న టైమ్ లో, అదే బీసీలను వైసీపీ కించపరుస్తోందంటూ నిందలు వేస్తున్నారు. అయ్యయ్యో నా బీసీలను నానా మాటలంటారా, బీసీలంటే మీకు అంత చులకనా.. అంటూ ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తున్నారు. నిజంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎవరి హయాంలో న్యాయం జరిగిందో, ఎవరి పాలనలో వారి ఎదుగుదలకు అవకాశాలు వచ్చాయో ఆయా వర్గాలకు బాగాతెలుసు.
అణగారిన వర్గాల పక్షపాతిగా జగన్ పేరు తెచ్చుకుంటున్న వేళ, నిందలతో కాలక్షేపం చేయడంతో పాటు, తమ తప్పుని కప్పి పుచ్చుకోడానికి టీడీపీ చేస్తున్న కుట్ర ఇది. ఈ విషయం పచ్చ బ్యాచ్ కి అర్థంకాకపోయినా, సామాన్యులకు మాత్రం బాగా అర్థం అయింది.