ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు మోడీ ప్రసంగించబోతున్నారని ట్విటర్లో ప్రకటించారు. ఇలాంటి ప్రసంగాలతో ప్రజలకు హితబోధలు చేయడం, చప్పట్లు కొట్టడం, దీపాలు పెట్టడం వంటి టాస్క్ లు ఇవ్వడం చేస్తున్నారు మోడీ. జనతా కర్ప్యూ, మూడు వారాల లాక్ డౌన్ వంటి ప్రకటనల వరకూ మోడీ జనాలను ఉత్సాహపరిచే ప్రసంగాలను చేశారు. ఆ తర్వాత లాక్ డౌన్ ఎక్స్ టెన్షన్లకు ఆయన ప్రసంగాలు చేయలేదు. ఆ బాధ్యత కేంద్ర హోం శాఖ మీద వదిలారు.
ఇక అన్ లాక్ సందర్భంగా మోడీ ప్రసంగించారు. కరోనాపై భారత్ విజయపథంలో సాగుతోందని ప్రకటించారు. అయితే అన్ లాక్ స్టేజ్ లో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూ ఉంది. రోజువారీ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ పోతోంది. ఇప్పుడు రోజువారీ కేసుల సంఖ్య ఇరవై వేల స్థాయికి చేరుకున్నట్టుగా ఉంది!
జూన్ 30తో అన్ లాక్ ఫేస్ వన్ గడువు ముగియబోతోంది. ఇక జూలై ఒకటి నుంచి అన్ లాక్ ఫేస్ టు మొదలు కావాల్సి ఉంది. అయితే నెల రోజులుగా లాక్ డౌన్ ను మినహాయించిన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ లాక్ డౌన్ల దిశగా వెళ్తున్నాయి. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్రం లెక్కల ప్రకారం రేపటి నుంచి అన్ లాక్ ఫేస్ 2 ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కొత్తగా అన్ లాక్ అయ్యేవేమీ కనిపించడం లేదు. స్కూళ్లు, థియేటర్లు, జిమ్ లు, పబ్లిక్ పార్కులు.. ఇప్పటి వరకూ లాక్ డౌన్ లో ఉన్న ఇలాంటి వన్నీ రేపటి నుంచి కూడా క్లోజ్ చేసే ఉంటాయని కేంద్రం ప్రకటించింది.
ఈ క్రమంలో మోడీ ఈ రోజు ఏం ప్రసంగిస్తారు? కరోనా-లాక్ డౌన్ గురించి ఏం చెబుతారు? హిత వచనాలూ, మాటలేనా? లేక పేదలు, కూలీలు, మధ్యతరగతి గురించి ఊరటను ఇచ్చే ప్రకటనలు ఏమైనా ఉంటాయా?