టిక్ టాక్.. ఓ కథ ముగిసింది

ఎన్నో యాప్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కొన్ని మాత్రం జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోతాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కర్ని కట్టిపడేస్తాయి. అలాంటిదే టిక్ టాక్. నిజానికి ఇది ట్విట్టర్, ఇనస్టాగ్రామ్ లా సెలబ్రిటీలు,…

ఎన్నో యాప్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కొన్ని మాత్రం జనబాహుళ్యంలోకి చొచ్చుకుపోతాయి. సెలబ్రిటీల నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కర్ని కట్టిపడేస్తాయి. అలాంటిదే టిక్ టాక్. నిజానికి ఇది ట్విట్టర్, ఇనస్టాగ్రామ్ లా సెలబ్రిటీలు, చదువుకున్నోళ్లకు చెందిన యాప్ కాదు. ఇది అందరి యాప్. సామాన్యుడ్ని కూడా సెలబ్రిటీని చేసిన యాప్.

ఈ యాప్ తో పాపులరైన వాళ్లు చాలామంది ఉన్నారు. దేశవ్యాప్తంగా వేలల్లోనే ఉన్నారని చెప్పొచ్చు. స్థానికంగా చూసుకుంటే ఉప్పల్ బాలు ఇలా టిక్ టాక్ నుంచే పాపులరయ్యాడు. రాక్షసుడు సినిమాలో నటించిన పాపకు ఈ టిక్ టాక్ నుంచే ఆఫర్ వచ్చింది. ఇలా ఒకరు కాదు.. టిక్ టాక్ తో పాపులరైన వాళ్లు వేలల్లో ఉన్నారు. టిక్ టాక్ తో డబ్బులు సంపాదించుకున్న బ్యాచ్ కూడా ఎక్కువే.

అటు స్టార్స్ కూడా చాలామంది ఈ టిక్ టాక్ ను ఉపయోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా తమ సినిమా ప్రమోషన్ టైమ్ లో టిక్ టాక్ ను ప్రతి స్టార్ వాడుకున్నాడు. ఇలా జనాల్లోకి చొచ్చుకుపోయిన ఈ టిక్ టాక్ తో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్న ఈ టిక్ టాక్ లో దాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులే ఎక్కువమంది.

ఈ టిక్ టాక్ వల్ల దేశవ్యాప్తంగా వేల కుటుంబాల నాశనమయ్యాయి. అక్రమ సంబంధాలు పెరిగిపోయాయి. బూతు ఎక్కువైపోయింది. విశృంఖలత్వం పెచ్చుమీరింది. ఫలితంగా భారతీయ సంప్రదాయాలు భ్రష్టుపట్టాయి. వేల కుటుంబాల్లో చిచ్చుపెట్టిన ఈ యాప్ ను బ్యాన్ చేయాలంటూ చాన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఉద్యమాలు నడిచాయి. అటు కొన్ని స్వచ్చంధ సంస్థలు, మానవ హక్కుల సంఘాలు కూడా దీన్ని బ్యాన్ చేయమని డిమాండ్ చేశాయి.

ఎట్టకేలకు ఇండియాకు టిక్ టాక్ నుంచి విముక్తి లభించింది. ఈ యాప్ తో సహా చైనాకు చెందిన మరో 59 యాప్స్ ను బ్యాన్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ యాప్స్ ను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇందులో ఒకటి టిక్ టాక్.

టిక్ టాక్ తో పాటు భారత్ లో బాగా పాపులరైన హలో, యూసీ బ్రౌజర్, న్యూస్ డాగ్, షేర్ ఇట్, క్యామ్ స్కానర్ లాంటి యాప్స్ కూడా బ్యాన్ అయ్యాయి. వీటి సంగతి పక్కనపెడితే.. టిక్ టాక్ బ్యాన్ అవ్వడంపై మాత్రం మెజారిటీ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

చంద్రబాబు బాకీలు తీరుస్తున్న జగన్

ఐదుసార్లు ట్రైచేసి నావల్లకాక వదిలేసాను